Monday, January 20, 2020

BalaKrishna new look in the AP Assembly

ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ కొత్త లుక్ 
హిందూపురం ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకుడు నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్ డీఏ బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రతిపక్ష బెంచీల్లో ఆశీనులైన బాలయ్య బారు మీసాలు, గుండు, నెరిసిన గడ్డంతో కనిపించారు. సహచర శాసనసభ్యులే గుర్తు పట్టలేని విధంగా తెల్ల చొక్కా, ప్యాంట్ ధరించిన ఆయన పూర్తి సరికొత్త గెటప్ లో సమావేశాలకు హాజరయ్యారు. బాలయ్య ఈ గెటప్ లో కనిపించడం ఇదే ప్రథమం. దాంతో ఆయన ప్రస్తుత గెటప్ లోని ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవల ఎస్.ఎ.రాజ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన `రూరల్` సినిమాతో ఆయన ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య ఫ్రెంచ్ కట్ గడ్డంతో యువకుడిలా కనిపించి అలరించారు. అందుకు భిన్నంగా ప్రస్తుతం పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిలా వైట్ అండ్ వైట్ డ్రస్, గుండుతో ఆయన దర్శనమివ్వడం చర్చనీయాంశం అయింది. ఆదివారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీఎల్పీ సమావేశానికి ఆయన ఇదే గెటప్ లో హాజరవ్వడంతో తెలుగుదేశం నాయకులూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇదిలావుండగా తాజాగా ఆయన తన ఆస్థాన దర్శకుడు బోయపాటి శ్రీను చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. హ్యాట్రిక్ కోసం వీరి ప్రస్తుత చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Saturday, January 18, 2020

Saibaba temple to remain open on Sunday, bandh at Shirdi

షిర్డీలో బంద్: యథాతథంగా సాయిబాబాకు పూజలు
మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే సర్కారు నిర్ణయానికి నిరసనగా ఆదివారం షిర్డీలో బంద్ పాటించనున్నారు. అయితే సాయిబాబా మందిరం మాత్రం తెరిచే ఉంటుంది. అసంఖ్యాక భక్తులకు అసౌకర్యం కల్గరాదని సాయిబాబా ఆలయ సంస్థాన్ నిర్ణయం తీసుకుంది. శనివారం బాబా పూజలు యథావిధిగా నిర్వహించి భక్తులకు దర్శనం, ప్రసాద వితరణ కార్యక్రమాలు కొనసాగించారు. చారిత్రక ఆధారాలను బట్టి తమ ప్రభుత్వం పాథ్రిని సాయిబాబా జన్మస్థలంగా గుర్తించినట్లు ఉద్ధవ్ పేర్కొన్నారు. ఇటీవల అక్కడ ఆలయ నిర్మాణం, అభివృద్ధికి రూ.100 కోట్ల మొత్తాన్ని మహా అగాడి సర్కార్ ప్రకటించింది. సాయి ఆజన్మాంతం తిరిగి నిర్యాణం చెందిన షిర్డీని పక్కన బెట్టి కొత్త ప్రాంతాన్ని ఉద్ధవ్ ప్రభుత్వం తెరపైకి తేవడాన్ని బీజేపీ కూడా వ్యతిరేకిస్తోంది. షిర్డీ ఆలయ సంస్థాన్ ఈ నిర్ణయంపై బహిరంగంగా ఏ ప్రకటన చేయలేదు. ఆదివారం నాటి షిర్డీ బంద్ కు ట్రస్టుకు సంబంధం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సర్కార్ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తున్న వర్గాలు పట్టణంలో బంద్ కొనసాగించనున్నాయి. వ్యాపార సముదాయాలు మాత్రమే మూసివేయనున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు దర్శనం ఎప్పటిలాగే లభించనుంది. అదేవిధంగా బాబా లడ్డూ ప్రసాదాలను వారికి అందజేయనున్నట్లు సంస్థాన్ వర్గాలు పేర్కొన్నాయి.

