ముంబయిదే మళ్లీ ఐపీఎల్ కిరీటం
·
చెన్నై నుంచి గెలుపును లాగేసిన మలింగ
·
షేన్ వాట్సన్(80) పోరాటం వృథా
·
సీజన్ 12లో ఆఖరి బంతి వరకు సాగిన 20వ మ్యాచ్
అత్యంత
ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ సీజన్ 12 ఫైనల్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ గెలిచింది.
ఐపీఎల్ చరిత్రలో ముంబయికిది నాల్గో ట్రోఫీ. ప్రతి రెండేళ్లకు ఓ ఐపీఎల్ టైటిల్ ను
ముంబయి సొంతం చేసుకుంది. 2013, 2015, 2017, 2019ల్లో ఐపీఎల్ విజేతగా నిలిచింది. 52
రోజుల పాటు కొనసాగిన ఐపీఎల్ 2019 పండుగ అభిమానుల్ని విపరీతంగా అలరించింది. ఈ సీజన్
లో ఏకంగా 20 మ్యాచ్ లు ఆఖరి బంతికి కొనసాగాయంటేనే టోర్నీ ఎంత ఉత్కంఠంగా సాగిందో
అర్థం చేసుకోవచ్చు.
టాస్ గెలిచిన
ముంబయి ఇండియన్స్ (ఎం.ఐ) కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే
రోహిత్ నిర్ణయం తప్పని నిరూపించినట్లుగా చెన్నై సూపర్ కింగ్స్ (సి.ఎస్.కె)
కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఫీల్డింగ్ లోనూ రాణించి ముంబయిని భారీగా పరుగులు
చేయకుండా నిలువరించింది. ముంబయిని 149/ 8 పరుగులకే పరిమితం చేసింది. లక్ష్యం పరిమితంగా ఉండడంతో
సీనియర్ ఆటగాళ్ల సమతూకంతో పటిష్టంగా ఉన్నచెన్నై గెలుపు సునాయాసమే అనిపించింది.
దానికి తోడు ఫీల్డింగ్ లోటుపాట్లు ముంబయిని ఓటమి దిశగా నడిపించాయి. ముఖ్యంగా
చెన్నై ఓపెనర్లు డూప్లెసిస్(26), షేన్ వాట్సన్(80) లు తొలి ఆరు ఓవర్లు చెలరేగిపోయారు.
అయితే తర్వాత వచ్చిన ఏ చెన్నై బ్యాటర్ పెద్దగా షేన్ వాట్సన్ కు అండగా నిలవలేదు. బ్రావో(15)
మాత్రమే ఫర్వాలేదనిపించాడు. ధోని(2) రనౌట్ కావడం చివరి ఓవర్ నాలుగో బంతికి వాట్సన్
కూడా రనౌట్ గా వెనుదిరగడంతో ఆ జట్టు విజయావకాశాలు సన్నగిల్లాయి. బౌలింగ్ లో
మెరిసిన శార్దుల్ ఠాకుర్ చివరి ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చి అయిదో బంతికి రెండు
పరుగులు రాబట్టినా చివరి బంతికి కావాల్సిన రెండు పరుగుల్ని చేయలేక వెనుదిరిగాడు.
అంతవరకు బౌలింగ్ లో ధారాళంగా పరుగులిచ్చిన జీరో మలింగ చివరి ఓవర్ లో హీరో అయ్యాడు.
9 పరుగులు చేయాల్సిన చెన్నై జట్టుకు 7 పరుగులే ఇచ్చి వికెట్ పడగొట్టి ముంబయిని
గెలిపించాడు. చివరి బంతికి ఠాకుర్ ను ఎల్.బి.డబ్లు.గా పెవిలియన్ చేర్చాడు. చెన్నై
7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు మాత్రమే చేయగల్గింది. నాలుగు ఓవర్లలో 14
పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టిన జస్ప్రిత్ బుమ్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా
నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి తొలి ఓవర్లలో దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు
క్వింటన్ డికాక్(29), రోహిత్ శర్మ(15) వెంటవెంటనే వెనుదిరిగారు. సూర్యకుమార్(15),
ఇషాన్ కిషన్(23), పోలార్డ్(41), హార్ధిక్ పాండ్య(16) చెప్పుకోదగ్గ పరుగులు చేయడంతో
స్కోరు 149 వరకు వచ్చింది. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్ 3, శార్దూల్ ఠాకుర్,
ఇమ్రాన్ తాహిర్ చెరో రెండు వికెట్లు తీశారు.
No comments:
Post a Comment