దుబాయ్
లో ఘోర రోడ్డు ప్రమాదం:8 మంది భారతీయుల సహా 17 మంది
దుర్మరణం
దుబాయ్ లో శుక్రవారం(జూన్7) ఘోర
రోడ్డు ప్రమాదం జరిగింది. ఒమన్ నుంచి వస్తున్న బస్ దుబాయ్ అల్ రషీదియా ఎగ్జిట్ రోడ్డుపై
అతి వేగంగా ప్రయాణిస్తూ పక్కనే ఉన్న అడ్వర్టయిజ్ మెంట్ బోర్డును బలంగా ఢీకొట్టడంతో
అందులో ప్రయాణిస్తున్న 17 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో అత్యధికులు ఒమన్ జాతీయులే. భారత్ కు చెందిన
8మంది ప్రాణాలు కోల్పోయారు. అల్ రషీదియా మెట్రో స్టేషన్ కు సమీపంలో ఈ ఉదయం 5.40
నిమిషాలకు ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. బోర్డును వేగంగా ఢీకొట్టిన క్రమంలో
బస్ ఎడమ వైపు భాగం నుజ్జునుజ్జుయింది. ఆ వైపు కూర్చున్న ప్రయాణికులంతా మృతువాత
పడినట్లు సమాచారం. రంజాన్ వేడుకలు ముగించుకుని ఒమన్ నుంచి తిరిగివస్తూ వీరంతా దుర్మరణం
చెందారు. ప్రమాదం జరిగే సమయానికి బస్ లో 31 మంది ప్రయాణికులున్నారు. క్షతగాత్రుల్ని
రషీద్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దుబాయ్ పోలీస్ చీఫ్ కమాండర్ మేజర్
జనరల్ అబ్దుల్లా ఖలిఫా అల్ మెరి, దుబాయ్ అటార్ని జనరల్ ఎయిసమ్ ఎస్సా అల్ ముమైదన్
తదితర ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. గల్ఫ్ న్యూస్ కథనం ప్రకారం బస్
డ్రైవర్ తప్పు మార్గంలో వాహనాన్ని నడిపాడు. అల్ రషీదియా మెట్రో స్టేషన్ వైపునకు
అసలు బస్ ల ప్రవేశానికి అనుమతి లేదని తెలుస్తోంది. ఈ దుర్ఘటన నేపథ్యంలో ఒమన్
ప్రభుత్వం మస్కట్-దుబాయ్ ల మధ్య రోజుకు మూడు సార్లు నడిచే ఈ-05 బస్ సర్వీసుల్ని
తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిలిపివేసింది. రషీద్ ఆసుపత్రికి చెందిన అనధికారిక
వర్గాల సమాచారం మేరకు మొత్తం 10 మంది
భారతీయులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో ఆరుగురు కేరళీయులని సమాచారం.
No comments:
Post a Comment