Monday, January 13, 2020

Pawan Kalyan meets BJP working president JPNadda

బీజేపీ అగ్రనేత జేపీనడ్డాతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి తరలించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీనడ్డాతో భేటీ అయ్యారు. రెండ్రోజుల క్రితమే ఆయన ఢిల్లీ చేరుకుని మకాం వేసిన సంగతి తెలిసిందే. సోమవారం పవన్ కల్యాణ్ పార్టీ సహచరులు నాదెండ్ల మనోహర్ తో కలిసి నడ్డాతో సమావేశమయ్యారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (బెంగళూరు), ఆ పార్టీ ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ వెంట రాగా జనసేన అధినాయకులు నడ్డాతో భేటీ అయ్యారు. అమరావతి ప్రస్తుత సంక్షోభాన్ని వీరిద్దరూ బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడైన నడ్డా దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ తాజా పరిణామాలన్నింటిని తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లు పవన్, మనోహర్ లకు ఆయన చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ రాజధాని నిర్మాణానికి సంబంధించి రైతులకు పలు పర్యాయాలు పవన్ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు.. వారు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తేనే తీసుకోవాలి తప్పిస్తే బలవంతంగా లాక్కోవద్దని పవర్ స్టార్ గళమెత్తారు. రాజధాని నిర్మాణానికి అన్ని వేల ఎకరాల భూమి అవసరం లేదని కూడా నాడు జనసేనాని అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే అమరావతి పరిసర 29 గ్రామాలకు చెందిన రైతులు 33 వేల ఎకరాల భూమి రాజధాని కోసం సమర్పించారు. ప్రభుత్వ భూములు కలుపుకొని మొత్తం సుమారు 54 వేల ఎకరాల భూములు సమకూరాయి. ఇక కేంద్రం నుంచి రాజధాని నిర్మాణానికి దశల వారీగా నిధులు అందాల్సిన తరుణంలో అసెంబ్లీ ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారడం జరిగింది. ప్రత్యేక హోదా, నవ్యాంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధుల బకాయిలు కోసం పోరాడాల్సిన తరుణంలో మూడు రాజధానుల అంశం కాక రేపుతోంది. అవసర ప్రాధాన్యాలు పక్కకపోయి ఇప్పుడు అమరావతిని రాజధానిగా నిలబెట్టుకోవాల్సిన అగత్యం దాపురించింది. ఇప్పటికే అయిదేళ్లు కాలం గడిచిపోయింది. ఆంధ్రప్రదేశ్ కు ఎప్పుడూ గుడారాల రాజధానే అనే అపకీర్తి మిగులుతోంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు చెన్నై ఆ తర్వాత తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్ర అవతరణ నాడు కర్నూలు రాజధాని అయింది. ఆపై ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డంతో హైదరాబాద్ కు మళ్లాల్సి వచ్చింది. ఇటీవల విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ గా నిలదొక్కుకునేందుకు అమరావతి రాజధానిగా రూపుదాల్చింది. అంతలోనే మళ్లీ దక్షిణాఫ్రికా తరహాలో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. ఇలా వరుసగా  రాజధాని అంశం చుట్టే రాష్ట్రం పరిభ్రమిస్తే అభివృద్ధి మాట అటుంచి మౌలికసౌకర్యాల కల్పనా.. అభూతకల్పనగా మారే దుస్థితి. సాటి తెలుగురాష్ట్రం తెలంగాణ శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోతుంటే చిరకాల ఆంధ్రప్రదేశ్ కు ఇంకా రాజధానే ఖరారు కాకపోవడమంటే నగుబాటే. 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగే అవకాశం (గడువు) మరో నాల్గేళ్లలో 2024లో పూర్తికానుంది.  రాజధాని అమరావతి అనుకున్నాక నిర్మాణ పనులకు అంకురార్పణ జరిగింది. హైదరాబాద్ కు దీటుగా.. ఆ మాటకొస్తే ప్రపంచ ప్రసిద్ధ నగరాల జాబితాలో చోటు దక్కించుకునే రాజధానిని నిర్మించాలన్నదే తమ తపనని నాటి ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. అద్భుత రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టింది. అయితే నిధుల లేమితో ఆ దిశగా అడుగులు వడివడిగా పడలేదన్నది వాస్తవం. ఆ అంశాలన్నింటిపై పాలక ప్రతిపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వంపై దండయాత్ర చేయాల్సిన దశలో ఇప్పుడు అమరావతిలో రాజధానిని నిలుపుకోవడంపై పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ క్రమంలోనే పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా తనవంతు పోరాడుతూనే.. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు నడుం కట్టారు. అందులో భాగంగా ఈరోజు జేపీనడ్డాతో మాట్లాడారు. ఇకపై మళ్లీ బీజేపీతో కలిసి పనిచేయాలనే ఆకాంక్షను కూడా పవన్ కల్యాణ్ ఆయన వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన దరిమిలా తెలుగుదేశం పార్టీ కి దగ్గరయ్యే దిశగాను జనసేనాని అడుగులు వేశారు. చాలా అంశాల్లో పచ్చపార్టీ ఆలోచనా విధానంతో పవన్ ఏకీభవిస్తూ మాట్లాడారు కూడా. జనసేనతో ఎన్నికల పొత్తులో కలిసి వచ్చిన కమ్యూనిస్టు పార్టీలు అమరావతి రాజధాని అంశంలో సైతం గొంతు కలిపాయి. అయితే రాజధాని తరలింపును అడ్డుకోగలిగిన ఏకైక శక్తి కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక్క బీజేపీకే సాధ్యమనే విషయం పవన్ కల్యాణ్ కు బాగా తెలుసు. అందుకనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ భవిత కోసం ఆయన అవసరమైతే మళ్లీ బీజేపీతో సయోధ్యగా ముందుకు పోవడానికి కూడా సంసిద్ధమయ్యారు. మరో వైపు బీజేపీ పెద్దలకు కూడా పవన్ స్టామినా ఏంటో తెలుసు. గతేడాది ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 7శాతం ఓట్లు (సుమారు 21.50 లక్షల ఓట్లు) తెచ్చుకున్న జనసేన రాష్ట్రంలో తృతీయ రాజకీయ శక్తి. ఆ పార్టీది వై.ఎస్.ఆర్.సి.పి, టీడీపీల తర్వాత స్థానం. ఆ దృష్టానే బెట్టు వీడిన బీజేపీ నేతలు పవన్ ఘోష వినడానికి ముందుకు వచ్చారు. జేపీ నడ్డా ఈరోజు ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది.

