Tuesday, May 21, 2019

PM Modi pays tribute to Rajiv Gandhi on his death anniversary



రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన మోదీ సోనియా రాహుల్ ప్రియాంక
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 28 వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మంగళవారం (మే21) ఆయనకు  ఘన నివాళులర్పించారు. ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ రాజీవ్ గాంధీ వర్ధంతి నేపథ్యంలో ఆయనకు ఘన నివాళులు అని పేర్కొన్నారు. యమునా నదీ తీరంలో గల వీర్ భూమి లోని రాజీవ్ సమాధిని సందర్శించి సోనియా, మన్మోహన్ సింగ్, రాహుల్, ప్రియాంక ఘన నివాళులర్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన సందేశంలో రాజీవ్ కు నివాళులర్పించారు. ఇందిరాగాంధీ హత్యానంతరం దేశ ఆరో ప్రధానిగా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ 1984 నుంచి 1989 వరకు పరిపాలించారు. 1991 మే 21న మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరంబుదుర్ బహిరంగ సభకు వెళ్లిన రాజీవ్ ను.. ఎల్టీటీఈ మానవబాంబు ద్వారా దారుణంగా హత్య చేసింది.

Monday, May 20, 2019

egyptian forces kill 12 suspected militants in raids

ఈజిప్టు భద్రతా బలగాల కాల్పుల్లో 12 మంది ఉగ్రవాదుల హతం

ఈజిప్టులో భద్రతా బలగాలు సోమవారం(మే20) తనిఖీలు నిర్వహిస్తుండగా ఎదురపడిన 12 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఆదివారం ఈజిప్టు రాజధాని కైరోలోని గాజా పిరమిడ్ల సందర్శనకు వచ్చిన విదేశీయుల లక్ష్యంగా ఉగ్రవాదులు రోడ్డు పక్కన పెట్టిన బాంబు పేల్చడంతో బస్ లో ప్రయాణిస్తున్న 17 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. గాజా పిరమిడ్లకు సమీపంలో నిర్మాణంలో ఉన్న పురావస్తు ప్రదర్శనశాల (మ్యూజియం) వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఆ సమయంలో బస్ లో మొత్తం 28 మంది ప్రయాణికులున్నారు. పేలుడు వల్ల మ్యూజియం కు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పురావస్తు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈరోజు కాల్పులో చనిపోయిన 12 మంది ఉగ్రవాదులు బాంబు పేలుడు కుట్రదారులుగా భావిస్తున్నారు. అంతకుముందు ఈజిప్టులోని దక్షిణాఫ్రికా రాయబారి వుసి మువింబెల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. 



Sunday, May 19, 2019

modi’s jobs deficit: J&J’s largest India plant idle three years after completion



నిర్మాణం పూర్తై మూడేళ్లయినా ప్రారంభానికి నోచుకోని 
జాన్సన్ అండ్ జాన్సన్ 
భారత్ లోనే అతి పెద్ద తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ సమీపంలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నెలకొల్పింది. ఈ అమెరికా కంపెనీ ద్వారా సౌందర్య సాధనాలు, బాలలకు సంబంధించిన వస్తు ఉత్పత్తులు చేపట్టాలని మహబూబ్ నగర్ జిల్లా పెంజెర్లలో 47 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తై మూడేళ్లయినా ఉత్పత్తి కార్యక్రమాల ఊసే లేదు. ఈ కంపెనీ పని చేయడం ప్రారంభిస్తే 1500 మందికి ఉపాధి లభిస్తుంది. కంపెనీ కేంద్ర కార్యాలయం న్యూజెర్సీలోని న్యూబ్రన్స్ విక్ లో ఉంది. భారత్ లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ముంబయిలో కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటయింది. నిర్మాణం పూర్తి చేసుకుని మూడేళ్లయినా ఉత్పత్తి కార్యకలాపాలు ఎందుకు ప్రారంభకాలేదని ముంబయి లోని సంస్థ అధికారుల్ని సంప్రదిస్తే కేంద్ర కార్యాలయంలోనే ఆ విషయాలు తెలుస్తాయని తప్పించుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ 2016లో పెద్ద నోట్లు రద్దు చేయడం, 2017 నుంచి జీఎస్టీ అమలు చేయడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. నిజానికి బేబీ కేర్ వస్తువులు, సౌందర్య సాధనాల్లో జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తులకు భారత్ లో గిరాకీ ఎక్కువ. అయినా ఇక్కడ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఉత్పత్తుల ప్రారంభానికి యాజమాన్యం ముందుకు రావట్లేదని స్పష్టమౌతోంది.


Political ad spend on Facebook, Google tops Rs 53 cr



రాజకీయ పార్టీల డిజిటల్ యాడ్స్ ఖర్చు రూ.53 కోట్లు
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు డిజిటల్ యాడ్స్ కు రూ.53 కోట్లు ఖర్చు పెట్టాయి. ఇందులో సింహభాగం భారతీయ జనతా పార్టీ ఖర్చు చేసింది. ముఖ్యంగా ఆయా పార్టీలు ఫేస్ బుక్, గూగుల్ యాడ్లకే ఎక్కువ ఖర్చు చేసినట్లు గణాంకాలు  స్పష్టం చేస్తున్నాయి. ఫేస్ బుక్ నివేదిక ప్రకారం ఈ 17వ లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 1.21 లక్షల రాజకీయ ప్రచార యాడ్స్ జనంలోకి వెళ్లాయి. ఇందుకు గాను మే15 నాటికి ఆ పార్టీలు 26.5 కోట్లు వెచ్చించాయి. ఇదంతా ఫిబ్రవరి19-మే15 తేదీల మధ్యనే వ్యయం చేశారు. గూగుల్, యూట్యూబ్, ఇతర గ్రూపు సామాజిక మాధ్యమాలు 14,837 యాడ్స్ పబ్లిష్ చేయడం ద్వారా ఫిబ్రవరి 19 నుంచి మే15 వరకు రూ.27.36కోట్లు ఆర్జించాయి. ఇందులో బీజేపీ వాటా రూ.4.23 కోట్లు. ఒక్క ఫేస్ బుక్ ద్వారా ఆ పార్టీ యాడ్స్ 2500 వరకు జనంలోకి వెళ్లాయి. మై ఫస్ట్ ఓట్ ఫర్ మోదీ, భారత్ కి మన్ కి బాత్, నేషన్ విత్ నమో టూ తదితర యాడ్స్ సామాజిక మాధ్యమాల్లో విరివిగా చక్కెర్లు కొట్టాయి. 20 కోట్ల మందికి దేశంలో సామాజిక మాధ్యమ అకౌంట్లున్నాయని ఓ అంచనా. మరో వైపు కాంగ్రెస్ పార్టీ గూగుల్ యాడ్స్ కోసం రూ.17 కోట్లు, ఫేస్ బుక్ ద్వారా ప్రచారానికి రూ.1.46 కోట్లు ఖర్చు చేసింది. ఆ పార్టీ ఫేస్ బుక్ ద్వారా 3,686 యాడ్స్, గూగుల్ ద్వారా 425 యాడ్స్ గుప్పించింది. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) రూ.29.28కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రూ.13.62 కోట్లు ఫేస్ బుక్ యాడ్స్ కు వెచ్చించాయి. ఆప్ గూగుల్ యాడ్స్ ద్వారా ప్రచారానికి రూ.2.18 కోట్లు చెల్లించింది. ఈ ఏడాది ఆరంభంలోనే ఫేస్ బుక్, గూగుల్ సంస్థలు సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీల డిజిటల్ యాడ్స్ ప్రచారానికి సంబంధించి కచ్చితత్వంతో కూడిన మొత్తం లెక్కలన్నింటిని నివేదికలో వెల్లడిస్తామని ప్రకటించాయి.