యాస్ తుపాను అలజడి
బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ అతి తీవ్ర తుపానుగా మారి అలజడి రేపుతోంది. బుధవారం మధ్యాహ్నానికి ఒడిశాలోని బాలాసోర్ దక్షిణ ప్రాంతం తీరానికి చేరువయినట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది. ఉత్తర ధమ్రా–దక్షిణ బాలసోర్ (ఒడిశా) మధ్య యాస్ తీరందాటనుంది. దీని ప్రభావంతో భద్రక్ జిల్లాలోని ధమ్రా ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అంతేకాకుండా ఒడిశాలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ తూర్పు మిడ్నాపూర్ లోని న్యూ దిఘా బీచ్ వెంబడి సముద్రం నుంచి నీళ్లు నివాస ప్రాంతాలలోకి ప్రవేశిస్తున్నాయి. రాకాసి అలలు పెద్ద ఎత్తున ఉగ్రరూపంతో విరుచుకుపడుతున్నాయి. ఏపీలో కూడా యాస్ తుపాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దుగరాజపట్నం (నెల్లూరు) నుంచి బారువ (శ్రీకాకుళం) వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంది. సముద్రపు అలలు 2.5 – 5.0 మీటర్ల ఎత్తులో ఎగసి పడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మరో రెండ్రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని రాష్ట్ర అధికార వర్గాలు ఆదేశించాయి. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను తీరందాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 60-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. రాష్ట్రానికి చేరుకున్న 15 ఎన్డీఎఫ్ బృందాలు సహాయరక్షణ చర్యలు చేపట్టేందుకు అప్రమత్తంగా ఉన్నాయి.
No comments:
Post a Comment