Saturday, January 11, 2020

Kerala Government collapses Huge multi storied building

కేరళలో 3 సెకన్లలోనే భారీ ఆకాశహార్మ్యం నేలమట్టం
అక్రమకట్టడాలపై కేరళ ప్రభుత్వం శనివారం కొరడా ఝళిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తీర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాల్ని నేల మట్టం చేసింది. ఈ ఉదయం కొచ్చిలో రెండు లగ్జరీ అపార్ట్మెంట్ కాంప్లెక్సుల కూల్చివేత ప్రక్రియను అధికారులు సెకన్ల వ్యవధిలోనే పూర్తి చేశారు. బ్యాక్ వాటర్ ను పట్టించుకోకుండా కొచ్చిలో ఈ విధంగా నాలుగు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లు నిర్మించినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిల్లో 350 కి పైగా ఫ్లాట్లుండగా 240 కుటుంబాలు నివసిస్తున్నాయి. వారందరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించి ఆ గృహ సముదాయాల నుంచి ఖాళీ చేయించారు. అనంతరం రెండ్రోజుల ఈ కూల్చివేతల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ వారాంతంలో కేరళ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియ దేశంలోనే నివాస సముదాయాలతో కూడిన అతిపెద్ద కూల్చివేత డ్రైవ్‌లలో ఒకటిగా నిలిచింది. కొచ్చిలోని మారడు సరస్సు ఒడ్డున హోలీ ఫెయిత్, కయలోరం, ఆల్ఫా వెంచర్స్, హాలిడే హెరిటేజ్, జైన్ హౌసింగ్ పేరిట ఈ అక్రమ అపార్ట్ మెంట్లు వెలిశాయి. నిబంధనలు ఉల్లంఘించి ఈ ఆకాశ హార్య్మాలు నిర్మించడంతో అయిదు నెలల్లోపు వీటిని కూల్చివేయాలని సుప్రీంకోర్టు 2019 సెప్టెంబర్‌లోనే ఆదేశించింది. గత ఏడాది కూడా పెను వరదల తాకిడికి కేరళ అల్లాడిన సంగతి తెలిసిందే. ఈ రోజు రెండు బహుళ అంతస్తుల భవనాలు కూల్చివేతకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. సుమారు 800 కిలోల పేలుడు పదార్థాన్ని ఉపయోగించి కేవలం మూడు సెకన్ల వ్యవధిలోనే భారీ ఆకాశ హార్మ్యాన్ని నేలమట్టం చేయడం విశేషం.