ఎన్సీబీ ఎదుటకు తారాగణం
నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారుల ఎదుటకు బాలీవుడ్ తారాగణం ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు. శనివారం ఉదయం ముంబయిలోని ఎన్సీబీ కార్యాలయం తారామణుల రాకతో సందడి సంతరించుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి (ఆత్మహత్య) కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ డ్రగ్స్ కోణం వెలుగుచూసిన విషయం విదితమే. దాంతో ఎన్సీబీ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తితో పాటు పలువురికి డ్రగ్స్ కేసులో సంబంధాలు ఉన్నాయని తేలింది. దాంతో కేంద్ర నిఘా విభాగాల చొరవతో లోతైన విచారణకు తెరలేచింది. రియాను సుదీర్ఘంగా విచారించిన మీదట పెద్ద సంఖ్యలో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. దీపికాతో పాటు ప్రముఖ నటీమణులు శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌లతో పాటు ఈ కేసులో సంబంధమున్న వాళ్లకు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. విచారణకు సెప్టెంబర్ 25, 26 (శుక్ర, శనివారాలు)తేదీల్లో హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. అందులో భాగంగా దీపికా ఈరోజు అధికారుల ఎదుటకు వచ్చారు. అదే విధంగా మరో నటి సారా అలీ ఖాన్ కూడా ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. శుక్రవారమే దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్, సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ లను ప్రశ్నించారు. మరో సినీనటి శ్రద్ధాకపూర్ కూడా శనివారం ఎన్సీబీ దర్యాప్తునకు హాజరు కానున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ డ్రగ్స్ కేసులో మరో 39 మంది ప్రముఖ నటుల పేర్లు బయటపడ్డట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment