Monday, April 22, 2019
karnataka cid team in raichur to investigate btech girl`s death
బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతిపై సీఐడీ దర్యాప్తు
కర్ణాటకలోని రాయచూర్ కు చెందిన
23 ఏళ్ల బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై రాష్ట్ర
ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదులో
నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ బిడ్డను పోగొట్టుకున్నామని తల్లిదండ్రులు
ఆరోపిస్తున్నారు. దాంతో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన గళం విప్పడంతో
ప్రభుత్వం ఈ దర్యాప్తునకు ఆదేశించింది. నవోదయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆమె
మూడో సంవత్సరం చదువుతోంది. ఇంటి నుంచి ఏప్రిల్13న వెళ్లిన విద్యార్థిని జాడ
తెలియకపోవడంతో తల్లిదండ్రులు అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
ఇచ్చారు. అయితే పోలీసులు పట్టించుకోలేదు. ఏప్రిల్ 15న ఓ ఫామ్ హౌస్ లో చెట్టుకు ఉరి
వేసిన స్థితిలో విద్యార్థిని శవాన్ని కనుగొన్నారు. తొలుత పోలీసులు సైతం ఆత్మహత్యగా
చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే తమ బిడ్డను అదే కాలేజీలో చదువుతున్న సుదర్శన్
యాదవ్ అత్యాచారం చేసి చంపేసి సూసైడ్ డ్రామా ఆడుతున్నాడని వారు ఆరోపించారు. ఈ
సుదర్శన్ బంధువు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండడంతో కేసును మాఫీ
చేసే ప్రయత్నం చేశాడన్నారు. విద్యార్థిని తను పరీక్షలో ఫెయిల్ కావడంతోనే
మనస్థాపంతో ఉరివేసుకుంటున్నట్లు నకిలీ సూసైడ్ నోట్ ను సుదర్శన్ సృష్టించాడని పేర్కొన్నారు.
దాంతో ప్రభుత్వం సీఐడీ ఎస్.పి. శరణప్ప ఆధ్వర్యంలో కేసు దర్యాప్తునకు సోమవారం
ఆదేశాలిచ్చింది.
sri lanka receives brand new type of terrorism bombings death toll raises to 290 hurted 500 people
శ్రీలంకలో కొత్త తరహా ఉగ్రవాదం
- 290కు పెరిగిన మృతుల సంఖ్య
- 500 మందికి గాయాలు
శ్రీలంకలో దశాబ్దం తర్వాత భారీ
సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. జాతుల సమరంలో నిత్యం రక్తమోడిన దేశం పదేళ్లుగా
దాదాపు ప్రశాంతంగా ఉంది. ఆదివారం (ఏప్రిల్21) మళ్లీ రక్త చరిత్ర ప్రపంచం ముందు
సాక్షాత్కారమయింది. పర్యాటక ప్రాంతాలు, విదేశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు తాజా బాంబు పేలుళ్లకు
తెగబడిన నేపథ్యంలో మృతుల సంఖ్య 290కు పెరగింది. అంతకు దాదాపు రెట్టింపు సంఖ్యలో
500 మందికి పైబడి క్షతగాత్రులయ్యారు. ఆదివారం ఉదయం నుంచి చర్చిలు, స్టార్ హోటళ్లు
ఎనిమిది చోట్ల ఉగ్రమూక ఆత్మాహుతి దాడులకు బరితెగించింది. దాంతో దేశంలో అత్యయిక
పరిస్థితి(ఎమర్జెన్సీ)ని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. విమాన, రైలు, బస్ తదితర
అన్ని రవాణా వ్యవస్థల్ని నిలిపివేసింది. దేశం నలుమూలలా ముమ్మర గాలింపు చేపట్టింది.
అనుమానితులు 24 మందిని ఇంతవరకు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రాజధాని
కొలంబోలోని బండారు నాయకే విమానాశ్రయంలో ఓ బాంబు పేలకుండా భద్రతా బలగాలు నిర్వీర్యం
చేశాయి. మొత్తంగా తొమ్మిది చోట్ల బాంబు(ఐ.ఇ.డి)లు ఉగ్రవాదులు అమర్చగా ఆఖరి బాంబును పేలకుండా నిర్వీర్యం చేసినట్లు
సమాచారం. మొహ్మద్ సాహారన్ నాయకత్వంలోని జాతీయ తవాహిద్ జమాన్(ఎన్ టీ జే) ఉగ్రవాద
సంస్థ నుంచి ముప్పున్నట్లు నిఘా వర్గాలు ముందుగానే ప్రభుత్వాన్ని అప్రమత్తం
చేసినట్లు తెలుస్తోంది. ఎంతో ముందుగానే ఉప్పందినా ప్రభుత్వ ఉదాసీనత కారణంగా
శ్రీలంక భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.
