Saturday, June 8, 2019

Kerala as dear to me as Varanasi, says Modi in Guruvayur


వారణాసి మాదిరిగానే నాకు గురువాయూర్ అంటే ఇష్టం:ప్రధాని
సొంత నియోజకవర్గం వారణాసి(యూపీ) మాదిరిగానే గురువాయూర్ అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో మరోసారి ఆయన కాశీ నుంచే గెలుపొందిన సంగతి తెలిసిందే. శనివారం ఆయన మాల్దీవులు, శ్రీలంక పర్యటనలకు బయలుదేరే ముందు గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అమేథిలో ఓటమి పాలయినా కేరళలోని వాయ్ నాడ్ నుంచి అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన విషయం విదితమే. ప్రస్తుతం రాహుల్ తనను గెలిపించిన కేరళ వాసులకు కృతజ్ఞతలు తెల్పుతూ వాయ్ నాడ్ లో పర్యటిస్తున్న నేపథ్యంలోనే మోదీ గురువాయూర్ పర్యటనకు రావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తన రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి కేరళ గడప తొక్కానని మోదీ తెలిపారు. తలపండిన రాజకీయ విశ్లేషకులు, పండితులు, రాజకీయ పార్టీల నేతలు జనం భావనను పసిగట్టలేకపోయారన్నారు. తమకు(బీజేపీ) అఖండ విజయాన్ని చేకూర్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకే తానిక్కడకి వచ్చినట్లు మోదీ తెలిపారు. గడిచిన ఎన్నికల్లో ప్రజలు సకరాత్మక భావననే (పాజిటివ్) అంగీకరించారని వ్యతిరేక వాదం, దుష్ప్రచారాన్ని(నెగిటివిటి) తిరస్కరించారని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. మనదేశంలో ప్రజలే దేవుళ్లని ఆయన వ్యాఖ్యానించారు.


Friday, June 7, 2019

Rahul mania grips Wayanad despite heavy rain



వాయ్ నాడ్ పర్యటనకు విచ్చేసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ లోని తన నియోజకవర్గం వాయ్ నాడ్ విచ్చేశారు. ఇటీవల ఇక్కడ లోక్ సభ నియోజకవర్గం నుంచి రాహుల్ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన విషయం విదితమే. శుక్రవారం (జూన్7) మధ్యాహ్నం 2 గంటలకు ఆయనకు కోజికోడ్ విమానాశ్రయంలో పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయన మూడ్రోజుల పాటు వాయ్ నాడ్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సుమారు 4.31 లక్షల ఓట్ల మెజార్టీని సాధించిన రాహుల్ ఈ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. పర్యటనలో భాగంగా తొలిరోజు ఆయన కలికవు జిల్లాలో ఓపెన్ టాప్ వాహనంలో పర్యటన ప్రారంభించారు. ఓ వైపు భారీ వర్షం కురుస్తున్న వేలమంది జనం రాహుల్ కోసం వేచి చూస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో మహిళలు, పిల్లలు కూడా రోడ్ కు ఇరువైపుల నిలబడి తమ ప్రియతమ నేతకు స్వాగతం పలకడం కనిపించింది. రాహుల్ చేతులూపుతూ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వర్షం వల్ల కొన్ని చోట్ల రోడ్లు నీటితో నిండిపోగా జనం బాల్కనీల పైన, మిద్దెల పైన నిలిచి రాహుల్ కు జయజయధ్వానాలు పలికారు. వాయ్ నాడ్ రాహుదారులన్నీ కాంగ్రెస్ జెండాలతో రెపరెపలాడాయి. రాహుల్ వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు రమేశ్ చెన్నితాల, పీకే కున్హలీకుట్టీ , యూడీఎఫ్ నాయకులు ఉన్నారు. మూడ్రోజుల పర్యటనలో రాహుల్ నిలంబుర్, ఎర్నాడ్ ల్లో రోడ్ షోల్లో పాల్గొంటారు. తొలిసారి ఇక్కడ ఎంపీ గా ఎన్నికైన రాహుల్ కల్పెట్టా, కంబాల్కడు, పనమరం, మానత్వాడి, పుల్పల్లీ, సుల్తాన్ బథేరి ల్లోనూ రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఢిల్లీకి ఈ నెల 9న తిరిగి వెళ్లనున్న రాహుల్ కోజికోడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. వాయ్ నాడ్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఆయనను సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటన మొత్తం 15 రోడ్ షోల్లో ఆయన పాల్గొననున్నారు.

