Tuesday, June 4, 2019

Silence, security in Beijing on 30th Tiananmen anniversary



తియాన్మన్ స్క్వేర్ లో రాజ్యమేలుతున్న నిశ్శబ్దం
సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం.. 4 జూన్ 1989.. ప్రజాస్వామ్యం కోసం గళమెత్తిన విద్యార్థి లోకం కమ్యూనిస్టు చైనా పాలకుల కర్కశ దాష్టీకానికి బలై ఉద్యమం పాతాళానికి తొక్కబడిన రోజు. వెయ్యి మందికి పైగా విద్యార్థులు నాటి సైనికులు చేపట్టిన మారణకాండలో అసువులు బాశారు. మంగళవారం(జూన్ 4) తియాన్మన్ స్క్వేర్ లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. చైనా భద్రతా, నిఘా విభాగాలు ఆ ప్రాంతమంతా జల్లెడపడుతున్నాయి. భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతుండగా, సైనిక ట్యాంకర్లు తిరుగాడుతున్నాయి. విదేశీ పర్యాటకుల్ని సునిశితంగా తనిఖీ చేస్తున్నారు. ఇతర దేశాల మీడియాకు తియాన్మన్ స్క్వేర్ పరిసర ప్రాంతాల్లోకి అనుమతి నిరాకరిస్తున్నారు. అవాస్తవాల్ని వ్యాప్తి చేస్తున్నారంటూ ప్రస్తుతం అక్కడ ఫొటోలు తీయడానికీ అనుమతించడం లేదు. వీసా పొడిగింపుల్ని కఠినతరం చేశారు. అమెరికా ఈ రోజును `వీరోచిత పోరాట దినం`గా పేర్కొన్న నేపథ్యంలో చైనా తియాన్మన్ స్క్వేర్ లో మరింత కఠిన నిబంధనల్ని అమలు చేస్తోంది. ట్విటర్ తరహాలోని `వైబో` సామాజిక మాధ్యమంలో తియాన్మన్ అనే అక్షరాల్ని టైప్ చేస్తే కమ్యూనిస్టు చైనా 70వ వార్షికోత్సవ లోగో దర్శనమిస్తోంది. చైనా అధ్యక్షుడిగా జింగ్ పింగ్ 2012లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ ప్రాంతంలో పౌర సమాజం కదలికల పైనా ఆంక్షల తీవ్రత మరింత పెరిగిపోయింది.  కనీసం నాటి విద్యార్థి ఉద్యమం ఊసు కూడా ప్రస్తావనకు రాకుండా చర్యలు చేపట్టారు. కార్మిక హక్కుల కోసం పోరాడే నాయకులు, ఉద్యమకారులు, పౌరహక్కుల కోసం పాటుపడే న్యాయవాదులు, చివరికి మార్క్సిస్ట్ విద్యార్థుల్ని సైతం ఆంక్షల చట్రం వెంటాడుతూనే ఉంది. అయితే ఇప్పుడు చైనా అలాగేమీ లేదని చాలా మారిపోయిందని డబ్బే ఇక్కడ ప్రధానమైపోయిందని అది ఉంటే ఏదైనా సాధ్యమని డిడి క్యాబ్ సర్వీస్ డ్రైవర్ ఒకరు వ్యాఖ్యానించారు. ఆనాడు ఏం జరిగిందో తమకందరికీ తెలుసని..అయితే ఆ అణచివేతను తామేమి లక్ష్యపెట్టమని పేర్కొన్నాడు.


No comments:

Post a Comment