Friday, January 31, 2020

India won again in the nail biting T-20 fight

కివీస్ కు మళ్లీ భంగపాటు: సూపర్ ఓవర్లో భారత్ కు మరో గెలుపు
సూపర్ ఓవర్ ఫోబియా కివీస్ ను వదల్లేదు. స్వదేశంలో భారత్ తో జరుగుతున్న టీ20 సీరిస్ నాల్గోమ్యాచ్ లోనూ ఓటమి పాలయింది. వరుసగా రెండో సూపర్ ఓవర్ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం కొనసాగించింది. హమిల్టన్ లో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ గెలుపు దశ నుంచి ఓటమి అంచులకు జారిపోయి సీరిస్ ను 3-0 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. కెప్టెన్ కేన్ విలియమ్సన్ వ్యాఖ్యానించినట్లు ఆ జట్టుకు సూపర్ ఓవర్ అచ్చి రాలేదు. బుధవారం ఓటమి పాలయిన జట్టు శుక్రవారం వరుసగా రెండో సూపర్ ఓవర్ మ్యాచ్ లో భారత్ కు తలవంచింది. క్రితం మ్యాచ్ లో టీమిండియాను గెలిపించిన రోహిత్, జడేజా, షమి  లకు ఈ మ్యాచ్ లో విశ్రాంతి ఇచ్చారు. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన నాల్గో టీ20 ఫలితం తేల్చే సూపర్ ఓవర్ లో బూమ్రా బంతితో కట్టడి చేస్తే రాహుల్ బ్యాట్ తో విజయాన్ని నిర్దేశించారు. మ్యాచ్ ఆద్యంతం భారత్ చెత్త ఫీల్డింగ్ చేసినా కివీస్ విజయతీరానికి చేరలేకపోయింది. సూపర్ ఓవర్లో సీఫెర్ట్, మన్రోలు బ్యాటింగ్ కు దిగారు. బూమ్రా విసిరిన తొలి రెండు బంతుల్లో సీఫెర్ట్ ఇచ్చిన క్యాచ్ ల్ని అయ్యర్, రాహుల్  అందుకోలేకపోయారు. బూమ్రా ఈ ఓవర్లో ఓ వికెట్ తీసి 13 పరుగులిచ్చాడు. ఇందులో రెండు బౌండరీలుండగా మెన్ఇన్ బ్లూ రెండు క్యాచ్ లు జారవిడిచారు. అనంతరం ఓపెనర్ రాహుల్ తో కెప్టెన్ కోహ్లీ 14 పరుగుల లక్ష్య ఛేదనకు క్రీజ్ లోకి వచ్చారు. రాహుల్ తొలిబంతికే సిక్స్, తర్వాత బంతికి బౌండరీ బాదాడు. అదే ఊపులో భారీ షాట్ కు యత్నించి అవుటయ్యాడు. కెప్టెన్ కోహ్లీకి సంజూశ్యాంసన్ జతకలిశాడు. కోహ్లీ సూపర్ ఓవర్ 4,5 బంతుల్లో వరుసగా డబుల్, ఫోర్ (2, 4) కొట్టి ఇంకో బంతి మిగిలివుండగానే భారత్ ను గెలిపించాడు. తొలుత టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. మనీష్ పాండే 50(36), రాహుల్ 39(26) రాణించారు. 166 పరుగుల ఛేదనకు దిగిన కివీస్ పటిష్టమైన స్థితి నుంచి తడబడి చివర్లో 165/7 పరుగుల వద్ద చేతులెత్తేయడంతో మ్యాచ్ టై అయింది. మన్రో 67(47), సీఫెర్ట్ 57(39) అర్ధ సెంచరీలు సాధించారు. శార్దూల్ ఠాకూర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్అవార్డు దక్కింది.

Thursday, January 30, 2020

SC Stays Proceedings Initiated By Woman Claiming To Be Daughter Of Singer Anuradha Paudwal

అనురాధ పౌద్వాల్ కు సుప్రీంలో ఊరట
ప్రముఖ గాయని అనురాధ పౌద్వాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఓ 45ఏళ్ల మహిళ ఆమె కుమార్తె నని చెప్పుకుంటూ రూ .50 కోట్ల పరిహారం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మహిళ ఫిర్యాదు మేరకు తిరువనంతపురం(కేరళ) ఫ్యామిలీ కోర్టులో అనురాధ పౌద్వాల్ పై కేసు విచారణ ప్రారంభమయింది. అయితే పౌద్వాల్ అభ్యర్థన పిటిషన్ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసుపై గురువారం స్టే విధించింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బొబ్డే నేతృత్వంలోని జస్టిస్ గవై, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి సదరు మహిళకు నోటీసు జారీ చేసింది. ఈ కేసును తిరువనంతపురం కోర్టు నుంచి ముంబై కోర్టుకి బదిలీ చేయాలని కోరుతూ పౌద్వాల్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ మేరకు ధర్మాసనం ఆ మహిళకు తాజాగా నోటీసు ఇచ్చింది. పౌద్వాల్ పద్మశ్రీ పురస్కారంతో పాటు జాతీయ ఉత్తమగాయనిగా పలు అవార్డులు అందుకున్నారు. ఆమె సంగీత స్వరకర్త అరుణ్ పౌద్వాల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే పౌద్వాలే తన తల్లి అంటూ సదరు మహిళ కేరళ ఫ్యామిలీ కోర్టుకెక్కారు. ఈ కేసు విచారణకు స్వీకరించిన కోర్టు జనవరి 27న పౌద్వాల్ తన ఇద్దరు పిల్లలతో సహా హాజరుకావాలని ఆదేశించింది. దాంతో పౌద్వాల్ ముంబై కోర్టుకు కేసు బదిలీ చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

Muzaffarnagar Coldest In Uttar Pradesh At 6 Degrees Celsius

ఉత్తరాదిన ఇంకా వణికిస్తున్న చలిపులి
ఉత్తరభారతదేశంలో ఇంకా శీతలవాతావరణం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ (యూపీ)లోని ముజఫర్ నగర్ లో గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 6.3 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. లఖ్నవూ, బరేలీ, ఝాన్సీ, ఆగ్రాల్లో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. యూపీలోని మిగిలిన ప్రాంతాల వాతావరణంలో పెద్ద మార్పేమీ లేనట్లు వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో చాలా చోట్ల శుక్రవారం ఉదయం పొడి వాతావరణం, ఓ మాదిరిగా పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా.

Tuesday, January 28, 2020

AP Council Abolition is A Nonsense:KK

శాసనమండలి రద్దు అర్థరహితం:కేకే
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు చేయాలన్న నిర్ణయం ఓ అర్థరహిత చర్యగా రాజ్యసభ సభ్యుడు, తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు అభిప్రాయపడ్డారు. పెద్దల సభగా విధాన పరిషత్ కొనసాగాలనే తను కోరుకుంటున్నానన్నారు. మండలికి పెట్టే ఖర్చు దండగా అనే వాదనను ఆయన కొట్టిపారేస్తూ..నాన్సెన్స్ అని పేర్కొన్నారు. మన రాజ్యాంగం ప్రకారం శాసనవ్యవస్థలో ఉభయ సభలు ఉండాలి.. ఒక సభలో తొందరపాటు నిర్ణయాలేవైనా తీసుకుంటే పెద్దల సభలో వాటిని సరిచేసే అవకాశముంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ద్వితీయ అభిప్రాయం తప్పనిసరి అని కేకే అన్నారు. 80 ఏళ్ల కేకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధానపరిషత్ లో డిప్యూటీ ఛైర్మన్ గానూ వ్యవహరించారు. కొద్దికాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన `ఇండియన్ ఎక్స్ ప్రెస్` పత్రిక జర్నలిస్టుగా గుర్తింపుపొందారు. గ్రాడ్యూయెట్ ఎమ్మెల్సీ గా రెండు పర్యాయాలు శాసనమండలికి ఎన్నికయ్యారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే కేకే `ది డైలీ న్యూస్` పత్రిక ఎడిటర్ గా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘకాలం పెనవేసుకున్న అనుబంధం ఆయనది. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని నాడు తీవ్రంగా వ్యతిరేకించారు. 1984లో ఎన్టీయార్ హయంలోనూ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం చేసిన సందర్భంలో కేకే బాహటంగా తన వ్యతిరేకత ప్రకటించారు. తాజాగా ఇప్పుడు మండలి రద్దు అంశంపై ఆయన నిర్మోహమాటంగా అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇదిలావుండగా ఉత్తరాంధ్ర నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పాకలపాటి రఘువర్మ మండలి రద్దు తీర్మానాన్ని ఖండించారు. అమరావతిని మార్చడం సరికాదు.. మూడు రాజధానుల ప్రకటనకు అనుకూలంగా మాట్లాడి తప్పు చేశానని పేర్కొన్నారు.