Friday, June 7, 2019

Rahul mania grips Wayanad despite heavy rain



వాయ్ నాడ్ పర్యటనకు విచ్చేసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ లోని తన నియోజకవర్గం వాయ్ నాడ్ విచ్చేశారు. ఇటీవల ఇక్కడ లోక్ సభ నియోజకవర్గం నుంచి రాహుల్ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన విషయం విదితమే. శుక్రవారం (జూన్7) మధ్యాహ్నం 2 గంటలకు ఆయనకు కోజికోడ్ విమానాశ్రయంలో పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయన మూడ్రోజుల పాటు వాయ్ నాడ్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సుమారు 4.31 లక్షల ఓట్ల మెజార్టీని సాధించిన రాహుల్ ఈ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. పర్యటనలో భాగంగా తొలిరోజు ఆయన కలికవు జిల్లాలో ఓపెన్ టాప్ వాహనంలో పర్యటన ప్రారంభించారు. ఓ వైపు భారీ వర్షం కురుస్తున్న వేలమంది జనం రాహుల్ కోసం వేచి చూస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో మహిళలు, పిల్లలు కూడా రోడ్ కు ఇరువైపుల నిలబడి తమ ప్రియతమ నేతకు స్వాగతం పలకడం కనిపించింది. రాహుల్ చేతులూపుతూ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వర్షం వల్ల కొన్ని చోట్ల రోడ్లు నీటితో నిండిపోగా జనం బాల్కనీల పైన, మిద్దెల పైన నిలిచి రాహుల్ కు జయజయధ్వానాలు పలికారు. వాయ్ నాడ్ రాహుదారులన్నీ కాంగ్రెస్ జెండాలతో రెపరెపలాడాయి. రాహుల్ వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు రమేశ్ చెన్నితాల, పీకే కున్హలీకుట్టీ , యూడీఎఫ్ నాయకులు ఉన్నారు. మూడ్రోజుల పర్యటనలో రాహుల్ నిలంబుర్, ఎర్నాడ్ ల్లో రోడ్ షోల్లో పాల్గొంటారు. తొలిసారి ఇక్కడ ఎంపీ గా ఎన్నికైన రాహుల్ కల్పెట్టా, కంబాల్కడు, పనమరం, మానత్వాడి, పుల్పల్లీ, సుల్తాన్ బథేరి ల్లోనూ రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఢిల్లీకి ఈ నెల 9న తిరిగి వెళ్లనున్న రాహుల్ కోజికోడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. వాయ్ నాడ్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఆయనను సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటన మొత్తం 15 రోడ్ షోల్లో ఆయన పాల్గొననున్నారు.

No comments:

Post a Comment