Monday, May 13, 2019

will federal front has a chance to play a role in indian politics now?


సమాఖ్య కూటమి కల సాకారమయ్యేనా?
భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి రాజనీతిజ్ఞత కనబరిచిన నేతల్ని వేళ్ల మీదే లెక్కించొచ్చు. ప్రధానమంత్రులుగా ఆ పాత్రలో ఒదిగిపోయి దేశ విదేశాల్లో కీర్తి పతాకను ఎగురువేసిన కొద్ది మందిలో ప్రథమ ప్రధాని పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పి.వి.నరసింహారావు, ఎ.బి.వాజ్ పేయి ముందువరుసలో నిలుస్తారు. కొద్ది కాలమే పరిపాలన సాగించిన లాల్ బహుదూర్ శాస్త్రి విలువల రాజకీయాలకు పెట్టింది పేరు. ప్రస్తుతం ఆ స్థాయి ప్రధాని దేశానికి కావాలని దశాబ్దాల తరబడి భారత్ ప్రజలు ఎదురుచూస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయం కనిపిస్తోందా? అన్నదే ప్రశ్న. ఆ ప్రయత్నాలే ఇప్పడు మళ్లీ అధికారంలో ఉన్న, వస్తామని భావిస్తున్న ప్రాంతీయ పార్టీల నాయకులు చేస్తుండడం ప్రశంసార్హం. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒంటి చెత్తో భారతీయ జనతా పార్టీని ఢిల్లీ గద్దెనెక్కించిన ఘనత నరేంద్రమోదీదే.
అత్యున్నత ప్రధానమంత్రి కుర్చీలోకి వచ్చిన మోదీ ఆ తర్వాత ఎన్డీయే లోని మిత్ర పక్షాలకు కూడా దూరమయ్యారు. మళ్లీ తాజా సార్వత్రిక ఎన్నికల నాటికే వారితో సయోధ్య కుదర్చుకోగలిగారు. పరిపాలనలో మెరుపులు మాటెలా ఉన్నా మరకలుగా పెద్ద నోట్ల రద్దు అంశం, జీఎస్టీ బీజేపీనే  కలవరపాటుకు గురి చేశాయి. నోట్ల రద్దు నేపథ్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏటీఎం క్యూల్లో నిలబడి 100 మందికి పైగా మృతి చెందడం అత్యంత అపకీర్తిని తెచ్చిపెట్టింది. జీడీపీ కుంగిపోయి ద్రవ్యోల్బణం పెంపునకు బాటలు పరిచింది. మహిళలు బంగారం లెక్కలు చెప్పాలని, రశీదులు చూపాలని కోరి మళ్లీ వెనకడుగు వేశారు. అలాగే బ్యాంక్ ల పరిపుష్టి పేరుతో  జనం డిపాజిట్లను బాండ్లుగా మార్చే యోచన(ఎఫ్.ఆర్.డి.ఐ బిల్లు) మోదీ అంటేనే జనానికి భయాన్ని కల్గించింది. జీఎస్టీ అమలు (స్లాబ్ ల సవరణలతో)తదితరాలతో  సామాన్యులు, వ్యాపారులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగాల్సిన సమాఖ్య స్ఫూర్తికి మోదీ పాలన తూట్లు పొడుస్తోందని పలు రాష్ట్రాలు గగ్గోలు పెట్టాయి. ఈ పరిణామాల వల్లే సమాఖ్య కూటమి ఆలోచన మొగ్గతొడిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, తమిళనాడు ప్రతిపక్ష డీఎంకె నేత స్టాలిన్ భేటీ ఈ కోణంలోనే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సమాఖ్య