విమానంలో.. ఒకే ఒక్కడు
ఒకే ఒక్కడు.. ముంబాయి టు దుబాయ్ .. గగనవిహారం.. అదేనండి ప్రయాణం. గల్ఫ్ యువరాజులు, షేక్ లకు తప్పా వేరెవ్వరికీ సాధ్యం కాని ప్రయాణం ఇటీవల అతని సొంతమయింది. కలలో తప్పా సాధ్యం కాని అదృష్టం ఆ యువకుడికి దక్కింది. 360 సీట్ల విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడిగా అతగాడు ప్రయాణించాడు. కరోనా బెడద వల్ల ఈ భాగ్యం అతనికి లభించింది. అదీ కారు చౌకగా.. లక్షలు ఖర్చు పెట్టినా దక్కని ప్రయాణం కేవలం రూ.18 వేల టికెట్ తోనే సాధ్యమయింది. అతని పేరు భవేష్ జవేరి.. వజ్రాల కంపెనీ స్టార్ జెమ్స్ సీఈఓ గా పని చేస్తున్నాడు. బోయింగ్ 777 ఎమిరేట్స్ విమానంలో ఒక ట్రిప్పు ఇంధనం ఖర్చు ఎనిమిది లక్షలు అవుతుందట. కానీ కరోనా నిబంధనల వల్ల జవేరి ఒక్కడే ముంబయి నుంచి బయలుదేరిన విమానంలో అనుభవించు రాజా అని పాడుకుంటూ ఖుషీగా ప్రయాణించాడు. దౌత్య సిబ్బంది, గోల్డెన్ వీసా ఉన్నవారు, అరబ్ జాతీయులు..అన్ని అనుమతులు ఉన్నవారినే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. దాంతో ఆ రోజు ఈ అర్హతలన్నీ ఉన్న ఏకైక ప్రయాణికుడు జవేరీ కావడంతో అతనికే ఆ అవకాశం దొరికింది. దాంతో నచ్చిన సీటులోకి మారుతూ విమాన సిబ్బందితో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జవేరీ జాలీగా దుబాయ్ చేరుకున్నాడు.
No comments:
Post a Comment