Thursday, December 5, 2019

SC grants bail to Chidambaram in INX Media money laundering case


ఎట్టకేలకు చిదంబరానికి బెయిల్
కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరానికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఐ.ఎన్.ఎక్స్ మీడియా ముడుపులు, మనీ లాండరింగ్ కేసులో సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లను ఎదుర్కొంటూ జైలు పాలైన 74 ఏళ్ల ఈ కాంగ్రెస్ కురువృద్ధ నేతకు జస్టిస్ ఎ ఎస్ బోపన్న, హృషికేశ్ రాయ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చిదంబరం బయట ఉంటే ఈ కేసులో సాక్షుల్ని ప్రభావితం చేయొచ్చన్న హైకోర్టు వాదనను దేశ సర్వోనత న్యాయస్థానం తోసిపుచ్చింది. 105 రోజులుగా చిదంబరం తీహార్ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 15న ఢిల్లీ హైకోర్టు తనకు బెయిల్ ను నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చిదంబరం దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు ఈ తాజా తీర్పు ఇచ్చింది. ఈడీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ మనీలాండరింగ్ వంటి ఆర్థిక నేరాలు చాలా తీవ్రమైనవని, అవి దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాకుండా సమాజంలోని ప్రజల విశ్వాసాన్ని సడలిస్తాయని వాదించారు. చిదంబరం తరఫున కేసులో ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ఎ.ఎం. సింగ్వి మెహతాలు తమ వాదనలు వినిపిస్తూ ఆయన ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేశారని లేదా ఏదైనా సాక్ష్యాలను దెబ్బతీశారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ కోర్టు చిదంబరానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు అనుమతి లేకుండా చిదంబరం దేశం విడిచి వెళ్ళరాదని, మీడియాతో మాట్లాడకూడదని ధర్మాసనం ఆదేశించింది. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో 2007 లో రూ .305 కోట్ల విదేశీ నిధులను అందుకునేందుకు ఐఎన్‌ఎక్స్ మీడియా గ్రూపునకు అనుమతులు మంజూరు అయ్యాయి. ఆ సంస్థకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌.ఐ.పి.బి) క్లియరెన్స్‌ లు లభించడంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ 2017 మే 15 న కేసు నమోదు చేసింది. ఆగస్టు 21న ఆయనను అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ చిదంబరాన్ని అక్టోబర్ 16న అరెస్ట్ చేసింది. దాంతో సీబీఐ కేసులో అక్టోబర్ 22న ఆయన బెయిల్ పొందినా ఈడీ అరెస్ట్ కారణంగా తీహార్ జైలులోనే అప్పటి నుంచి ఉండిపోవాల్సి వచ్చింది. అంతకుముందు ఇవే కేసుల్లో ఆయన కుమారుడు శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం అరెస్టయ్యారు. తీహార్ జైలులో కొద్ది రోజులున్న అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. కార్తీ కూడా విదేశాలకు అనుమతి లేకుండా వెళ్లరాదని అప్పట్లో కోర్టు షరతులతోనే బెయిల్ ఇచ్చింది.

Friday, November 29, 2019

Devastated and Heartbroken about `Disha` murder:Keerthi Suresh

గుండె పగిలింది:కీర్తి సురేశ్
`జస్టిస్ ఫర్ దిశ` హత్యోందంతం విన్నాక గుండె పగిలినంత పనైందని ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆమె ట్వీట్ చేస్తూ రోజురోజుకూ క్రూరత్వం హింసాప్రవృత్తి పెరిగిపోతున్నాయని పేర్కొంది. సూపర్ సేఫ్ సిటీగా భావించే హైదరాబాద్ లోనే ఇలాంటి దారుణం జరగడం పట్ల తల్లడిల్లుతున్నట్లు తెలిపింది. సావిత్రి యథార్థ గాథ ఆధారంగా నిర్మితమైన `మహానటి` చిత్రం లో నటించిన కీర్తి సురేశ్ బహుళ ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడిన మృగాళ్లని కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది. మరో నిర్భయ ఘటనగా విశ్లేషకులు వర్ణిస్తున్న `దిశ` దారుణ హత్యపై తెలుగు పరిశ్రమ భగ్గుమంది. హీరోయిన్లు లావణ్య త్రిపాఠి, రాశీ ఖన్నా, మెహ్రిన్, పూనమ్ కౌర్, గాయని చిన్మయి శ్రీపాద, హీరోలు రవితేజ, అఖిల్, అల్లరి నరేష్, సుధీర్ బాబు, మంచుమనోజ్, సుశాంత్ తదితరులు ఈ క్రూరత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ల ద్వారా ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.

