Monday, June 3, 2019

women welcome free metro bus rides in delhi



ఢిల్లీ మహిళలకు సీఎం కేజ్రీవాల్ ఉచిత కానుక
దేశ రాజధాని ఢిల్లీలోని మహిళలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బహుమతి ప్రకటించారు. ఢిల్లీ మెట్రో సహా, అన్ని తరహా బస్ ల్లో(ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ - డీటీసీ) మహిళలు టికెట్ కొనకుండా ఉచితంగా ప్రయాణించొచ్చు. రానున్న కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు రేపుతోంది. అన్ని వర్గాల మహిళల్ని ఆకర్షించే ఈ ప్రకటనను ఢిల్లీ సీఎం సోమవారం(జూన్3) విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. ఇందుకు గాను రూ.1600 కోట్ల భారం పడుతుంది. ఈ మొత్తంలో రూ.700 కోట్ల భారాన్ని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఢిల్లీ మెట్రో రైళ్లలో రోజూ సుమారు 25 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మెట్రో-III ప్రాజెక్టు కూడా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య 40 లక్షలకు చేరుకుంటుందని అంచనా. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ ఢిల్లీ మెట్రో టికెట్ల రేట్లు పెరగకుండా ఉంచడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రేట్ల పెంపుపై తమ అభ్యంతరాల్ని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం తాము తీసుకున్న నిర్ణయం మహిళా భద్రతకు పెట్టిన పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు. చదువుకునే విద్యార్థినులు, ఉద్యోగినులు, వివిధ వృత్తుల్లో ఉన్న మహిళలు అందరికీ ఢిల్లీ రవాణా సాధానాల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా అన్నిరంగాల్లో మహిళల ముందంజకు బాటలు వేయనున్నామని కేజ్రీవాల్ చెప్పారు. అయితే టికెట్ కొనే ప్రయాణించాలనుకునే మహిళలు ఆవిధంగా వెళ్లడానికి అభ్యంతరం లేదు.

No comments:

Post a Comment