Saturday, May 16, 2020

From Thermal screening to mask identification: Robots by Jaipur company set to ease work for COVID-19 warriors

కరోనాపై రోబోల యుద్ధం
కరోనా మహమ్మారి బెడద దీర్ఘకాలంగా కొనసాగనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరికల నేపథ్యంలో భారత్ సైతం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది.  చైనా, జపాన్ లాంటి దేశాల్లో విరివిగా కనిపించే రోబోలు  మన దేశంలోనూ ఇబ్బడిముబ్బడిగా మోహరించనున్నాయి. రాజస్థాన్ జైపూర్‌లోని ఓ టెక్నాలజీ కంపెనీ  కరోనా వారియర్ రోబోలను తయారుచేస్తోంది. ఈ రోబోలు కరోనా రోగులకు సేవలు చేసే డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు తోడుగా సేవలందించనున్నాయి. ఈ రోబోలు స్వయంగా థర్మల్ స్క్రీనింగ్ చేస్తాయి. మనిషి వాటి ముందు నిల్చుంటే చాలు స్క్రీనింగ్ చేసి  `మీకు టెంపరేచర్ నార్మల్‌గా ఉంది` లేదంటే.. `మీకు టెంపరేచర్ కాస్త ఎక్కువగా ఉంది` అని క్షణాల్లో చెప్పేస్తాయి. మాస్క్ లేకుండా ఎవరైనా వస్తే ..హలో.. మాస్క్ పెట్టుకోవాలి అని హెచ్చరిస్తాయి` అని కంపెనీ ఎండీ భువనేశ్ మిశ్రా తెలిపారు. ఇప్పటికే బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో రోబోల సేవలు అందుబాటులోకి వచ్చాయి. అవి కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో చెప్పేస్తున్నాయి.  వాయిస్ ను బట్టి జలుబు ఉందా లేదా అని గుర్తిస్తున్నాయి. టెంపరేచర్ చెక్ చేసి రిపోర్టు పేపర్ చేతిలో పెడతాయి. ఆ స్లిప్ తో ఆసుపత్రి లోపలకు వెళ్లి చికిత్స అవసరమైతే పొందొచ్చు. ఇటీవల తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ 10 రోబోలను అక్కడి ఓ ప్రభుత్వాస్పత్రికి కానుకగా ఇచ్చింది.

Wednesday, May 13, 2020

Spain’s oldest woman Maria Branyas, 113, beats Coronavirus infection

`కరోనా` బామ్మ@113కు జేజేలు!!
కరోనా.. నువ్వు నన్ను ఏం చేయలేకపోయావు.. హాహా..హా.. అని చిరునవ్వులు చిందిస్తోంది..ఓ శతాధిక వృద్ధురాలు.. కరోనా అనేంటి..ఆ బామ్మను నాటి స్పానిష్ ఫ్లూ వైరస్ సైతం టచ్ చేయలేకపోయింది. ఇంతకీ ఆ బామ్మ ఎవరనుకుంటున్నారు.. స్పెయిన్ కు చెందిన 113 ఏళ్ల మరియా బ్రన్యాస్‌. వాస్తవానికి ఆమె అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన వారు. అక్కడ నుంచి స్పెయిన్ లోని కటోలినియాకు వలసవచ్చారు. 20 ఏళ్లగా సదరు బామ్మ అక్కడే వృద్ధాశ్రమంలో కాలం వెళ్లదీస్తోంది. ఇటీవల కరోనా మహమ్మారి స్పెయిన్ ను అతలాకుతలం చేసింది. గడిచిన ఏప్రిల్ లో మరియా ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడినా విజయంతంగా ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొంది మృత్యుంజయురాలిగా మనముందుకి వచ్చారు. డిసెంబర్ 2019లో చైనాలోని వూహాన్ లో పురుడుపోసుకున్న కరోనా ఆ తర్వాత ప్రపంచం నలుమూలలా విస్తరించి తడాఖా చూపిస్తోంది. యూరప్, అమెరికా దేశాల్లో విజృంభించి వేలాది ప్రాణాల్ని బలితీసుకుంది. ఇటలీలోని సీనియర్ సిటిజన్లలో 80 శాతం మంది మహమ్మారికి నేలకూలారు. స్పెయిన్‌లో వైరస్ కారణంగా దాదాపు 27వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశానికే చెందిన అనా దెల్‌ వాల్లె అనే 106 ఏళ్ల మహిళ కరోనా నుంచి కోలుకున్న అతిపెద్ద వయస్కురాలిగా ఇటీవల గుర్తింపు పొందారు. అయితే తాజాగా ఈ రికార్డును మరియా చెరిపేశారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1918-19లో విజృంభించిన స్పానిష్‌ ఫ్లూ నుంచి సైతం మరియా కోలుకోవడం విశేషం. రెండు ప్రపంచ యుద్ధాలు సహా 1936-39 మధ్య జరిగిన స్పానిష్‌ అంతర్యుద్ధాన్నీ ఆమె చూశారు. గతేడాది డిసెంబరులో స్పెయిన్‌కు చెందిన వృద్ధాప్య పరిశోధన సంస్థ చేపట్టిన సర్వే ద్వారా మరియా దేశంలో అతి పెద్ద వయస్కురాలిగా గుర్తింపు పొందారు. తనలాంటి వయోవృద్ధుల్ని తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Friday, May 8, 2020