dubai:8 indians among 17 killed in bus crash



దుబాయ్ లో ఘోర రోడ్డు ప్రమాదం:8 మంది భారతీయుల సహా 17 మంది  

దుర్మరణం
దుబాయ్ లో శుక్రవారం(జూన్7) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒమన్ నుంచి వస్తున్న బస్ దుబాయ్ అల్ రషీదియా ఎగ్జిట్ రోడ్డుపై అతి వేగంగా ప్రయాణిస్తూ పక్కనే ఉన్న అడ్వర్టయిజ్ మెంట్ బోర్డును బలంగా ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 17 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో  అత్యధికులు ఒమన్ జాతీయులే. భారత్ కు చెందిన 8మంది ప్రాణాలు కోల్పోయారు. అల్ రషీదియా మెట్రో స్టేషన్ కు సమీపంలో ఈ ఉదయం 5.40 నిమిషాలకు ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. బోర్డును వేగంగా ఢీకొట్టిన క్రమంలో బస్ ఎడమ వైపు భాగం నుజ్జునుజ్జుయింది. ఆ వైపు కూర్చున్న ప్రయాణికులంతా మృతువాత పడినట్లు సమాచారం. రంజాన్ వేడుకలు ముగించుకుని ఒమన్ నుంచి తిరిగివస్తూ వీరంతా దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగే సమయానికి బస్ లో 31 మంది ప్రయాణికులున్నారు. క్షతగాత్రుల్ని రషీద్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దుబాయ్ పోలీస్ చీఫ్ కమాండర్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలిఫా అల్ మెరి, దుబాయ్ అటార్ని జనరల్ ఎయిసమ్ ఎస్సా అల్ ముమైదన్ తదితర ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. గల్ఫ్ న్యూస్ కథనం ప్రకారం బస్ డ్రైవర్ తప్పు మార్గంలో వాహనాన్ని నడిపాడు. అల్ రషీదియా మెట్రో స్టేషన్ వైపునకు అసలు బస్ ల ప్రవేశానికి అనుమతి లేదని తెలుస్తోంది. ఈ దుర్ఘటన నేపథ్యంలో ఒమన్ ప్రభుత్వం మస్కట్-దుబాయ్ ల మధ్య రోజుకు మూడు సార్లు నడిచే ఈ-05 బస్ సర్వీసుల్ని తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిలిపివేసింది. రషీద్ ఆసుపత్రికి చెందిన అనధికారిక వర్గాల  సమాచారం మేరకు మొత్తం 10 మంది భారతీయులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో ఆరుగురు కేరళీయులని సమాచారం.


Thursday, June 6, 2019

Prashant Kishor meets Mamata




సీఎం మమతతో ప్రశాంత్ కిశోర్ భేటీ


రాజకీయ వ్యూహ కర్త బిహార్ జనతాదళ్(యునైటెడ్) నాయకుడు ప్రశాంత్ కిశోర్(పీకే) పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. గురువారం(జూన్6) వీరిద్దరు కోల్ కతాలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పార్టీ కార్యాలయంలో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కల్గించింది. గత కొద్ది కాలంగా టీఎంసీతో కలిసి పీకే పనిచేయనున్నారనే వార్తలకు ఈ భేటీ బలం చేకూర్చింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 18 లోక్ సభ స్థానాలు చేజిక్కించుకున్న దరిమిలా టీఎంసీ వర్గాల్లో కలవరం పెరిగింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ కేవలం 2స్థానాల్లోనే విజయం సాధించింది. 2021లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా పీకేను దగ్గరకు తీసుకోవాలనే ఆత్రుత టీఎంసీ వర్గాల్లో పెరిగిపోయింది. పీకే 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్త గా వ్యవహరించారు. 2015 ఎన్నికల్లో బిహార్ లో మహఘట్ బంధన్(ఆర్జేజీ,జేడీ(యూ),కాంగ్రెస్ కూటమి) వ్యూహకర్తగా పనిచేశారు. అనంతరం ఆయన జేడీయూ లో చేరి బిహార్ నాయకుడిగా ఉన్నారు. రెండేళ్ల క్రితం నుంచి ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.ఆర్.సి.పి. ప్రచార, వ్యూహకర్తగా పని చేశారు. ఆయన వ్యూహకర్తగా పనిచేసిన అన్ని పార్టీలు ఆయా ఎన్నికల్లో ఘన విజయాలు సొంతం చేసుకున్నాయి. దాంతో దేశంలోనే గొప్ప రాజకీయ వ్యూహకర్తగా పీకే పేరు గడించారు.