Saturday, April 20, 2019

anna hazare says sweeping electoral reforms needed to end malpractices

సమూలంగా ఎన్నికల సంస్కరణలు అవసరం: హజారే
దేశంలో ఎన్నికల అక్రమాలు అరికట్టడానికి సమూలంగా సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని ప్రముఖ సామాజిక సేవ, ఉద్యమకర్త అన్నా హజారే అభ్రిపాయపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఓటర్లు డబ్బు తీసుకుని ఓటు వేయడమేంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటర్లు మూల స్తంభాలన్నారు. ప్రస్తుత రాజకీయాల వల్ల అటు పార్లమెంట్, అసెంబ్లీల పవిత్రత అడుగంటిపోతోందని హజారే ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పార్టీలు, గుర్తులతో పోటీ ఎందుకన్నారు. భారత సంవిధానంలో ఎక్కడా పార్టీలు, గుర్తుల ప్రస్తావన లేదని కేవలం వ్యక్తి(నాయకుడు) అని మాత్రమే రాజ్యాంగ నిర్మాతలు రాశారని హజారే గుర్తు చేశారు. 25 ఏళ్లు నిండిన భారతీయ పౌరులెవరైనా పోటీ చేయొచ్చన్నారు. ప్రజల్ని ఏదోవిధంగా మభ్యపెట్టి డబ్బు ఎరవేసి లోబర్చుకుని రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలు, గుర్తుల విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీఐ) పలుమార్లు మనవి చేసినా స్పందన లేదని చెప్పారు. ప్రధాని మోదీకి అనేక అంశాలపై 32 లేఖలు రాసినా పట్టించుకోకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. లోక్ పాల్ దృష్టికి కూడా ఎన్నికల అవకతవకల విషయాన్ని తీసుకెళ్లానన్నారు. కచ్చితంగా ఈ అక్రమ దందాకు ఏదో ఒక రోజు చరమగీతం పాడగలమని హజారే ఆశాభావం వ్యక్తం చేశారు. మూడో దశ పోలింగ్ లో భాగంగా ఈనెల 23న అహ్మద్ నగర్(మహారాష్ట్ర) లో ఓటు హక్కు వినియోగించుకుంటానని 81 ఏళ్ల హజారే తెలిపారు. సరైన అభ్యర్థికే ఓటు వేస్తానని లేదంటే నోటా (none of the above)  బటన్ నొక్కుతానని చెప్పారు.

judiciary is under threat says chief justice after reports of harassment allegations against him


న్యాయ వ్యవస్థ ప్రమాదంలో ఉంది: సీజేఐ గొగొయ్
దేశంలో న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం ప్రమాదంలో పడిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగొయ్ ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగిని తనపై చేసిన లైంగిక వేధింపు ఆరోపణల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ మహిళ అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలపై సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది.  సీజేఐ గొగొయ్, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ విషయంలో ఏ విధమైన ఆర్డర్ ఇవ్వకుండా విడిచిపుచ్చింది. ‘ఇది నమ్మలేకపోతున్నా..ఇంత చౌకబారు ఆరోపణలు ఎదుర్కొంటానని నేనెన్నడూ ఊహించలేదు’ అని గొగొయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘20 ఏళ్ల పాటు న్యాయమూర్తిగా అవిశ్రాంతంగా పని చేశాను.. నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ రూ.6.80 లక్షలు మాత్రమే.. ఏరోజూ అవినీతికి పాల్పడ లేదు..ఇదేనా భారత ప్రధానన్యాయమూర్తిగా నాకు ఇచ్చే రివార్డు’ అని ప్రశ్నించారు. ఈ నీచమైన ఆరోపణలు చేసిన మహిళపై పోలీస్ స్టేషన్లో రెండు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు సీజేఐ తెలిపారు. ప్రస్తుత పోకడలు న్యాయ వ్యవస్థను  బలి పశువును చేసేలా తయారయ్యాయని కానీ అలా ఎన్నటికీ జరగదని గొగొయ్ పేర్కొన్నారు. సీజేఐపై మాజీ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు ఏదో ఆశించి చేస్తున్న బెదిరింపు (బ్లాక్ మెయిల్)గా కనిపిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యానించారు.


