ఉత్కంఠ పోరులో 5 పరుగుల తేడాతో వెస్టిండిస్
పై న్యూజిలాండ్ గెలుపు
వెస్టిండిస్
చెలరేగితే ఎలా ఉంటుందో ప్రపంచ క్రికెట్ అభిమానులు మరోసారి కళ్లారా వీక్షించారు.
న్యూజిలాండ్ తో మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో ఓడినా వెస్టిండిస్ బ్యాటింగ్ ను ఎవరూ
మెచ్చుకోకుండా ఉండలేరు. తొలుత గేల్ చెలరేగితే ఆ తర్వాత కార్లస్ బ్రాత్ వెయిట్
విజృంభించిన తీరు క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది. వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.29 మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో
శనివారం జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ను వెస్టిండిస్ దాదాపు ఓడించినంత పని చేసింది.
వెస్టిండిస్ టాస్ గెలిచి న్యూజిలాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. 50 ఓవర్లలో ఆ
జట్టు 8 వికెట్లు పోగొట్టుకుని 291 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ కేన్
విలియమ్సన్(148) టోర్నీలో వరుసగా రెండో సెంచరీ చేశాడు. అనంతరం బ్యాటింగ్
ప్రారంభించిన వెస్టిండిస్ 292 పరుగుల లక్ష్య ఛేదనకు ఏమాత్రం వెరవలేదు. చాన్నాళ్లకు
ఓపెనర్ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 6 సిక్సర్లు, 8 బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 84
బంతుల్లోనే 87 పరుగులు చేసి అయిదో వికెట్ గా ఔటయ్యాడు. మరో ఓపెనర్ కీపర్ షాయ్ హోప్(1),
నికోలస్ పూరన్(1) ఒకరివెంట ఒకరు పెవిలియన్ బాట పట్టారు. కెప్టెన్ జాసన్ హోల్డర్(0)
మరోసారి నిరాశ పరిచినా ఆ తర్వాత షిమ్రాన్ హెట్మయర్(54), కార్లోస్ బ్రాత్
వెయిట్(101) ఇన్నింగ్స్ ను నిర్మించిన తీరు అపురూపమనే చెప్పాలి. ముఖ్యంగా బ్రాత్
వెయిట్ 82 బంతుల్లోనే 5 సిక్సర్లు, 9 బౌండరీలతో సెంచరీ కొట్టాడు. సిక్సర్లు,
బౌండరీలతోనే వెయిట్ 66 పరుగుల సాధించాడంటేనే అతని విజృంభణ ఏస్థాయిలో ఉందో
చెప్పొచ్చు. చివర్లో 7 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన స్థితిలో అందరూ వెస్టిండిస్
గెలుస్తుందనే అనుకున్నారు. ఒకే ఒక వికెట్ మిగిలి ఉన్నదశలో వెయిట్ భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు. నీషం బౌలింగ్ లో బౌల్ట్ క్యాచ్ పట్టగా వెయిట్ వెనుదిరగడంతో వెస్టిండిస్ ఇన్నింగ్స్
కు తెరపడింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ కు 4 వికెట్లు, లొకీ ఫెర్గుసన్ కు 3
వికెట్లు లభించగా మాట్ హెన్రీ, జేమ్స్ నీషమ్, కోలిన్డె గ్రాండ్ హోమ్ తలో వికెట్
పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్లు మార్టిన్
గుప్తిల్(0), కోలిన్ మన్రో(0) డకౌట్లుగా వెనుదిరిగారు. అప్పుడు క్రీజ్ లో కొచ్చిన
కెప్టెన్ విలియమ్సన్ జట్టు ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచి భారీ స్కోరుకు తోడ్పడ్డాడు.
అతనికి రాస్ టేలర్(69) అండగా నిలవగా నీషమ్ (28) చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. వెస్టిండిస్
బౌలర్లలో షెల్డన్ కోట్రెల్ 4 వికెట్లు, కార్లోస్ బ్రాత్ వెయిట్ 2 వికెట్లు
పడగొట్టారు.
No comments:
Post a Comment