Tuesday, June 4, 2019

Silence, security in Beijing on 30th Tiananmen anniversary



తియాన్మన్ స్క్వేర్ లో రాజ్యమేలుతున్న నిశ్శబ్దం
సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం.. 4 జూన్ 1989.. ప్రజాస్వామ్యం కోసం గళమెత్తిన విద్యార్థి లోకం కమ్యూనిస్టు చైనా పాలకుల కర్కశ దాష్టీకానికి బలై ఉద్యమం పాతాళానికి తొక్కబడిన రోజు. వెయ్యి మందికి పైగా విద్యార్థులు నాటి సైనికులు చేపట్టిన మారణకాండలో అసువులు బాశారు. మంగళవారం(జూన్ 4) తియాన్మన్ స్క్వేర్ లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. చైనా భద్రతా, నిఘా విభాగాలు ఆ ప్రాంతమంతా జల్లెడపడుతున్నాయి. భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతుండగా, సైనిక ట్యాంకర్లు తిరుగాడుతున్నాయి. విదేశీ పర్యాటకుల్ని సునిశితంగా తనిఖీ చేస్తున్నారు. ఇతర దేశాల మీడియాకు తియాన్మన్ స్క్వేర్ పరిసర ప్రాంతాల్లోకి అనుమతి నిరాకరిస్తున్నారు. అవాస్తవాల్ని వ్యాప్తి చేస్తున్నారంటూ ప్రస్తుతం అక్కడ ఫొటోలు తీయడానికీ అనుమతించడం లేదు. వీసా పొడిగింపుల్ని కఠినతరం చేశారు. అమెరికా ఈ రోజును `వీరోచిత పోరాట దినం`గా పేర్కొన్న నేపథ్యంలో చైనా తియాన్మన్ స్క్వేర్ లో మరింత కఠిన నిబంధనల్ని అమలు చేస్తోంది. ట్విటర్ తరహాలోని `వైబో` సామాజిక మాధ్యమంలో తియాన్మన్ అనే అక్షరాల్ని టైప్ చేస్తే కమ్యూనిస్టు చైనా 70వ వార్షికోత్సవ లోగో దర్శనమిస్తోంది. చైనా అధ్యక్షుడిగా జింగ్ పింగ్ 2012లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ ప్రాంతంలో పౌర సమాజం కదలికల పైనా ఆంక్షల తీవ్రత మరింత పెరిగిపోయింది.  కనీసం నాటి విద్యార్థి ఉద్యమం ఊసు కూడా ప్రస్తావనకు రాకుండా చర్యలు చేపట్టారు. కార్మిక హక్కుల కోసం పోరాడే నాయకులు, ఉద్యమకారులు, పౌరహక్కుల కోసం పాటుపడే న్యాయవాదులు, చివరికి మార్క్సిస్ట్ విద్యార్థుల్ని సైతం ఆంక్షల చట్రం వెంటాడుతూనే ఉంది. అయితే ఇప్పుడు చైనా అలాగేమీ లేదని చాలా మారిపోయిందని డబ్బే ఇక్కడ ప్రధానమైపోయిందని అది ఉంటే ఏదైనా సాధ్యమని డిడి క్యాబ్ సర్వీస్ డ్రైవర్ ఒకరు వ్యాఖ్యానించారు. ఆనాడు ఏం జరిగిందో తమకందరికీ తెలుసని..అయితే ఆ అణచివేతను తామేమి లక్ష్యపెట్టమని పేర్కొన్నాడు.


Monday, June 3, 2019

rahul pays homage to karunanidhi on his birth anniversary

కరుణానిధికి ఘనంగా నివాళులర్పించిన రాహుల్

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 95వ జయంతి ఘనంగా నిర్వహించారు. డీఎంకే అధినేత, కరుణానిధి కుమారుడు స్టాలిన్ సోమవారం(జూన్3) ఏర్పాటైన కార్యక్రమంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. `ఫాదర్ ఆఫ్ మోడ్రన్ తమిళనాడు`గా కీర్తిపొందిన కరుణానిధి తన 94వ ఏట వృద్ధాప్యంతో కన్నుమూశారు. దాదాపు ఏడాది పాటు ఆయన చికిత్స పొందుతూ గత ఆగస్ట్7న మరణించారు. ఆయన తమిళనాడుకు అయిదు సార్లు సీఎంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు తమిళనాడు అమ్మగా పిలుచుకునే జయలలిత లేకుండా రాష్ట్రంలో తొలిసారి తాజా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ జయంతి సందర్భంగా కరుణానిధిని తలుచుకోవడం ముదావహం అన్నారు. అమోఘమైన తమిళనాడు ప్రజలకు అసలైన నాయకుడు..ఆయన జ్ఞాపకాలు ఎన్నటికీ చెరగని ముద్రగా రాహుల్ ట్విటర్ లో పేర్కొన్నారు. 


