షిర్డీలో బంద్: యథాతథంగా సాయిబాబాకు పూజలు
మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే సర్కారు నిర్ణయానికి నిరసనగా ఆదివారం షిర్డీలో బంద్
పాటించనున్నారు. అయితే సాయిబాబా మందిరం మాత్రం తెరిచే ఉంటుంది. అసంఖ్యాక భక్తులకు
అసౌకర్యం కల్గరాదని సాయిబాబా ఆలయ సంస్థాన్ నిర్ణయం తీసుకుంది. శనివారం బాబా పూజలు
యథావిధిగా నిర్వహించి భక్తులకు దర్శనం, ప్రసాద వితరణ కార్యక్రమాలు కొనసాగించారు. చారిత్రక
ఆధారాలను బట్టి తమ ప్రభుత్వం పాథ్రిని సాయిబాబా జన్మస్థలంగా గుర్తించినట్లు ఉద్ధవ్
పేర్కొన్నారు. ఇటీవల అక్కడ ఆలయ నిర్మాణం, అభివృద్ధికి రూ.100 కోట్ల మొత్తాన్ని మహా
అగాడి సర్కార్ ప్రకటించింది. సాయి ఆజన్మాంతం తిరిగి నిర్యాణం చెందిన షిర్డీని
పక్కన బెట్టి కొత్త ప్రాంతాన్ని ఉద్ధవ్ ప్రభుత్వం తెరపైకి తేవడాన్ని బీజేపీ కూడా
వ్యతిరేకిస్తోంది. షిర్డీ ఆలయ సంస్థాన్ ఈ నిర్ణయంపై బహిరంగంగా ఏ ప్రకటన చేయలేదు.
ఆదివారం నాటి షిర్డీ బంద్ కు ట్రస్టుకు సంబంధం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే
సర్కార్ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తున్న వర్గాలు పట్టణంలో బంద్ కొనసాగించనున్నాయి.
వ్యాపార సముదాయాలు మాత్రమే మూసివేయనున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు దర్శనం
ఎప్పటిలాగే లభించనుంది. అదేవిధంగా బాబా లడ్డూ ప్రసాదాలను వారికి అందజేయనున్నట్లు
సంస్థాన్ వర్గాలు పేర్కొన్నాయి.
No comments:
Post a Comment