భారత్ లో హైఅలర్ట్
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఓ
వైపు జరుగుతుండగా శ్రీలంక లో ఉగ్రవాదులు చెలరేగిపోయిన నేపథ్యంలో భారత్
అప్రమత్తమయింది. ఉగ్రవాదుల ఆత్మాహుతి బాంబు పేలుళ్లలో సుమారు ఏడుగురు భారతీయులు
చనిపోయినట్లు రాయబార కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని మోదీ శ్రీలంక
అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని విక్రమ్ సింఘేలతో ఫోన్ లో
మాట్లాడారు. బాంబు దాడుల్ని తీవ్రంగా ఖండించి శ్రీలంక కు అవసరమైన సాయాన్ని
అందించడానికి ముందుంటామని హామీ ఇచ్చారు. దాడులు ఆటవిక చర్యగా అభివర్ణించిన ప్రధాని
మోదీ ఇవి ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసిన పేలుళ్లగా పేర్కొన్నారు. ఉగ్రవాదం
మానవాళికి పొంచి ఉన్న పెనుముప్పుగా చెప్పారు. ఇది ఓ దేశానికో ప్రాంతానికో కాక
యావత్ ప్రపంచానికి సంబంధించిన పెను సమస్యని మోదీ పేర్కొన్నారు. శ్రీలంక-భారత మధ్య
దూరం కేవలం 18 కి.మీ ఉండడంతో తమిళనాడు తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
Sunday, April 21, 2019
msdhoni career best in vain rcb beat csk in thriller ipl-12
ఆఖరి బంతికి ఆర్ సీ బీ విజయం
§ శివమెత్తిన
ధోని..చివరి ఓవర్లో 24పరుగులు చేసినా తప్పని ఓటమి
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం మరోసారి ఉత్కంఠ పోరుకు
వేదికయింది. ఆదివారం ఐపీఎల్ సీజన్-12 మ్యాచ్ లో అజేయంగా దూసుకువెళ్తున్న చెన్నై సూపర్
కింగ్స్(సీఎస్ కే)ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సీ బీ) ఒక్క పరుగు తేడాతో
ఓడించింది. ఆర్ సీబీకి వరుసగా ఇది రెండో విజయం. టాస్ గెలిచిన ధోని ఫీల్డింగ్
ఎంచుకున్నాడు. 20 ఓవర్లలో ఆర్ సీబీ 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
పార్థివ్ పటేల్ 7 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 37 బంతుల్లో అర్థ సెంచరీ 53
సాధించాడు. ఏబీ డివిలియర్స్(25), అక్షదీప్ నాథ్(24), మొయిన్ అలీ(26) రాణించారు.
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్ కే వికెట్లు టపటపా పడిపోయాయి. 6-1, 6-2,17-3, 28-4 ఈ సంఖ్యలను చూస్తేనే డగ్ ఔట్ కు చేరాలనే సీఎస్ కే బ్యాటర్ల తొందర
తెలుస్తుంది. డుప్లెసిస్, కేదార్ జాదవ్ లు అవుటయ్యారనే కంటే వికెట్లను
పారేసుకున్నారంటే సబబుగా ఉంటుంది. క్రీజ్ లో ఉన్న రాయుడుతో ధోని జత కలిశాకే చెన్నై
ఇన్నింగ్స్ కుదురుకుంది. అంతకు మించి బెంగళూరు సీమర్లు లైన్ అండ్ లెంగ్త్ లో
కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నై బ్యాట్స్ మన్ ను కట్టిపడేశారు. చక్కగా ఆడుతున్న
రాయుడు(29) పెవిలియన్ కు చేరినా మ్యాచ్ ఫినిషర్ ధోని ఉండడంతో సీఎస్ కే ఆశలు
సజీవంగా ఉన్నాయి. చివర్లో బ్రావో(5) కెప్టెన్ ధోనికి జత కలిశాడు. ఆఖరి 6 బంతుల్లో 26 పరుగులు
చేయాలి. ధోని స్ట్రైకింగ్ లో ఉన్నాడు. తొలి బంతినే బౌండరీకి తరలించిన ధోని తర్వాత మూడు
సిక్సర్లూ బాదాడు. ఒక సిక్సరయితే బంతి స్టేడియం బయటకు వెళ్లిపోయింది. చివరి బంతికి
రెండు పరుగులు లేదా ఒక్కపరుగు చేస్తే సూపర్ ఓవర్.. ఉమేశ్ స్లో బాల్ వేయడంతో బైస్
రన్ కోసం ధోని పరిగెత్తుతూ ముందుకు వచ్చాడు. శార్దుల్ ను ఆర్ సీ బీ వికెట్ కీపర్
అద్భుతమైన త్రో తో రనౌట్ చేశాడు. దాంతో బెంగళూరు విజయదరహాసం చేసింది. స్కిపర్ ధోని
84 (48 బంతుల్లో 7x6, 5x4) నాటౌట్ గా నిలిచాడు. చెన్నై 8 వికెట్లు
కోల్పోయి 160 పరుగులు చేయగల్గింది. ఈ విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్ కు అవకాశాన్ని
నిలుపుకుంది.
Subscribe to:
Posts (Atom)