Sunday, April 14, 2019

worlds largest plane rock flies first time in mojave california from stratolaunch private company


‘రాక్’ ప్రయోగం విజయవంతం
·        ప్రపంచంలోనే అతి పెద్ద అంతరిక్షవాహక విమానం

ప్రముఖ అంతరిక్ష వాహక విమానాల తయారీ సంస్థ స్ట్రాటో లాంచ్ ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా విమానాన్ని విజయవంతంగా పరీక్షించింది. అమెరికా కాలమానం ప్రకారం (13 ఏప్రిల్) శనివారం ఉదయం 6.58 కి కాలిఫోర్నియాలోని మొజావ్ ఎయిర్ అండ్ స్పేస్ పోర్ట్ నుంచి  ఈ అతిపెద్ద ఉపగ్రహాల రవాణా విమానం ‘రాక్’ను ప్రయోగించింది. రన్ వే పై పరీక్ష పూర్తయిన అనంతరం రాక్ గాల్లోకి దూసుకెళ్లి ఆకాశంలో 2గంటల 30 నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. ఫుట్ బాల్ మైదానం విస్తీర్ణం (360 అడుగులు) కన్నా ఈ రాక్షస విమానం ‘రాక్’ రెక్కల వైశాల్యం పెద్దది. మొత్తం 385 అడుగుల వెడల్పుతో అత్యంత పెద్ద రెక్కలుగల ‘రాక్’ 17 వేల అడుగుల ఎత్తుకు దూసుకెళ్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 304 కిలోమీటర్లు. ఉపగ్రహ వాహక రాకెట్లను రవాణా చేసే ఈ భారీ విమానం గగనంలో 35 వేల అడుగుల ఎత్తు వరకు ప్రయాణిస్తుంది. రెండు విమానాల్ని అతికించినట్లు కనిపించే ఈ భారీ విమానం ఆరు జెట్ ఇంజన్లను కల్గి ఉంటుంది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం వైశాల్యానికి ఈ విమానం మొత్తం వైశాల్యం సరిగ్గా సమానం. రాక్ విజయవంతంతో నాసా ప్రయోగాలకు మరింత ఉపయుక్తం కాగలదని భావిస్తున్నారు. ఇదొక చారిత్రక విజయంగా నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బెచెన్ పేర్కొన్నారు. ప్రాజెక్టు విజయవంతానికి కృషి చేసిన జట్టు సభ్యులకు, భాగస్వామ్య సంస్థ నార్తరప్ గ్రుమన్స్ కు స్ట్రాటోలాంచ్ కంపెనీ సీఈవో జీన్ ప్లాయిడ్ అభినందనలు తెలిపారు. రాక్ ప్రయోగం విజయవంతం కావడం.. భూమి పై నుంచి చేపట్టే అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగాలకు ప్రత్యామ్నాయం కాగలదని పేర్కొన్నారు.


No comments:

Post a Comment