Showing posts with label USA Women. Show all posts
Showing posts with label USA Women. Show all posts

Monday, November 25, 2019

More women abused than not, in US


మహిళలపై వేధింపులు అమెరికాలోనే ఎక్కువ 
భూతల స్వర్గం అమెరికాలోనూ ఆడవాళ్లపై వేధింపుల పర్వం కొనసాగుతోంది. ఇటీవల వెల్లడైన సర్వేల ప్రకారం అగ్రరాజ్యంలో సుమారు 70% మంది మహిళలు తమ భాగస్వాముల వేధింపులకు లోనవుతున్నట్లు తేలింది. అమెరికాలో అత్యధిక శాతం మహిళలు తమ పార్టనర్ల ద్వారా శారీరక, లైంగిక వేధింపుల బారిన పడుతున్నట్లు ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ (యూఎన్ వుమెన్) సోమవారం ఓ నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా కళాశాల విద్యార్థినులు ప్రతి నలుగురిలో ఒకరు లైంగిక అకృత్యం లేదా దుష్ప్రవర్తనలను చవిచూస్తున్నారని పేర్కొంది. ఇతరత్రా మహిళలపై వేధింపులకు లెక్కేలేదని ఆ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన సర్వేల్లో వివిధ దేశాల్లో భాగస్వాముల ద్వారా హింసకు గురవుతున్న మహిళల శాతం అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా తర్వాత ఆఫ్రికా దేశాల్లో హింసకు గురౌతున్న మహిళలు 65 శాతం ఉండొచ్చని అంచనా. దక్షిణాసియా, లాటిన్ అమెరికా దేశాల్లో ఈ శాతం 40 వరకు చేరుకుందని తెలుస్తోంది. మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం (`ఆరెంజ్ డే`) సందర్భంగా ఈరోజు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ తక్షణం ఈ ఆటవిక రుగ్మతకు చరమగీతం పాడాలన్నారు. మహిళలపై హింస వీడడం, లింగ సమానత్వం దిశగా ముందుకు సాగడం యావత్ విశ్వాన్ని స్థిరమైన అభివృద్ధి వద్ద నిలుపుతుందని చెప్పారు. `శతాబ్దాలుగా పురుష ఆధిక్య సమాజంలో మహిళలు, బాలికలపై లైంగిక హింస పాతుకుపోయింది. అత్యాచార సంస్కృతికి ఆజ్యం పోసింది. లింగ అసమానతలనన్నవి శక్తి అసమతుల్యతకు సంబంధించిన ప్రశ్న అని మనం మర్చిపోకూడదు` అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచం నలుమూలలా మహిళలు పురుషులతో సమానంగా స్వేచ్ఛగా జీవించాలని ఆకాంక్షిస్తూ ఐక్యరాజ్యసమితి ఏటా నవంబర్ 25న `ఆరెంజ్ డే` పాటిస్తోంది. ఈ ప్రచార కార్యక్రమాన్ని యూఎన్ మాజీ ప్రధానకార్యదర్శి బాన్ కీ మూన్ తన పదవీ కాలంలో ప్రారంభించారు.