Friday, April 19, 2019

storming knock by russells again even though rcb won the match


రస్సెల్ తుపాను.. ఒడ్డునపడ్డ బెంగళూరు
·    కెప్టెన్ కోహ్లీ సెంచరీ, మొయిన్ అర్ధ సెంచరీలతో కోల్ కతాపై గెలుపు
ఐపీఎల్ సీజన్-12 రియల్ హీరో తనేనని ఆండ్రూ రస్సెల్ మరోసారి నిరూపించుకున్నాడు. కోలకతా నైట్ రైడర్స్ (కె.కె.ఆర్.)కు ఘోరమైన ఓటమి తప్పదనుకున్న దశలో ఫీల్డ్ లోకి వచ్చిన రస్సెల్ మళ్లీ విధ్వంసమే సృష్టించాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. 25 బంతుల్లో 9 సిక్సర్లు, 2 బౌండరీలతో 65 పరుగులతో దాదాపు జట్టును గెలిపించనంత పని చేశాడు. బాధ్యతగా ఆడిన నితీష్ రాణా 46 బంతుల్లో 5 సిక్సర్లు, 9 ఫోర్లతో 85 అతి విలువైన పరుగులు చేశాడు. కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ సెకండ్ డౌన్ లో రాబిన్ బదులు రస్సెల్ ను పంపి ఉంటే కచ్చితంగా కోలకతా గెలిచేది. రస్సెల్, రాణాలు పరుగుల వరద పారించినా అప్పటికే ఆలస్యం అయిపోయింది. కోలకతా అయిదు వికెట్ల నష్టానికి 203 పరుగులే చేయగల్గింది. కేవలం 10 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ సీబీ 213/ 4 పరుగులు చేసింది. కోహ్లీ 58 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఐపీఎల్ లో కోహ్లీకిది అయిదో సెంచరీ. మొయిన్ అలీ కూడా అద్భుతంగా ఆడి 28 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. కేకేఆర్ టీంలో స్టార్ స్పిన్నర్ కులదీప్ ఓవర్ లో అలీ ఏకంగా 27 పరుగులు రాబట్టాడు. 214 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ ప్రారంభించిన కేకేఆర్ పరుగుల వేటలో త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. రస్సెల్ వచ్చే వరకు ఆ జట్టు స్కోర్ బోర్డులో ఒక్క సిక్సర్ కూడా లేదు. రస్సెల్ క్రీజ్ లోకి వచ్చిన దగ్గర నుంచి సిక్సర్ల మోతే. అతని స్ఫూర్తితో రాణా కూడా నేనూ కొట్టగలను అన్నట్లుగా వరుస సిక్సర్ల తో విరుచుకుపడ్డాడు. అయితే రస్సెల్ బ్యాటింగ్ దూకుడుకు 60 వేల మంది ఈడెన్ గార్డెన్స్ ప్రేక్షకులు ఉర్రూతలూగిపోయారు. ప్రేక్షకుల గ్యాలరీ లో కూడా రస్సెల్ కోసం మరో 10 మంది ఫీల్డర్లను మోహరించిలన్నంతగా అతని బ్యాటింగ్ సాగింది.

