రాజ్యసభ కు నామినేషన్ వేసిన కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్
బిహార్ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి లోక్ జనశక్తి (ఎల్.జె.ఎస్) పార్టీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, రోడ్లు, భవనాల శాఖ సహాయమంత్రి నందకిశోర్ యాదవ్, విద్యుత్ శాఖ సహాయ మంత్రి బిజేంద్ర ప్రసాద్ యాదవ్ తదితర సీనియర్ ఎన్డీయే నాయకులు పాల్గొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ బిహార్ పట్నా సాహెబ్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నిక కావడంతో ఆ రాష్ట్రంలో ఏకైక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. నామినేషన్లకు ఈ నెల 25 తుది గడువు కాగా 26న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు తేదీ జూన్ 28. వేరే ఎవరైనా నామినేషన్ వేస్తే జులై 5న ఓటింగ్ తేదీని నిర్ణయిస్తారు. రామ్ విలాస్ పాశ్వాన్ సొంత నియోజకవర్గం హజిపూర్ నుంచి ఈసారి లోక్ సభకు ఆయన చిన్న సొదరుడు పశుపతి కుమార్ పరాస్ ఎన్నికయ్యారు. పరాస్ బిహార్ రాష్ట్రమంత్రిగా వ్యవహరించారు. రామ్ విలాస్ పాశ్వాన్ 1977 నుంచి 2014 మధ్య కాలంలో హజిపూర్ నియోజకవర్గం నుంచి 9సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. తొలుత జనతా పార్టీ తరఫున 1977, 1980ల్లో రెండుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1984లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత 1989,91,96,98,99ల్లో జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2004లో ఆయన లోక్ జన్ శక్తి పార్టీని స్థాపించి హజిపూర్ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. మళ్లీ 2014లో ఆ స్థానానికి లోక్ సభలో ప్రాతినిధ్యం వహించారు.
No comments:
Post a Comment