women welcome free metro bus rides in delhi



ఢిల్లీ మహిళలకు సీఎం కేజ్రీవాల్ ఉచిత కానుక
దేశ రాజధాని ఢిల్లీలోని మహిళలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బహుమతి ప్రకటించారు. ఢిల్లీ మెట్రో సహా, అన్ని తరహా బస్ ల్లో(ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ - డీటీసీ) మహిళలు టికెట్ కొనకుండా ఉచితంగా ప్రయాణించొచ్చు. రానున్న కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు రేపుతోంది. అన్ని వర్గాల మహిళల్ని ఆకర్షించే ఈ ప్రకటనను ఢిల్లీ సీఎం సోమవారం(జూన్3) విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. ఇందుకు గాను రూ.1600 కోట్ల భారం పడుతుంది. ఈ మొత్తంలో రూ.700 కోట్ల భారాన్ని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఢిల్లీ మెట్రో రైళ్లలో రోజూ సుమారు 25 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మెట్రో-III ప్రాజెక్టు కూడా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య 40 లక్షలకు చేరుకుంటుందని అంచనా. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ ఢిల్లీ మెట్రో టికెట్ల రేట్లు పెరగకుండా ఉంచడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రేట్ల పెంపుపై తమ అభ్యంతరాల్ని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం తాము తీసుకున్న నిర్ణయం మహిళా భద్రతకు పెట్టిన పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు. చదువుకునే విద్యార్థినులు, ఉద్యోగినులు, వివిధ వృత్తుల్లో ఉన్న మహిళలు అందరికీ ఢిల్లీ రవాణా సాధానాల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా అన్నిరంగాల్లో మహిళల ముందంజకు బాటలు వేయనున్నామని కేజ్రీవాల్ చెప్పారు. అయితే టికెట్ కొనే ప్రయాణించాలనుకునే మహిళలు ఆవిధంగా వెళ్లడానికి అభ్యంతరం లేదు.

IAF aircraft with 13 people on board goes missing



అదృశ్యమైన భారత వాయుసేన విమానం
భారత వైమానికి దళానికి చెందిన ఓ రవాణా విమానం జాడ తెలియకుండా పోయింది. సోమవారం(జూన్3) మధ్యాహ్నం 12.25 నిమిషాలకు గ్రౌండ్ కంట్రోల్ రూం తో ఈ విమానానికి సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. అసోం లోని జోర్హాట్ లో బయలుదేరిన 35 నిమిషాలకే విమానం ప్రమాదానికి గురైనట్లు భావిస్తున్నారు. ఈ ఏఎన్-32 యుద్ధ విమానం అరుణాచల్ ప్రదేశ్ లోని మెంచుకాకు ప్రయాణిస్తోంది. చైనా సరిహద్దుల్లోని ఈశాన్య పర్వతప్రాంతాల మీదుగా ప్రయాణిస్తుండగా ఈ విమానం నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. విమానంలో 8మంది సిబ్బందితో పాటు మరో అయిదురు ఇతరులు ప్రయాణిస్తున్నారు. అదృశ్యమైన విమానం జాడ కనుగొనేందుకు భారత వాయుసేన ప్రయత్నాలు ప్రారంభించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఈ విమానం జాడ కనుగొనడానికి ఐఏఎఫ్ సుఖోయ్ యుద్ధ విమానాల్నిరంగంలోకి దించింది. రక్షణ శాఖ నూతన మంత్రిగా గత వారమే బాధ్యతలు చేపట్టిన రాజ్ నాథ్ సింగ్ వాయుసేన అధికారులతో విమాన అదృశ్యం విషయమై మాట్లాడారు. విమానంలోని వారందరూ క్షేమంగా తిరిగిరావాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.