will priyanka go to contest in varanasi constituency against prime minister modi


ప్రియాంక వారణాసిలో ప్రధాని మోదీతో పోటీపడతారా?
2019 సార్వత్రిక ఎన్నికల వేడిలో అందర్నీ ఉత్కంఠకు గురి చేస్తున్న అంశం వారణాసి ఎన్నిక. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేస్తున్నారా లేదా అనే అంశమే రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. ప్రధాని మోదీ తొలిసారిగా లోక్ సభకు ఇక్కడ నుంచే బరిలో నిలిచి విజయం సాధించారు. నయా ఇందిరమ్మగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రియాంక వారణాసి నుంచి బరిలోకి దిగితే మాత్రం పోటీ మరింత రసవత్తరంగా మారడం ఖాయం. దిగ్గజం పై మరో దిగ్గజం పోటీ చేస్తున్న నియోజకవర్గం పైనే మొత్తం దేశం కళ్లు కేంద్రీకృతమౌతాయి. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని ప్రియాంక అంటుండగా అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్కంఠకు తెరదించడం లేదు. పైగా సస్పెన్స్ కొనసాగించడం తప్పేమీ కాదంటూ చలోక్తులు విసురుతున్నారు.
నెహ్రూ-గాంధీ వంశాంకురమైన ప్రియాంక ఇటీవలే పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు వరకు ఆమెది కేవలం ప్రచారకర్త పాత్రే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ (యూపీ) కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గాను వ్యవహరిస్తూ ఆమె పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. స్వయంగా ఆమె బరిలోకి దిగితే పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. మరోవైపు ప్రధాని మోదీ దేశంలో తిరుగులేని నాయకుడు. ఇందిరాగాంధీ తర్వాత అంతటి సమర్ధుడిగా పేరు. ముమ్ముర్తులా ఇందిరనే పోలిన ప్రియాంక పోటీకి దిగితే వీరిద్దరి ముఖాముఖి 2019 ఎన్నికల చిత్రానికి కొత్త రూపును తెస్తుంది. మోదీ, ప్రియాంకలు ఉభయులకూ అవినీతి అంశమే ప్రధాన ప్రచారాస్త్రం. తాజా ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే ఈ అంశంపై రెండుపార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.
రాఫెల్ ఒప్పందం గురించి ప్రియాంక ప్రస్తావిస్తే అక్కడ ఎన్నికల ప్రచారం మరింత సెగలు రేపుతుంది. రాబర్ట్ వాద్రా (డీఎల్ ఎఫ్ కేసు) భుజాల మీదుగా తుపాకీ ఎక్కుపెట్టి మరీ మోదీ ఆమెపై ఎదురుదాడికి దిగుతారు. ప్రచార సభల్లో, ఓటర్లను కలిసి మాట్లాడిన సందర్భాల్లో ఇందిరాగాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు వారి శైలే వేరు. వేదికలపై ప్రసంగించినప్పడు, జనంతో మమేకమైనప్పుడూ హుందాతనమే కనిపిస్తుంది. మాట, చేతల్లో సామాన్యుల్లో కలగలిసి పోతుంటారు. ప్రస్తుతం ప్రియాంక ప్రచార పర్వం అదే రీతిలో సాగుతోంది. ఇటీవల అలహాబాద్ నుంచి వారణాసికి గంగా(బోటు)యాత్రలో పర్యటించిన ప్రియాంక తన నాయనమ్మతో ఆనంద్ భవన్ (అలహాబాద్)లో గడిపిన మధుర స్మృతుల్ని గుర్తు చేసుకుని ఓటర్లలో సెంటిమెంట్ రగిలించారు. ముఖ్యంగా మోదీకి ప్రత్యామ్నాయం తామేనని తెల్పడమే ప్రధాన ఉద్దేశంగా ప్రియాంక పోటీ చేస్తున్నట్లు స్పష్టమౌతోంది.
 1952 నుంచి ఇంతవరకు ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్ అత్యధికంగా ఏడుసార్లు విజయం సాధించగా, భారతీయ జనతా పార్టీ ఆరుసార్లు, సీపీఎం, భారతీయ లోక్ దళ్, జనతాదళ్ ఒక్కోసారి  గెలిచాయి.  2014 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్(2,09,238 ఓట్లు)పై మోదీ(5,81,022 ఓట్లు) ఘన విజయం సాధించారు. ఆనాడు మోదీపై పోటీ చేయాలనే ఏకైక లక్ష్యంతో కేజ్రీవాల్ వారణాసి బరిలో నిలిచారు. ఈ సారి ఇక్కడ మే19న ఎన్నిక జరగనుంది.
దిగ్గజాలపై దిగ్గజాలు పోటీ పడిన సందర్భాలు గతంలోను తాజాగానూ కొనసాగుతున్నాయి. 1984లో గ్వాలియర్ నుంచి వాజ్ పేయి పై పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుడు మాధవరావు సింధియా విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో బళ్లారి నుంచి సుష్మాస్వరాజ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై పోటీ పడి ఓడిపోయారు. ప్రస్తుతం అమేథి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె రాహుల్ గాంధీ చేతిలో పరాజయం పాలయ్యారు.