Wednesday, June 9, 2021

Telugu people gave me life Navneet Kaur

శభాష్ సోనూసూద్:నవనీత్ కౌర్

నాటి తెలుగు హీరోయిన్ ప్రస్తుత లోక్ సభ ఎంపీ నవనీత్ కౌర్  రియల్ హీరో సోనూసూద్ సేవల్ని ప్రశంసలతో ముంచెత్తారు. కరోనా నేపథ్యంలో ఆయన బాధితులకు అందించిన చేయూత తమబోటి రాజకీయ నాయకులందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. మహారాష్ట్రలోని అమరావతి (ఎస్సీ) లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచి ఎంపీ అయిన నవనీత్‌ కౌర్‌ కులధ్రువీకరణ పత్రం వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా ఆమె ఎంపీ పదవికి గండం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఓ టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు తెలుగు భాష అంటే ఎంతో అభిమానం. తెలుగు ఇండస్ట్రీ లైఫ్‌ ఇచ్చిందన్నారు. కోవిడ్‌ సమయంలో చాలా మంది విద్యార్థులకు హెల్ప్‌ చేశాను. పార్టీలకతీతంగా పార్లమెంట్‌లో గళం వినిపిస్తున్నా అని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు పలు దక్షిణాది చిత్రాల్లో నవీనత్ తళుక్కున మెరిశారు. తెలుగులో బాలకృష్ణజగపతి బాబు వంటి స్టార్లతో పాటు అల్లరినరేశ్వడ్డే నవీన్ తదితర హీరోలతో పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. అదేవిధంగా తమిళకన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్ గా రాణించారు.  రాజకీయాల్లోకి వచ్చాక పూర్తిగా ప్రజాసేవలోనే నిమగ్నమయినట్లు తెలిపారు. తన భర్త ఎమ్మెల్యే కావడంతో రాజకీయాలపై మరింత ఆసక్తి పెరిగిందన్నారు. అదేవిధంగా మా కుటుంబమంతా రాజకీయాల్లోనే ఉంది.. ప్రజల సహకారం వల్లే రాజకీయాల్లో కొనసాగుతున్నా అని నవనీత్ గర్వంగా చెప్పారు. అమరావతిలో ఇండిపెండెంట్‌గా గెలవాలంటే అంత సులువు కాదు.ప్రజాభిమానమే తనను గెలిపించిందన్నారు. గోవిందాసునీల్‌శెట్టి తన తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారని వారికి తన కృతజ్ఞతలు తెలిపారు. 

Wednesday, June 2, 2021

Petrol Diesel rates hike in Telangana

టీఎస్ లో సెంచరీ కొట్టిన పెట్రోల్

తెలంగాణలో పెట్రోల్ సెంచరీ కొట్టింది. ఆదిలాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.23 పైసలుగా ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు మరోసారి పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు, లీటర్ డీజిల్‌పై 23 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒక్క నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలనూ ఆయిల్ కంపెనీలు 17 సార్లు పెంచాయి. ఓ వైపు కరోనా లాక్ డౌన్ మరోవైపు ధరాఘాతంతో ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో పాటు వంట నూనె, కూరగాయల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా పెట్రోల్ ధరల సెగ జనాలకు తాకుతోంది. సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూంటాయి. ఈ నేపథ్యంలో పెట్రో ధరలు ఒక రోజు పెరగొచ్చు.. లేదా తగ్గొచ్చు.. స్థిరంగానూ కొనసాగవచ్చు. అందుకే పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తేవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

Thursday, May 27, 2021

For Rs.18000 man flies single to UAE on 360 seat plane

విమానంలో.. ఒకే ఒక్కడు

ఒకే ఒక్కడు.. ముంబాయి టు దుబాయ్ .. గగనవిహారం.. అదేనండి ప్రయాణం. గల్ఫ్ యువరాజులు, షేక్ లకు తప్పా వేరెవ్వరికీ సాధ్యం కాని ప్రయాణం ఇటీవల అతని సొంతమయింది. కలలో తప్పా సాధ్యం కాని అదృష్టం ఆ యువకుడికి దక్కింది. 360 సీట్ల విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడిగా అతగాడు ప్రయాణించాడు. కరోనా బెడద వల్ల ఈ భాగ్యం అతనికి లభించింది. అదీ కారు చౌకగా.. లక్షలు ఖర్చు పెట్టినా దక్కని ప్రయాణం కేవలం రూ.18 వేల టికెట్ తోనే సాధ్యమయింది. అతని పేరు భవేష్ జవేరి.. వజ్రాల కంపెనీ స్టార్ జెమ్స్ సీఈఓ గా పని చేస్తున్నాడు. బోయింగ్ 777  ఎమిరేట్స్ విమానంలో ఒక ట్రిప్పు ఇంధనం ఖర్చు ఎనిమిది లక్షలు అవుతుందట. కానీ కరోనా నిబంధనల వల్ల జవేరి ఒక్కడే ముంబయి నుంచి బయలుదేరిన విమానంలో అనుభవించు రాజా అని పాడుకుంటూ ఖుషీగా ప్రయాణించాడు. దౌత్య సిబ్బంది, గోల్డెన్ వీసా ఉన్నవారు, అరబ్ జాతీయులు..అన్ని అనుమతులు ఉన్నవారినే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. దాంతో ఆ రోజు ఈ అర్హతలన్నీ ఉన్న ఏకైక ప్రయాణికుడు జవేరీ కావడంతో అతనికే ఆ అవకాశం దొరికింది. దాంతో నచ్చిన సీటులోకి మారుతూ విమాన సిబ్బందితో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జవేరీ జాలీగా దుబాయ్ చేరుకున్నాడు.

Wednesday, May 26, 2021

Water From the Sea Enters Residential Areas in Bengal’s East Midnapore Ahead of Cyclone Yaas Landfall

యాస్​ తుపాను అలజడి

బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ అతి తీవ్ర తుపానుగా మారి అలజడి రేపుతోంది​. బుధవారం మధ్యాహ్నానికి ఒడిశాలోని బాలాసోర్​ దక్షిణ ప్రాంతం తీరానికి చేరువయినట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది. ఉత్తర ధమ్రాదక్షిణ బాలసోర్ (ఒడిశా) మధ్య యాస్​ తీరందాటనుంది. దీని  ప్రభావంతో భద్రక్​ జిల్లాలోని ధమ్రా ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అంతేకాకుండా ఒడిశాలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ తూర్పు మిడ్నాపూర్ లోని న్యూ దిఘా బీచ్ వెంబడి సముద్రం నుంచి నీళ్లు నివాస ప్రాంతాలలోకి ప్రవేశిస్తున్నాయి. రాకాసి అలలు పెద్ద ఎత్తున ఉగ్రరూపంతో విరుచుకుపడుతున్నాయి. ఏపీలో కూడా యాస్ తుపాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దుగరాజపట్నం (నెల్లూరు) నుంచి బారువ (శ్రీకాకుళం) వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంది. సముద్రపు అలలు 2.5 – 5.0 మీటర్ల ఎత్తులో‌ ఎగసి పడుతున్నాయి.  సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మరో రెండ్రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని రాష్ట్ర అధికార వర్గాలు ఆదేశించాయి. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను తీరందాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 60-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. రాష్ట్రానికి చేరుకున్న 15 ఎన్డీఎఫ్ బృందాలు సహాయరక్షణ చర్యలు చేపట్టేందుకు అప్రమత్తంగా ఉన్నాయి.