కూటమి ఏర్పాటు దిశగా ఈ అంశాన్ని భుజాలకెత్తుకున్న కేసీఆర్ ప్రయత్నాలు ఆయనే చెప్పినట్లు ఎన్నికల ఫలితాల తర్వాత జోరందుకోవచ్చు. ప్రత్యామ్నాయం అవసరమైన నాడు కాంగ్రెస్ యేతర, బీజీపీ యేతర కూటమి కచ్చితంగా భారత ప్రధాని పీఠం వైపు చురుగ్గా కదులుతుంది. దేశంలో స్వాతంత్ర్యానంతరం రాకాసి సమస్యగా కనీస సౌకర్యాల లేమి ఇంకా పీడిస్తూనే ఉంది. అందుకు విరుగుడుగా అందరికీ కనీస సౌకర్యాలు అందేటటువంటి కేసీఆర్ మోడల్ ప్లాన్, విజన్ ముమ్మాటికి అక్కరకు వస్తాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న సమాఖ్య కూటమి ప్రయత్నాలు మళ్లీ బీజేపీ సారథ్యంలోని ఏన్డీయే కూటమికే లబ్ధి చేకూరుస్తాయా? అనే మూలంలోని లోగుట్టును ప్రాంతీయ పార్టీల నేతలు పరిగణనలోకి తీసుకోవాలి.
పశ్చిమబెంగాల్ లో అధికారంలో ఉన్న టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష భాగస్వామ్య కూటమి నేత విజయన్, తాజాగా తమిళనాడులో ఈసారి లోక్ సభ ఎన్నికల్లో విజయఢంకా మోగించవచ్చని భావిస్తున్న డీఎంకె అధినేత స్టాలిన్ లతో చర్చలు జరిపామనడం వరకు బాగానే ఉంది. అయితే వీరంతా కేంద్రంలో యూపీఏ పక్షాలవారే. ఎన్డీయే లో అయిదేళ్లగా ఇబ్బందుల పడ్డ ఆ కూటమి పార్టీలతో కూడా ఈపాటికే చర్చలు విస్తృతంగా సాగాలి. ఎవరితో చర్చలు జరిపామో, జరుపుతున్నామో అన్నీ ముందే వెల్లడించం కదా అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాబట్టి ఆయన ఆ కూటమిలోని అసంతృప్తులతోనూ చర్చలకు అంకురార్పణ చేసినట్లుగానే భావించాలి. వాస్తవానికి ఒక అద్భుతమైన స్థిరమైన లక్ష్యంతో చేపట్టిన బృహత్తర కార్యక్రమమది. దేశ రాజకీయాల్ని మలుపుతిప్పే కోట్ల మంది సాధారణ ప్రజల్లో ఆశలు చిగురింపజేసే మహత్కార్యం.
మహారాష్ట్రలో శివసేన, ఒడిశాలో బిజూజనతాదళ్, బిహార్ లో జనతాదళ్ యునైటెడ్ ఎన్డీయే కూటమితో పలు సందర్భాల్లో పొసగక బహిరంగంగానే బీజేపీపై ధ్వజమెత్తాయి. అదీ ఇప్పటి సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల వరకు ఆ పార్టీలు బీజేపీ వైఖరిపై కినుక వహించాయి. సమాఖ్య కూటమి ఏర్పాటుకు తపిస్తున్న నేతలు ఆ పార్టీలతో ఏ మేరకు సత్సంబంధాలు నెరిపారో తెలియాలి. దక్షిణాదిలో బీజేపీకి బలం దాదాపు లేనట్లే. హిందీ బెల్ట్ గా చెప్పుకునే అత్యధిక లోక్ సభ నియోజకవర్గాలు గల 10 రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో సమాఖ్య కూటమి విస్తృత చర్చలు చేపట్టాలి. సమాఖ్య కూటమి అడుగులు ఈ ఎన్నికల తర్వాత పెద్దగా ముందుకు పడకపోయినా ఈ ఆలోచన మున్ముందు సాకరమయ్యే అవకాశం నూటికి నూరుపాళ్లు ఉంది.

