బీజేపీ అగ్రనేత జేపీనడ్డాతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి తరలించనున్నారనే
ఊహాగానాల నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బీజేపీ వర్కింగ్
ప్రెసిడెంట్ జేపీనడ్డాతో భేటీ అయ్యారు. రెండ్రోజుల క్రితమే ఆయన ఢిల్లీ చేరుకుని
మకాం వేసిన సంగతి తెలిసిందే. సోమవారం పవన్ కల్యాణ్ పార్టీ సహచరులు నాదెండ్ల మనోహర్
తో కలిసి నడ్డాతో సమావేశమయ్యారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (బెంగళూరు), ఆ పార్టీ ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ వెంట రాగా జనసేన
అధినాయకులు నడ్డాతో భేటీ అయ్యారు. అమరావతి ప్రస్తుత సంక్షోభాన్ని వీరిద్దరూ బీజేపీ
కార్యనిర్వాహక అధ్యక్షుడైన నడ్డా దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ తాజా
పరిణామాలన్నింటిని తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లు పవన్, మనోహర్ లకు ఆయన చెప్పారు.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ రాజధాని నిర్మాణానికి సంబంధించి రైతులకు పలు
పర్యాయాలు పవన్ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు..
వారు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తేనే తీసుకోవాలి తప్పిస్తే బలవంతంగా లాక్కోవద్దని
పవర్ స్టార్ గళమెత్తారు. రాజధాని నిర్మాణానికి అన్ని వేల ఎకరాల భూమి అవసరం లేదని
కూడా నాడు జనసేనాని అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే అమరావతి పరిసర 29
గ్రామాలకు చెందిన రైతులు 33 వేల ఎకరాల భూమి రాజధాని కోసం సమర్పించారు. ప్రభుత్వ
భూములు కలుపుకొని మొత్తం సుమారు 54 వేల ఎకరాల భూములు సమకూరాయి. ఇక కేంద్రం నుంచి
రాజధాని నిర్మాణానికి దశల వారీగా నిధులు అందాల్సిన తరుణంలో అసెంబ్లీ ఎన్నికలు
రావడం.. ప్రభుత్వం మారడం జరిగింది. ప్రత్యేక హోదా, నవ్యాంధ్రప్రదేశ్ కు
రావాల్సిన నిధుల బకాయిలు కోసం పోరాడాల్సిన తరుణంలో మూడు రాజధానుల అంశం కాక
రేపుతోంది. అవసర ప్రాధాన్యాలు పక్కకపోయి ఇప్పుడు అమరావతిని రాజధానిగా
నిలబెట్టుకోవాల్సిన అగత్యం దాపురించింది. ఇప్పటికే అయిదేళ్లు కాలం గడిచిపోయింది.
ఆంధ్రప్రదేశ్ కు ఎప్పుడూ గుడారాల రాజధానే అనే అపకీర్తి మిగులుతోంది. ఉమ్మడి
మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు చెన్నై ఆ తర్వాత తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా
ఆంధ్రరాష్ట్ర అవతరణ నాడు కర్నూలు రాజధాని అయింది. ఆపై ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డంతో
హైదరాబాద్ కు మళ్లాల్సి వచ్చింది. ఇటీవల విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ గా
నిలదొక్కుకునేందుకు అమరావతి రాజధానిగా రూపుదాల్చింది. అంతలోనే మళ్లీ
దక్షిణాఫ్రికా తరహాలో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. ఇలా వరుసగా రాజధాని అంశం చుట్టే రాష్ట్రం పరిభ్రమిస్తే
అభివృద్ధి మాట అటుంచి మౌలికసౌకర్యాల కల్పనా.. అభూతకల్పనగా మారే దుస్థితి. సాటి
తెలుగురాష్ట్రం తెలంగాణ శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోతుంటే చిరకాల ఆంధ్రప్రదేశ్
కు ఇంకా రాజధానే ఖరారు కాకపోవడమంటే నగుబాటే. 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
కొనసాగే అవకాశం (గడువు) మరో నాల్గేళ్లలో 2024లో పూర్తికానుంది. రాజధాని అమరావతి అనుకున్నాక నిర్మాణ పనులకు
అంకురార్పణ జరిగింది. హైదరాబాద్ కు దీటుగా.. ఆ మాటకొస్తే ప్రపంచ ప్రసిద్ధ నగరాల
జాబితాలో చోటు దక్కించుకునే రాజధానిని నిర్మించాలన్నదే తమ తపనని నాటి ప్రభుత్వం
సగర్వంగా ప్రకటించింది. అద్భుత రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దే పనులకు
శ్రీకారం చుట్టింది. అయితే నిధుల లేమితో ఆ దిశగా అడుగులు వడివడిగా పడలేదన్నది
వాస్తవం. ఆ అంశాలన్నింటిపై పాలక ప్రతిపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వంపై దండయాత్ర
చేయాల్సిన దశలో ఇప్పుడు అమరావతిలో రాజధానిని నిలుపుకోవడంపై పోరాడాల్సిన పరిస్థితి
నెలకొంది. ఆ క్రమంలోనే పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా తనవంతు పోరాడుతూనే.. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు నడుం కట్టారు. అందులో
భాగంగా ఈరోజు జేపీనడ్డాతో మాట్లాడారు. ఇకపై మళ్లీ బీజేపీతో కలిసి పనిచేయాలనే
ఆకాంక్షను కూడా పవన్ కల్యాణ్ ఆయన వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల
ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన దరిమిలా తెలుగుదేశం పార్టీ కి దగ్గరయ్యే దిశగాను
జనసేనాని అడుగులు వేశారు. చాలా అంశాల్లో పచ్చపార్టీ ఆలోచనా విధానంతో పవన్
ఏకీభవిస్తూ మాట్లాడారు కూడా. జనసేనతో ఎన్నికల పొత్తులో కలిసి వచ్చిన కమ్యూనిస్టు
పార్టీలు అమరావతి రాజధాని అంశంలో సైతం గొంతు కలిపాయి. అయితే రాజధాని తరలింపును
అడ్డుకోగలిగిన ఏకైక శక్తి కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక్క బీజేపీకే సాధ్యమనే విషయం
పవన్ కల్యాణ్ కు బాగా తెలుసు. అందుకనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ భవిత కోసం ఆయన
అవసరమైతే మళ్లీ బీజేపీతో సయోధ్యగా ముందుకు పోవడానికి కూడా సంసిద్ధమయ్యారు. మరో వైపు బీజేపీ పెద్దలకు కూడా పవన్ స్టామినా ఏంటో తెలుసు.
గతేడాది ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 7శాతం ఓట్లు (సుమారు 21.50 లక్షల ఓట్లు)
తెచ్చుకున్న జనసేన రాష్ట్రంలో తృతీయ రాజకీయ శక్తి. ఆ పార్టీది వై.ఎస్.ఆర్.సి.పి,
టీడీపీల తర్వాత స్థానం. ఆ దృష్టానే బెట్టు వీడిన బీజేపీ నేతలు పవన్ ఘోష వినడానికి
ముందుకు వచ్చారు. జేపీ నడ్డా ఈరోజు ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment