Saturday, September 26, 2020

Deepika Padukone reaches NCB office to record statement in drugs case

ఎన్సీబీ ఎదుటకు తారాగణం

నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారుల ఎదుటకు బాలీవుడ్ తారాగణం ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు. శనివారం ఉదయం ముంబయిలోని ఎన్సీబీ కార్యాలయం తారామణుల రాకతో సందడి సంతరించుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి (ఆత్మహత్య) కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ డ్రగ్స్ కోణం వెలుగుచూసిన విషయం విదితమే. దాంతో ఎన్సీబీ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్‌ రియా చక్రబర్తితో పాటు పలువురికి డ్రగ్స్ కేసులో సంబంధాలు ఉన్నాయని తేలింది. దాంతో కేంద్ర నిఘా విభాగాల చొరవతో లోతైన విచారణకు తెరలేచింది. రియాను సుదీర్ఘంగా విచారించిన మీదట పెద్ద సంఖ్యలో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. దీపికాతో  పాటు ప్రముఖ నటీమణులు శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌లతో పాటు ఈ కేసులో సంబంధమున్న వాళ్లకు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. విచారణకు సెప్టెంబర్ 25, 26 (శుక్ర, శనివారాలు)తేదీల్లో హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. అందులో భాగంగా దీపికా ఈరోజు అధికారుల ఎదుటకు వచ్చారు. అదే విధంగా మరో నటి సారా అలీ ఖాన్ కూడా ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు.  శుక్రవారమే దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్, సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ లను ప్రశ్నించారు. మరో సినీనటి శ్రద్ధాకపూర్ కూడా శనివారం ఎన్సీబీ దర్యాప్తునకు హాజరు కానున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ డ్రగ్స్ కేసులో మరో 39 మంది ప్రముఖ నటుల పేర్లు బయటపడ్డట్లు తెలుస్తోంది.

Friday, September 25, 2020

Another Honour killing in Telengana Hyderabad Gachibowli Area

 

తెలంగాణలో మరో పరువు హత్య

      ·        నాడు ప్రణయ్.. నేడు హేమంత్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గురువారం చోటు చేసుకున్న పరువు హత్య కలకలం రేపుతోంది. స్థానిక చందానగర్‌లో నివసిస్తున్నయువజంట హేమంత్(28), అవంతిలపై రక్త సంబంధీకులే కక్ష గట్టి దారుణానికి ఒడిగట్టారు. తొలుత కిడ్నాప్ చేసి అనంతరం అర్ధరాత్రి దాటాక హేమంత్ ఉసురు తీశారు. కేవలం కులం, అబ్బాయికి ఆస్తి లేదనే కారణాలతోనే అమ్మాయి తరఫు బంధువులు ఈ కిరాతకానికి తెగబడ్డారు. ఇందుకు తన చిన్న మేనమామ యుగంధర్ ప్రధానకుట్రదారని అవంతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు మూడు నెలల క్రితమే వివాహం చేసుకుని వేరు కాపురం పెట్టారు. అప్పటి నుంచి హేమంత్ ను విడిచి రావాలని అవంతిపై ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో నిన్న చందానగర్ కు వచ్చిన దుండగులు అమ్మాయి తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్తున్నామని నమ్మబలికి ఈ జంటను కిడ్నాప్ చేశారు. అనుమానం వచ్చి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ ఆర్) సమీపంలో కారులో నుంచి జంట కిందకు దూకి తప్పించుకున్నారు.  అదే సమయంలో హేమంత్ తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేసి ఘటనా స్థలానికి చేరుకునే సరికి హేమంత్ ను మరోసారి అపహరించి దుండగులు అక్కడ నుంచి పరారయ్యారని అవంతి తెలిపింది. అనంతరం ఆమె తన భర్తను కిడ్నాప్ చేశారని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. పోలీసులు గాలింపు చేపట్టిన కొద్ది గంటల్లోనే హేమంత్ శవంగా కనిపించాడు. సుపారీ తీసుకున్న దుండగుల చేతిలో అతను ప్రాణాలు కోల్పోయాడు. సంగారెడ్డిలో హేమంత్ ను దారుణంగా హత్య చేసి కొండాపూర్ మండలం కిష్టాయగూడెం శివారులోని చెట్ల పొదల్లో శవాన్ని పడేశారు. గచ్చిబౌలిలో ఈ జంటను కిడ్నాప్ చేసిన దుండగులు సంగారెడ్డిలో హేమంత్‌ను హత్య చేశారు. గురువారం అర్ధరాత్రి కిష్టాయగూడెం లో  మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు ఘటన మరువకు ముందే మరో పరువుహత్యా ఘటన రాష్ట్రంలో వెలుగుచూసింది. కుమార్తె అమృత తనకు నచ్చని వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్నందుకే ఆమె తండ్రి సొంత అల్లుణ్ని చంపించిన సంగతి తెలిసిందే.