Sunday, May 12, 2019

mumbai indians bags again ipl crown fouth time in 2019


ముంబయిదే మళ్లీ ఐపీఎల్ కిరీటం
·        చెన్నై నుంచి గెలుపును లాగేసిన మలింగ
·        షేన్ వాట్సన్(80) పోరాటం వృథా
·        సీజన్ 12లో ఆఖరి బంతి వరకు సాగిన 20వ మ్యాచ్
అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ సీజన్ 12 ఫైనల్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ గెలిచింది. ఐపీఎల్ చరిత్రలో ముంబయికిది నాల్గో ట్రోఫీ. ప్రతి రెండేళ్లకు ఓ ఐపీఎల్ టైటిల్ ను ముంబయి సొంతం చేసుకుంది. 2013, 2015, 2017, 2019ల్లో ఐపీఎల్ విజేతగా నిలిచింది. 52 రోజుల పాటు కొనసాగిన ఐపీఎల్ 2019 పండుగ అభిమానుల్ని విపరీతంగా అలరించింది. ఈ సీజన్ లో ఏకంగా 20 మ్యాచ్ లు ఆఖరి బంతికి కొనసాగాయంటేనే టోర్నీ ఎంత ఉత్కంఠంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ (ఎం.ఐ) కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే రోహిత్ నిర్ణయం తప్పని నిరూపించినట్లుగా చెన్నై సూపర్ కింగ్స్ (సి.ఎస్.కె) కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఫీల్డింగ్ లోనూ రాణించి ముంబయిని భారీగా పరుగులు చేయకుండా నిలువరించింది. ముంబయిని 149/ 8 పరుగులకే పరిమితం చేసింది. లక్ష్యం పరిమితంగా ఉండడంతో సీనియర్ ఆటగాళ్ల సమతూకంతో పటిష్టంగా ఉన్నచెన్నై గెలుపు సునాయాసమే అనిపించింది. దానికి తోడు ఫీల్డింగ్ లోటుపాట్లు ముంబయిని ఓటమి దిశగా నడిపించాయి. ముఖ్యంగా చెన్నై ఓపెనర్లు డూప్లెసిస్(26), షేన్ వాట్సన్(80) లు తొలి ఆరు ఓవర్లు చెలరేగిపోయారు. అయితే తర్వాత వచ్చిన ఏ చెన్నై బ్యాటర్ పెద్దగా షేన్ వాట్సన్ కు అండగా నిలవలేదు. బ్రావో(15) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. ధోని(2) రనౌట్ కావడం చివరి ఓవర్ నాలుగో బంతికి వాట్సన్ కూడా రనౌట్ గా వెనుదిరగడంతో ఆ జట్టు విజయావకాశాలు సన్నగిల్లాయి. బౌలింగ్ లో మెరిసిన శార్దుల్ ఠాకుర్ చివరి ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చి అయిదో బంతికి రెండు పరుగులు రాబట్టినా చివరి బంతికి కావాల్సిన రెండు పరుగుల్ని చేయలేక వెనుదిరిగాడు. అంతవరకు బౌలింగ్ లో ధారాళంగా పరుగులిచ్చిన జీరో మలింగ చివరి ఓవర్ లో హీరో అయ్యాడు. 9 పరుగులు చేయాల్సిన చెన్నై జట్టుకు 7 పరుగులే ఇచ్చి వికెట్ పడగొట్టి ముంబయిని గెలిపించాడు. చివరి బంతికి ఠాకుర్ ను ఎల్.బి.డబ్లు.గా పెవిలియన్ చేర్చాడు. చెన్నై 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు మాత్రమే చేయగల్గింది. నాలుగు ఓవర్లలో 14 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టిన జస్ప్రిత్ బుమ్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి తొలి ఓవర్లలో దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్(29), రోహిత్ శర్మ(15) వెంటవెంటనే వెనుదిరిగారు. సూర్యకుమార్(15), ఇషాన్ కిషన్(23), పోలార్డ్(41), హార్ధిక్ పాండ్య(16) చెప్పుకోదగ్గ పరుగులు చేయడంతో స్కోరు 149 వరకు వచ్చింది. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్ 3, శార్దూల్ ఠాకుర్, ఇమ్రాన్ తాహిర్ చెరో రెండు వికెట్లు తీశారు.