Atleast 16 migrant workers were crushed to death by a Goods Train in Aurangabad and 5 more condition serious

వలస కూలీల ఉసురు తీసిన రైలుబండి
పొట్టచేతపట్టుకుని సుదూర ప్రాంతాలకు వలసవచ్చిన అభాగ్యులు వాళ్లు.. స్వస్థలాలకు తిరుగుపయనమవుతూ కానరాని లోకాలకు తరలిపోయారు. ఈ విషాద దుర్ఘటన మహారాష్ట్రలోని ఔరంగబాద్ సమీపంలో చోటు చేసుకుంది. ఔరంగాబాద్-జల్నా రైల్వే లైన్‌లో ట్రాక్ పై నిద్రిస్తున్న 16 మంది జీవితాల్ని గూడ్సు బండి చిదిమేసింది. దుర్ఘటనలో మరో అయిదుగురు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం చొరవతో ఏర్పాటయిన శ్రామిక్ రైలులో స్వరాష్ట్రానికి చేరుకోవాలని కొండంత ఆశతో వలస కూలీలు గురువారం బయలుదేరారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మే 17 వరకు పొడిగించిన దరిమిలా రైల్వే శాఖ శ్రామిక్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలు ఈ రైలు ఎక్కేందుకు జల్నా నుంచి భుసావాల్ కు బయలుదేరారు. వారంతా శుక్రవారం అక్కడ నుంచి శ్రామిక్ రైలులో స్వస్థలాలకు చేరుకోవాల్సి ఉంది. అప్పటికే 35 కి.మీ. నడక సాగించిన వాళ్లు రాత్రి కావడంతో ఓ ఫ్లై ఓవర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పై నిద్రకు ఉపక్రమించారు. అలసట కారణంగా కూలీలంతా గాఢ నిద్రావస్థలో ఉన్నారు. ట్రాక్ పై మనుషులున్న సంగతిని లోకో పైలట్ గుర్తించినా రైలు నిలుపుచేసే సమయం చిక్కలేదని తెలుస్తోంది. దాంతో గూడ్సు వారిపై నుంచి దూసుకుపోగా కూలీల దేహాలు ఛిద్రమై ట్రాక్ కు ఇరువైపులా పడిపోయాయి. కొనఊపిరితో ఉన్న అయిదుగుర్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. ట్రాక్ సమీపంలో కూర్చున్న మరో ముగ్గురు మాత్రం ఈ ఘోరం నుంచి సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ఘోర ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Sunday, May 3, 2020

Rahul Gandhi raises security concerns over Arogya Setu app

`ఆరోగ్య సేతు`పై రాహుల్ గాంధీ డౌట్
ఆరోగ్య సేతు యాప్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా ప్రయివేట్ నిర్వహణ సంస్థకు యాప్ బాధ్యతలు కట్టబెట్టడంపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. డేటా భద్రతకు భంగం కలగడం, వ్యక్తిగత గోప్యత సమస్యలు పెరుగుతాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అనేది మనల్ని సురక్షితంగా ఉంచాలే తప్పా నష్టపరిచేదిలా ఉండకూడదని హితవు పలికారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో యాప్ కీలకంగా మారుతుందని కేంద్రం భావిస్తున్నతరుణంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కలవరం కల్గిస్తున్నాయి. యాప్ అధునాతన నిఘా వ్యవస్థ అని ఆయన తీవ్రంగా ఆరోపించారు. యాప్ ద్వారా అనుమతి లేకుండానే మనపై నిఘా  నెలకొంటుందని చెప్పారు. మరోవైపు సోమవారం (మే4) నుంచి దేశంలో ఆయా కార్యాలయాల్లో పని చేసే వారు తమ మొబైళ్లలో యాప్ ను తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేసుకోవాలని కేంద్రప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.