శాసనమండలి రద్దు అర్థరహితం:కేకే
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు చేయాలన్న నిర్ణయం ఓ
అర్థరహిత చర్యగా రాజ్యసభ సభ్యుడు, తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు డాక్టర్
కె.కేశవరావు అభిప్రాయపడ్డారు. పెద్దల సభగా విధాన పరిషత్ కొనసాగాలనే తను
కోరుకుంటున్నానన్నారు. మండలికి పెట్టే ఖర్చు దండగా అనే వాదనను ఆయన
కొట్టిపారేస్తూ..నాన్సెన్స్ అని పేర్కొన్నారు. మన రాజ్యాంగం ప్రకారం శాసనవ్యవస్థలో ఉభయ సభలు ఉండాలి.. ఒక సభలో తొందరపాటు
నిర్ణయాలేవైనా తీసుకుంటే పెద్దల సభలో వాటిని సరిచేసే అవకాశముంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో
ద్వితీయ అభిప్రాయం తప్పనిసరి అని కేకే అన్నారు. 80 ఏళ్ల కేకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
విధానపరిషత్ లో డిప్యూటీ ఛైర్మన్ గానూ వ్యవహరించారు. కొద్దికాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన
ఆయన `ఇండియన్ ఎక్స్ ప్రెస్` పత్రిక జర్నలిస్టుగా గుర్తింపుపొందారు. గ్రాడ్యూయెట్
ఎమ్మెల్సీ గా రెండు పర్యాయాలు శాసనమండలికి ఎన్నికయ్యారు. ఆంగ్లంలో అనర్గళంగా
మాట్లాడే కేకే `ది డైలీ న్యూస్` పత్రిక ఎడిటర్ గా వ్యవహరించారు. కాంగ్రెస్
పార్టీతో సుదీర్ఘకాలం పెనవేసుకున్న అనుబంధం ఆయనది. 1975లో ఇందిరాగాంధీ విధించిన
ఎమర్జెన్సీని నాడు తీవ్రంగా వ్యతిరేకించారు. 1984లో ఎన్టీయార్ హయంలోనూ అసెంబ్లీలో శాసనమండలి
రద్దు తీర్మానం చేసిన సందర్భంలో కేకే బాహటంగా తన వ్యతిరేకత ప్రకటించారు. తాజాగా
ఇప్పుడు మండలి రద్దు అంశంపై ఆయన నిర్మోహమాటంగా అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇదిలావుండగా ఉత్తరాంధ్ర నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పాకలపాటి రఘువర్మ
మండలి రద్దు తీర్మానాన్ని ఖండించారు. అమరావతిని మార్చడం సరికాదు.. మూడు రాజధానుల ప్రకటనకు అనుకూలంగా మాట్లాడి తప్పు చేశానని
పేర్కొన్నారు.
No comments:
Post a Comment