ముక్కు ద్వారా కరోనా టీకా
ప్రముఖ దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ వినూత్న కోవిడ్-19 టీకాను త్వరలో మార్కెట్ లోకి తీసుకురానుంది. ఆ దిశగా ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. ముక్కు ద్వారా చుక్కల మందు రూపంలో వేసే టీకాను భారత్ బయోటెక్ రూపొందించింది. `కోరోఫ్లూ` పేరిట ఈ టీకాను యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్, ఫ్లూజెన్ అనే వ్యాక్సిన్ కంపెనీలతో సంయుక్తంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ టీకా హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ వేగంగా జరుగుతున్నాయి. ముక్కు ద్వారా ఇచ్చే ఒక్క డోస్‌తోనే సమర్ధంగా వ్యాధినిరోధక శక్తి సాధించే అవకాశం కల్గనుంది. అంతేగాక చాలా వేగంగా విస్తృత స్థాయిలో జనాభాకు సులభంగా వ్యాక్సిన్ అందజేయొచ్చు. ఇది కరోనా నుంచి రక్షించడమే కాక ప్రధానంగా ముక్కు, గొంతు కణాల ద్వారా వ్యాధి వ్యాప్తిని నిరోధిస్తుంది. `ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న చాలా ఇతర టీకాలు అలా చేయలేవు` అని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుడు డేవిడ్ టీ క్యూరేయల్ తెలిపారు. సురక్షిత, సమర్థ, ప్రభావశీల వ్యాక్సిన్ తయారీ, పంపిణీలో మా అనుభవం కచ్ఛితంగా ఉపకరిస్తుందని సంస్థ సీఈఓ కృష్ణ ఎల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. `కోవిడ్ -19కు అవసరమైన టీకాను అందించడానికి విభిన్నమైన మంచి ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడం భారత్ బయోటెక్ గౌరవంగా భావిస్తుంది` అని ఆయనన్నారు. 100 కోట్ల (ఒక్క బిలియన్) టీకా డోస్‌లను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు సీఈఓ వివరించారు. ముక్కు ద్వారా ఇచ్చే ఈ వ్యాక్సిన్ వల్ల సూది, సిరంజి వంటి పరికరాల వాడకాన్ని తగ్గించడంతో టీకా ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గనుందన్నారు.
No comments:
Post a Comment