37 bangladeshi migrants drowned in tunisia coast



తునిసియా తీరంలో 37 మంది బంగ్లాదేశ్ వలసదారుల మృతి
తునిసియా సమీపంలోని మధ్యధరా సముద్రంలో బోటు మునిగిపోయిన దుర్ఘటనలో 37 మంది బంగ్లాదేశ్ జాతీయులు మృత్యుపాలయ్యారు. శుక్రవారం బోటు మునిగిపోయినట్లు తెలుస్తోంది. ట్రిపోలీ లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్ మృతుల సంఖ్యను నిర్ధారించడం లేదు. తమ దేశీయులు 37 మంది జాడ తెలియడం లేదని మాత్రమే పేర్కొన్నారు. బోటు ప్రమాదానికి గురయ్యే సమయానికి మొత్తం 60 మంది అందులో ప్రయాణిస్తున్నారు. వారిలో 51 మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులే ఉన్నారు. అందులో 16 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. ఇంకా జాడ తెలియని వారిలో ఈజిప్ట్, మొరాకో జాతీయులు ఉన్నారు. వీరంతా లిబియా(జౌరా) నుంచి యూరప్ కు బోటులో ప్రయాణిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. బోటు మునకకు కారణాలు తెలియాల్సి ఉంది. యూరప్ లో బతుకు తెరువు కోసం ప్రమాద మార్గంలో(అనుమతి లేని బోట్లు, పడవల్లో) ప్రయాణిస్తూ చాలా మంది సముద్ర జలాల్లో మునిగి చనిపోతున్నారు.

pakistan security forces kill attackers after raid on luxury hotel



పాకిస్థాన్ స్టార్ హోటల్ లో ఉగ్రవాదుల ఏరివేత పూర్తి
పాకిస్థాన్ నావికాదళ భద్రతా బలగాలు పెర్ల్ కాంటినెంట్ లో ఉగ్రవాదుల ఏరివేత పూర్తయిందని ఆదివారం (మే12) ప్రకటించాయి. శనివారం ఉదయం 5 సమయంలో హోటల్ లో దాగి ఉన్న ముగ్గురు ఉగ్రవాదుల్ని కాల్చి వేసిన సంగతి తెలిసిందే. సముద్ర తీర నగరం గ్వదర్ లో భద్రతా బలగాలు తనఖీలు నిర్వహిస్తూ ఉగ్రవాదుల ఉనికిని కనుగొన్నాయి. ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో ఉన్నట్లు తెలిసింది. అంతకుముందు వారు ముగ్గురు హోటల్ సిబ్బందిని కాల్చి చంపారు. హోటల్ లో ప్రవేశిస్తున్న ఉగ్రవాదుల్ని గార్డు అడ్డుకోగా అతణ్ని కాల్చేశారు. సమాచారం అందుకున్న పాక్ నావికాదళానికి చెందిన భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టగా హోటల్ మెట్ల దారిలో నక్కిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దాంతో ఎదురు కాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. ఈ దాడి తమ పనేనని `మజీద్ బ్రిగేడ్ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్` ట్విటర్ లో పేర్కొంది. ఇదే గ్రూపు గత ఏడాది కరాచిలోని చైనా రాయబార కార్యాలయంపై దాడి చేసింది. బలూచ్ జిల్లాలోని చాగై లోనూ చైనా ఇంజినీర్లపై దాడి చేశారు. పాక్ లో అత్యంత పేదరికం ఉన్న ప్రావిన్స్ అయిన గ్వదర్ లో సహజవనరులు అపారంగా ఉన్నాయి. సహజవాయువుతో పాటు, అపారమైన ఖనిజ సంపద అక్కడ ఉంది. అరేబియా సముద్రంలో గ్వదర్ వ్యూహాత్మక ఓడరేవు ప్రాంతం. చైనా పాకిస్థాన్ దేశాల ఎకనామిక్ కారిడర్ అభివృద్ధి ప్రాజెక్ట్  లో భాగంగా రూ.41వేల9వందల కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. చైనా ఈ కారిడార్ లో రహదారి నిర్మాణానికి రూ.34 వేల కోట్ల పెట్టుబడి పెట్టింది. అయితే ఏడాది కాలంగా ఇక్కడ ఉగ్రదాడులు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో గ్వదర్ నుంచి కరాచికి వెళ్లున్న బస్సులపై ఉగ్రవాదులు దాడులు చేసి 14 మందిని పొట్టనబెట్టుకున్నారు. పెర్ల్ కాంటినెంటల్ లో ఎక్కువగా విదేశీ పర్యాటకులు బస చేస్తుంటారు. అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన చైనా సిబ్బంది ఎక్కువగా ఇదే హోటల్ లో ఉంటుంటారు. అయితే తాజా ఎదురుకాల్పుల సమయంలో వీరెవరు ఆ హోటల్ లో లేనట్లు సమాచారం.