Wednesday, April 17, 2019

ipl 2019 srh vs csk match hyderabad win by 6 wickets as dhoni less chennai suffer second loss of the season


వరుస ఓటముల తర్వాత చెన్నైపై గెలిచిన హైదరాబాద్
విజయాల రుచి మరిగిన చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా పోరాడకుండానే సన్ రైజర్స్ హైదరాబాద్ కు తలవంచింది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఐపీఎల్ సీజన్-12 మ్యాచ్ నం.33 లో టాస్ గెలిచిన యాక్టింగ్ కెప్టెన్ సురేశ్ రైనా మ్యాచ్ ను మాత్రం గెలిపించలేకపోయాడు. నడుం నొప్పి కారణంగా ధోని ఈ మ్యాచ్ ఆడలేదు. నాయకుడు లేని చెన్నై జట్టు పేలవమైన ఆటతీరు కనబర్చింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై అయిదు వికెట్లు కోల్పోయి 6.60 రన్ రేట్ తో 132పరుగులు మాత్రమే చేసింది. డూప్లెసిస్(45), షేన్ వాట్సన్(31), రాయుడు(25) చెప్పుకోదగ్గ పరుగులే చేసినా జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది.బౌలర్లకు సహకరించని పిచ్ పై బ్యాటర్లూ రాణించలేకపోవడం విచిత్రం. ఏడు విజయాలతో టోర్నీలో అగ్రస్థానంలో కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ రెండో ఓటమి మూటగట్టుకుంది. లక్ష్యం చిన్నదే కావడంతో ఒత్తిడే లేకుండా హైదరాబాద్ జట్టు సునాయాసంగా విజయాన్ని సాధించింది. నాలుగు వరుస ఓటముల తర్వాత జట్టుకు ఈ గెలుపు కచ్చితంగా ఆత్మవిశ్వాసాన్ని కల్గిస్తుంది. అర్ధ సెంచరీల హీరో వార్నర్ మరోసారి తన వాటా పరుగులు(25 బంతుల్లో 50) చేయగా మరో ఓపెనర్ జానీ బేస్టో (44 బంతుల్లో61 పరుగులు) అర్ధ సెంచరీతో నాటౌట్ గా మ్యాచ్ గెలిచే వరకు క్రీజ్ లో నిలిచాడు. మూడు ఓవర్ల మిగిలి ఉండగా విజయానికి రెండు పరుగులు కావాల్సి ఉన్న దశలో ఆడిన తొలిబంతినే యూసఫ్ పఠాన్ విన్నింగ్ షాట్ సిక్సర్ కొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ హోం గ్రౌండ్ లో 16.5 ఓవర్లలో 137/4 పరుగులు చేసి అలవోకగా గెలుపొందింది. 2010 తర్వాత ఐపీఎల్ లో ధోని ఆడని మొదటి మ్యాచ్ ఇదే. వార్నర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

No comments:

Post a Comment