Wednesday, November 27, 2019

'How can you always blame boys?': Director Bhagyaraj's 'genius'


భాగ్యరాజా పిచ్చివాగుడు: హోరెత్తిన నిరసనలు
వయసు పెరిగేకొద్దీ ఒద్దిక పెరిగి బుద్ధి వికసించి సమాజానికి ఉపయోగపడే నాలుగు మంచి మాటలు చెప్పాలి. అందుకు భిన్నంగా మాట్లాడిన తమిళ దర్శక, నిర్మాత భాగ్యరాజా చివాట్లు తింటున్నాడు. కోలీవుడ్ లోనే కాక టాలీవుడ్ లోనూ పలు కుటుంబ, హాస్యరస చిత్రాలను నిర్మించి నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన భాగ్యరాజా మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. పురుషులకు చనువు ఇవ్వడం, ఎక్కువ సమయంపాటు రెండేసి మొబైళ్లలో చాటింగ్ చేస్తుండడమే తాజా అత్యాచార ఘటనలకు కారణంగా పేర్కొన్నాడు. అంతేకాకుండా తప్పంతా అబ్బాయిలదే అనడం తప్పు అని సూత్రీకరించాడు. ఓ పురుషుడు వివాహేతర సంబంధం పెట్టుకుంటే అతని ఇంటి ఇల్లాలికి ఏమి నష్టం జరగదు..కానీ అదే ఇల్లాలు అక్రమ సంబంధంలో ఉంటే కన్న పిల్లల్ని హత్య చేయడానికీ వెనుకాడదు..అంటూ పేద్ద.. తత్వవేత్తలా విశదీకరించాడు. దాంతో సామాజికమాధ్యమాల్లో అతనిపై ట్రోలింగ్ పీక్ కు చేరింది.  తాజా తమిళ సినిమా మ్యూజిక్ లాంచ్‌లో భాగ్యరాజా ఈ పిచ్చిప్రేలాపన చేశాడు. సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖుడు ఇలా వ్యాఖ్యానించడం తగదని ప్రముఖ గాయని చిన్నయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో మహిళా సంఘాలు భాగ్యరాజా వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి.

Monday, November 25, 2019

More women abused than not, in US


మహిళలపై వేధింపులు అమెరికాలోనే ఎక్కువ 
భూతల స్వర్గం అమెరికాలోనూ ఆడవాళ్లపై వేధింపుల పర్వం కొనసాగుతోంది. ఇటీవల వెల్లడైన సర్వేల ప్రకారం అగ్రరాజ్యంలో సుమారు 70% మంది మహిళలు తమ భాగస్వాముల వేధింపులకు లోనవుతున్నట్లు తేలింది. అమెరికాలో అత్యధిక శాతం మహిళలు తమ పార్టనర్ల ద్వారా శారీరక, లైంగిక వేధింపుల బారిన పడుతున్నట్లు ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ (యూఎన్ వుమెన్) సోమవారం ఓ నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా కళాశాల విద్యార్థినులు ప్రతి నలుగురిలో ఒకరు లైంగిక అకృత్యం లేదా దుష్ప్రవర్తనలను చవిచూస్తున్నారని పేర్కొంది. ఇతరత్రా మహిళలపై వేధింపులకు లెక్కేలేదని ఆ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన సర్వేల్లో వివిధ దేశాల్లో భాగస్వాముల ద్వారా హింసకు గురవుతున్న మహిళల శాతం అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా తర్వాత ఆఫ్రికా దేశాల్లో హింసకు గురౌతున్న మహిళలు 65 శాతం ఉండొచ్చని అంచనా. దక్షిణాసియా, లాటిన్ అమెరికా దేశాల్లో ఈ శాతం 40 వరకు చేరుకుందని తెలుస్తోంది. మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం (`ఆరెంజ్ డే`) సందర్భంగా ఈరోజు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ తక్షణం ఈ ఆటవిక రుగ్మతకు చరమగీతం పాడాలన్నారు. మహిళలపై హింస వీడడం, లింగ సమానత్వం దిశగా ముందుకు సాగడం యావత్ విశ్వాన్ని స్థిరమైన అభివృద్ధి వద్ద నిలుపుతుందని చెప్పారు. `శతాబ్దాలుగా పురుష ఆధిక్య సమాజంలో మహిళలు, బాలికలపై లైంగిక హింస పాతుకుపోయింది. అత్యాచార సంస్కృతికి ఆజ్యం పోసింది. లింగ అసమానతలనన్నవి శక్తి అసమతుల్యతకు సంబంధించిన ప్రశ్న అని మనం మర్చిపోకూడదు` అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచం నలుమూలలా మహిళలు పురుషులతో సమానంగా స్వేచ్ఛగా జీవించాలని ఆకాంక్షిస్తూ ఐక్యరాజ్యసమితి ఏటా నవంబర్ 25న `ఆరెంజ్ డే` పాటిస్తోంది. ఈ ప్రచార కార్యక్రమాన్ని యూఎన్ మాజీ ప్రధానకార్యదర్శి బాన్ కీ మూన్ తన పదవీ కాలంలో ప్రారంభించారు.