Thursday, April 11, 2019

large number of youth casts their votes


జోరందుకున్న పోలింగ్.. వెల్లివిరిసిన యువోత్సాహం
దేశం నలుమూలలా సార్వత్రిక ఎన్నికల తొలివిడత పోలింగ్‌ జోరుగా కొనసాగుతోంది. మొత్తం 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని91 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఈ ఉదయం మందకొడిగా మొదలైన పోలింగ్ మధ్యాహ్ననికి ఊపందుకుంది. ఈవీఎంలు అనేక ప్రాంతాల్లో మొరాయించడంతో గంటల పాటు ఇబ్బంది ఎదురైన ఓటర్లు ఓపిగ్గా లైన్లలో వేచి ఉన్నారు. అనంతపురం,కడప, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి తదితర జిల్లాల్లో ఆయా పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులున్నా ఓటర్లు వెనుదిరగక ఓట్లు వేయడానికి పోలింగ్ బూత్ లకు తరలి వస్తుండడం గమనార్హం. చాలా చోట్ల పోలింగ్కు అంతరాయం కల్గిన నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషనర్ ద్వివేది సాయంత్రం 6 గంటల వరకు లైన్లలో వేచి ఉన్న వారికి రాత్రి ఏ వేళయినా పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.

యువోత్సాహం

తొలిసారి ఓటు హక్కు పొందిన యువత పోలింగ్ బూత్ లకు పెద్ద సంఖ్యలో తరలిరావడం కనిపించింది. అదేవిధంగా మహిళలు, వృద్ధులు సైతం ఎండను సైతం లెక్క చేయకుండా ఓటింగ్ లో పాల్గొంటున్నారు.  సాయంత్రం 4 వరకు అందిన సమాచారం ప్రకారం పలు ప్రాంతాల్లో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కడప జిల్లాలో పోలింగ్ భారీగా నమోదవుతోంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 64 శాతం పోలింగ్ నమోదైంది. వివిధ జిల్లాల్లో పోలింగ్ శాతం కింది విధంగా ఉంది. కడప జిల్లాలో 56%, చిత్తూరులో 46.60%, కర్నూలులో 50%, అనంతపురంలో 44.80% , శ్రీకాకుళంలో 40.92%, విజయనగరంలో 57.19%, విశాఖపట్నంలో 40.71%, తూర్పుగోదావరిలో 47.21%, పశ్చిమగోదావరిలో 42.51 %, కృష్ణాలో 41.42%, గుంటూరులో 40.08%, ప్రకాశంలో 45.48%, నెల్లూరులో 47.04%, పోలింగ్ నమోదయినట్లు సమాచారం. అధికారిక పోలింగ్ శాతం వివరాలు మరికొన్ని గంటల్లో ఎన్నికల సంఘం వెల్లడించనుంది.



No comments:

Post a Comment