Saturday, June 22, 2019

tough fight goes between westindies and newzealand in icc world cup match

ఉత్కంఠ పోరులో 5 పరుగుల తేడాతో వెస్టిండిస్ పై న్యూజిలాండ్ గెలుపు
వెస్టిండిస్ చెలరేగితే ఎలా ఉంటుందో ప్రపంచ క్రికెట్ అభిమానులు మరోసారి కళ్లారా వీక్షించారు. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో ఓడినా వెస్టిండిస్ బ్యాటింగ్ ను ఎవరూ మెచ్చుకోకుండా ఉండలేరు. తొలుత గేల్ చెలరేగితే ఆ తర్వాత కార్లస్ బ్రాత్ వెయిట్ విజృంభించిన తీరు క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది. వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.29 మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో శనివారం జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ను వెస్టిండిస్ దాదాపు ఓడించినంత పని చేసింది. వెస్టిండిస్ టాస్ గెలిచి న్యూజిలాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. 50 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు పోగొట్టుకుని 291 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(148) టోర్నీలో వరుసగా రెండో సెంచరీ చేశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండిస్ 292 పరుగుల లక్ష్య ఛేదనకు ఏమాత్రం వెరవలేదు. చాన్నాళ్లకు ఓపెనర్ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 6 సిక్సర్లు, 8 బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 84 బంతుల్లోనే 87 పరుగులు చేసి అయిదో వికెట్ గా ఔటయ్యాడు. మరో ఓపెనర్ కీపర్ షాయ్ హోప్(1), నికోలస్ పూరన్(1) ఒకరివెంట ఒకరు పెవిలియన్ బాట పట్టారు. కెప్టెన్ జాసన్ హోల్డర్(0) మరోసారి నిరాశ పరిచినా ఆ తర్వాత షిమ్రాన్ హెట్మయర్(54), కార్లోస్ బ్రాత్ వెయిట్(101) ఇన్నింగ్స్ ను నిర్మించిన తీరు అపురూపమనే చెప్పాలి. ముఖ్యంగా బ్రాత్ వెయిట్ 82 బంతుల్లోనే 5 సిక్సర్లు, 9 బౌండరీలతో సెంచరీ కొట్టాడు. సిక్సర్లు, బౌండరీలతోనే వెయిట్ 66 పరుగుల సాధించాడంటేనే అతని విజృంభణ ఏస్థాయిలో ఉందో చెప్పొచ్చు. చివర్లో 7 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన స్థితిలో అందరూ వెస్టిండిస్ గెలుస్తుందనే అనుకున్నారు. ఒకే ఒక వికెట్ మిగిలి ఉన్నదశలో వెయిట్ భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు. నీషం బౌలింగ్ లో బౌల్ట్ క్యాచ్ పట్టగా వెయిట్ వెనుదిరగడంతో వెస్టిండిస్ ఇన్నింగ్స్ కు తెరపడింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ కు 4 వికెట్లు, లొకీ ఫెర్గుసన్ కు 3 వికెట్లు లభించగా మాట్ హెన్రీ, జేమ్స్ నీషమ్, కోలిన్డె గ్రాండ్ హోమ్ తలో వికెట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్(0), కోలిన్ మన్రో(0) డకౌట్లుగా వెనుదిరిగారు. అప్పుడు క్రీజ్ లో కొచ్చిన కెప్టెన్ విలియమ్సన్ జట్టు ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచి భారీ స్కోరుకు తోడ్పడ్డాడు. అతనికి రాస్ టేలర్(69) అండగా నిలవగా నీషమ్ (28) చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. వెస్టిండిస్ బౌలర్లలో షెల్డన్ కోట్రెల్ 4 వికెట్లు, కార్లోస్ బ్రాత్ వెయిట్ 2 వికెట్లు పడగొట్టారు.

