వారణాసి మాదిరిగానే నాకు గురువాయూర్ అంటే ఇష్టం:ప్రధాని
సొంత
నియోజకవర్గం వారణాసి(యూపీ) మాదిరిగానే గురువాయూర్ అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రధాని
మోదీ పేర్కొన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో మరోసారి ఆయన కాశీ నుంచే గెలుపొందిన
సంగతి తెలిసిందే. శనివారం ఆయన మాల్దీవులు, శ్రీలంక పర్యటనలకు బయలుదేరే ముందు గురువాయూర్
శ్రీకృష్ణ ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అమేథిలో
ఓటమి పాలయినా కేరళలోని వాయ్ నాడ్ నుంచి అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన విషయం
విదితమే. ప్రస్తుతం రాహుల్ తనను గెలిపించిన కేరళ వాసులకు కృతజ్ఞతలు తెల్పుతూ వాయ్
నాడ్ లో పర్యటిస్తున్న నేపథ్యంలోనే మోదీ గురువాయూర్ పర్యటనకు రావడం ప్రాధాన్యాన్ని
సంతరించుకుంది. తన రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి కేరళ గడప తొక్కానని
మోదీ తెలిపారు. తలపండిన రాజకీయ విశ్లేషకులు, పండితులు, రాజకీయ పార్టీల నేతలు జనం భావనను
పసిగట్టలేకపోయారన్నారు. తమకు(బీజేపీ) అఖండ విజయాన్ని చేకూర్చిన ప్రజలకు ధన్యవాదాలు
తెలిపేందుకే తానిక్కడకి వచ్చినట్లు మోదీ తెలిపారు. గడిచిన ఎన్నికల్లో
ప్రజలు సకరాత్మక భావననే (పాజిటివ్) అంగీకరించారని వ్యతిరేక వాదం, దుష్ప్రచారాన్ని(నెగిటివిటి)
తిరస్కరించారని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. మనదేశంలో ప్రజలే దేవుళ్లని ఆయన వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment