కివీస్ కు మళ్లీ భంగపాటు: సూపర్ ఓవర్లో భారత్ కు మరో గెలుపు
సూపర్ ఓవర్ ఫోబియా కివీస్ ను వదల్లేదు.
స్వదేశంలో భారత్ తో జరుగుతున్న టీ20 సీరిస్ నాల్గోమ్యాచ్ లోనూ ఓటమి పాలయింది.
వరుసగా రెండో సూపర్ ఓవర్ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం కొనసాగించింది. హమిల్టన్ లో
జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ గెలుపు దశ నుంచి ఓటమి అంచులకు జారిపోయి సీరిస్ ను
3-0 తేడాతో కోల్పోయిన
సంగతి తెలిసిందే. కెప్టెన్ కేన్ విలియమ్సన్ వ్యాఖ్యానించినట్లు ఆ జట్టుకు
సూపర్ ఓవర్ అచ్చి రాలేదు. బుధవారం ఓటమి పాలయిన జట్టు శుక్రవారం వరుసగా రెండో సూపర్
ఓవర్ మ్యాచ్ లో భారత్ కు తలవంచింది. క్రితం మ్యాచ్ లో టీమిండియాను గెలిపించిన రోహిత్,
జడేజా, షమి లకు ఈ మ్యాచ్ లో విశ్రాంతి
ఇచ్చారు. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన నాల్గో టీ20 ఫలితం తేల్చే సూపర్ ఓవర్ లో బూమ్రా బంతితో కట్టడి చేస్తే రాహుల్ బ్యాట్
తో విజయాన్ని నిర్దేశించారు. మ్యాచ్ ఆద్యంతం భారత్ చెత్త ఫీల్డింగ్ చేసినా కివీస్
విజయతీరానికి చేరలేకపోయింది. సూపర్ ఓవర్లో సీఫెర్ట్, మన్రోలు బ్యాటింగ్ కు దిగారు. బూమ్రా విసిరిన తొలి రెండు బంతుల్లో సీఫెర్ట్ ఇచ్చిన క్యాచ్ ల్ని అయ్యర్, రాహుల్ అందుకోలేకపోయారు. బూమ్రా ఈ ఓవర్లో ఓ వికెట్ తీసి 13 పరుగులిచ్చాడు. ఇందులో రెండు బౌండరీలుండగా మెన్ఇన్ బ్లూ రెండు క్యాచ్ లు జారవిడిచారు. అనంతరం
ఓపెనర్ రాహుల్ తో కెప్టెన్ కోహ్లీ 14 పరుగుల లక్ష్య ఛేదనకు క్రీజ్ లోకి వచ్చారు.
రాహుల్ తొలిబంతికే సిక్స్, తర్వాత బంతికి బౌండరీ బాదాడు. అదే ఊపులో భారీ
షాట్ కు యత్నించి అవుటయ్యాడు. కెప్టెన్ కోహ్లీకి సంజూశ్యాంసన్ జతకలిశాడు. కోహ్లీ
సూపర్ ఓవర్ 4,5 బంతుల్లో వరుసగా డబుల్, ఫోర్ (2, 4) కొట్టి ఇంకో బంతి మిగిలివుండగానే
భారత్ ను గెలిపించాడు. తొలుత టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్
ఎంచుకుంది. భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. మనీష్
పాండే 50(36), రాహుల్ 39(26) రాణించారు. 166 పరుగుల ఛేదనకు దిగిన కివీస్ పటిష్టమైన
స్థితి నుంచి తడబడి చివర్లో 165/7 పరుగుల
వద్ద చేతులెత్తేయడంతో మ్యాచ్ టై అయింది. మన్రో 67(47), సీఫెర్ట్ 57(39) అర్ధ
సెంచరీలు సాధించారు. శార్దూల్
ఠాకూర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
No comments:
Post a Comment