Priyanka congratulates shruti mishra on her selection to indian squad for asian jr championship


బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రుతి మిశ్రాను అభినందించిన ప్రియాంక
ఆసియా బ్యాడ్మింటన్ జూనియర్ చాంపియన్ షిప్ కు గాను భారత జట్టుకు ఎంపికైన శ్రుతి మిశ్రాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అభినందించారు. ఈ చాంపియన్ షిప్ చైనాలో ప్రారంభం కానుంది. యూపీ రాజధాని లక్నో కు చెందిన శ్రుతి ఎంపిక కావడంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జి కూడా అయిన ప్రియాంక ట్విటర్ లో శుభాకాంక్షలు తెలిపారు. `బాగా శ్రమిస్తే విజయం నీ వెంట..నీకు నీ జట్టు సభ్యులకు నా శుభాకాంక్షలు` అని ఆ పోస్ట్ లో ప్రియాంక రాశారు.

union bank ATM robbery bid foiled in Mathura


మధుర లో ఏటీఎం చోరీ యత్నం భగ్నం
ఉత్తరప్రదేశ్ లోని మధురలో శుక్రవారం అర్ధరాత్రి దుండగులు ఏటీఎం చోరీకి చేసిన యత్నం పోలీసుల రాకతో భగ్నమయింది. పోలీసు గస్తీ వాహనాన్ని చూసి దొంగలు పారిపోయారు. ఈ ఘటన అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చోటు చేసుకుంది. స్థానిక కృష్ణ విహార్ కాలనీలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం లక్ష్యంగా దొంగలు చోరీకి శతథా ప్రయత్నించారు. మెషిన్ ఎంతకూ తెరుచుకోకపోవడంతో గ్యాస్ కట్టర్లతో కత్తిరించాలనుకున్నారు. అదీ సాధ్యం కాలేదు. చివరకు మెషిన్ ను పెకిలించుకు పోవాలనుకుంటున్న సమయంలో శబ్దాలకు అనుమానం వచ్చిన పోలీసు గస్తీ వాహనం ఆ ప్రాంతానికి చేరుకోవడంతో దొంగలు పలాయనం చిత్తగించినట్లు నగర పోలీసు సూపరింటెండెంట్ రాకేశ్ కుమార్ తెలిపారు.


Friday, June 21, 2019

ram vilas paswan files nomination for by election to rajya sabha

రాజ్యసభ కు నామినేషన్ వేసిన కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ 

బిహార్ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి లోక్ జనశక్తి (ఎల్.జె.ఎస్) పార్టీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు  కార్యక్రమంలో  బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, రోడ్లు, భవనాల శాఖ సహాయమంత్రి నందకిశోర్ యాదవ్, విద్యుత్ శాఖ సహాయ మంత్రి బిజేంద్ర ప్రసాద్ యాదవ్ తదితర సీనియర్ ఎన్డీయే నాయకులు పాల్గొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ బిహార్ పట్నా సాహెబ్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నిక కావడంతో ఆ రాష్ట్రంలో ఏకైక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. నామినేషన్లకు ఈ నెల 25 తుది గడువు కాగా 26న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు తేదీ జూన్ 28. వేరే ఎవరైనా నామినేషన్ వేస్తే జులై 5న ఓటింగ్ తేదీని నిర్ణయిస్తారు. రామ్ విలాస్ పాశ్వాన్ సొంత నియోజకవర్గం హజిపూర్ నుంచి ఈసారి లోక్ సభకు ఆయన చిన్న సొదరుడు పశుపతి కుమార్ పరాస్ ఎన్నికయ్యారు. పరాస్ బిహార్ రాష్ట్రమంత్రిగా వ్యవహరించారు. రామ్ విలాస్ పాశ్వాన్ 1977 నుంచి 2014 మధ్య కాలంలో హజిపూర్ నియోజకవర్గం నుంచి 9సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. తొలుత జనతా పార్టీ తరఫున 1977, 1980ల్లో రెండుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1984లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత 1989,91,96,98,99ల్లో జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2004లో ఆయన లోక్ జన్ శక్తి పార్టీని స్థాపించి హజిపూర్ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. మళ్లీ 2014లో ఆ స్థానానికి లోక్ సభలో ప్రాతినిధ్యం వహించారు.