Wednesday, September 23, 2020

Hyderabad based pharma Bharat biotech inks licensing deal with washington university for intranasal vaccine

ముక్కు ద్వారా కరోనా టీకా

ప్రముఖ దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ వినూత్న కోవిడ్-19 టీకాను త్వరలో మార్కెట్ లోకి తీసుకురానుంది. ఆ దిశగా ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే.  ముక్కు ద్వారా చుక్కల మందు రూపంలో వేసే టీకాను భారత్‌ బయోటెక్‌ రూపొందించింది. `కోరోఫ్లూ` పేరిట ఈ టీకాను యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్‌ మాడిసన్‌, ఫ్లూజెన్‌ అనే వ్యాక్సిన్‌ కంపెనీలతో సంయుక్తంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ టీకా హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ వేగంగా జరుగుతున్నాయి. ముక్కు ద్వారా ఇచ్చే ఒక్క డోస్‌తోనే సమర్ధంగా వ్యాధినిరోధక శక్తి సాధించే అవకాశం కల్గనుంది. అంతేగాక చాలా వేగంగా విస్తృత స్థాయిలో జనాభాకు సులభంగా వ్యాక్సిన్ అందజేయొచ్చు. ఇది కరోనా నుంచి రక్షించడమే కాక ప్రధానంగా ముక్కు, గొంతు కణాల ద్వారా వ్యాధి వ్యాప్తిని నిరోధిస్తుంది. `ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న చాలా ఇతర టీకాలు అలా చేయలేవు` అని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుడు డేవిడ్ టీ క్యూరేయల్ తెలిపారు. సురక్షిత, సమర్థ, ప్రభావశీల వ్యాక్సిన్ తయారీ, పంపిణీలో  మా అనుభవం కచ్ఛితంగా ఉపకరిస్తుందని సంస్థ సీఈఓ కృష్ణ ఎల్లా  ఆశాభావం వ్యక్తం చేశారు. `కోవిడ్ -19కు అవసరమైన టీకాను అందించడానికి విభిన్నమైన మంచి ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడం భారత్ బయోటెక్ గౌరవంగా భావిస్తుంది` అని ఆయనన్నారు. 100 కోట్ల (ఒక్క బిలియన్) టీకా డోస్‌లను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు సీఈఓ వివరించారు. ముక్కు ద్వారా ఇచ్చే ఈ వ్యాక్సిన్ వల్ల సూది, సిరంజి వంటి పరికరాల వాడకాన్ని తగ్గించడంతో టీకా ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గనుందన్నారు.

Saturday, September 19, 2020

If you've got a runny nose you DON'T have Covid-19: Expert says

ముక్కు కారుతోందా..అయితే కరోనా లేనట్లే..!

కరోనా భయంతో అనవసర పరీక్షలు చేయిస్తున్న పిల్లల తల్లిదండ్రులకు బ్రిటన్ వైద్య నిపుణులు ఊరట కల్గించే సంగతి చెప్పారు. ముక్కు కారుతూ ఉంటే కరోనా లేనట్లేనని అభయం ఇచ్చారు. పిల్లలకు సాధారణంగా ముక్కు కారుతూ ఉంటుంది. సీజనల్ గా వచ్చే జలుబు సాధారణ లక్షణమది. ఆ లక్షణం కల్గి ఉన్న పిల్లలపై చేసిన పరీక్షల్లో కరోనా వైరస్ జాడ కనిపించలేదు. దాంతో ముక్కు కారుతూ ఉంటే కరోనా లేనట్లేనని వైద్య నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. కరోనా సోకిన వారి ముక్కు దిబ్బడ వేసినట్లు ఉంటుందన్నారు. బ్రిటన్ లో ఇప్పుడిప్పుడే పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నారు. అయితే పలువురు పిల్లలు జలుబుతో బాధపడుతున్నారు. వారిలో చాలామంది పిల్లలకు ముక్కు కారుతూండడంతో వారి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురై అనవసరంగా టెస్టుల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో  బ్రిటన్  ప్రభుత్వం తరఫున వైద్య రంగ నిపుణులు రంగంలోకి దిగి ఈ ఊరట నిచ్చే అంశాన్ని వెల్లడించారు. లండన్ లోని కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ ముక్కు కారుతుండడం సాధారణ జలుబుకు సంబంధించిన ఒక కచ్చితమైన సంకేతం అని తేల్చి చెప్పారు. ఇందుకు పలు శాంపిళ్లు, సర్వేలను పరిగణనలోకి తీసుకున్నారు. దేశంలో జలుబుతో బాధపడుతున్న పిల్లల కోసం వారి తల్లిదండ్రులు క్రీకింగ్ టెస్ట్ లకు పరిగెడుతుండడంతో గందరగోళం నెలకొంటోందని వైద్య నిపుణుడు మాట్ హాన్కాక్ పేర్కొన్నారు. కరోనా వైరస్ సింప్టమ్ స్టడీ యాప్‌ను నడుపుతున్న ప్రొఫెసర్ స్పెక్టర్ తన పరిశోధనలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో లక్షణాలు ఈ విధంగా ఉన్నాయని తెలిపారు. అలసట (55 శాతం), తలనొప్పి (55 శాతం), జ్వరం (49 శాతం) తదితర లక్షణాలు పిల్లల్లో కనిపించినట్లు వివరించారు. కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన పెద్దల్లో లక్షణాలు ఇలా ఉన్నాయి. అలసట (87 శాతం), తలనొప్పి (72 శాతం), వాసన కోల్పోవడం (60 శాతం) లక్షణాలు కల్గి ఉన్నట్లు సర్వే వివరాలు వెల్లడించారు. పిల్లలు లేదా పెద్దల్లో జలుబు చేసినప్పుడు ముక్కు కారడం తరచుగా గమనించే విషయమేనని అందుకు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.