తెలంగాణలో మరో పరువు హత్య
· నాడు ప్రణయ్.. నేడు హేమంత్
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గురువారం చోటు చేసుకున్న పరువు హత్య కలకలం రేపుతోంది. స్థానిక చందానగర్‌లో నివసిస్తున్నయువజంట హేమంత్(28), అవంతిలపై రక్త సంబంధీకులే కక్ష గట్టి దారుణానికి ఒడిగట్టారు. తొలుత కిడ్నాప్ చేసి అనంతరం అర్ధరాత్రి దాటాక హేమంత్ ఉసురు తీశారు. కేవలం కులం, అబ్బాయికి ఆస్తి లేదనే కారణాలతోనే అమ్మాయి తరఫు బంధువులు ఈ కిరాతకానికి తెగబడ్డారు. ఇందుకు తన చిన్న మేనమామ యుగంధర్ ప్రధానకుట్రదారని అవంతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు మూడు నెలల క్రితమే వివాహం చేసుకుని వేరు కాపురం పెట్టారు. అప్పటి నుంచి హేమంత్ ను విడిచి రావాలని అవంతిపై ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో నిన్న చందానగర్ కు వచ్చిన దుండగులు అమ్మాయి తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్తున్నామని నమ్మబలికి ఈ జంటను కిడ్నాప్ చేశారు. అనుమానం వచ్చి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ ఆర్) సమీపంలో కారులో నుంచి జంట కిందకు దూకి తప్పించుకున్నారు. అదే సమయంలో హేమంత్ తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేసి ఘటనా స్థలానికి చేరుకునే సరికి హేమంత్ ను మరోసారి అపహరించి దుండగులు అక్కడ నుంచి పరారయ్యారని అవంతి తెలిపింది. అనంతరం ఆమె తన భర్తను కిడ్నాప్ చేశారని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. పోలీసులు గాలింపు చేపట్టిన కొద్ది గంటల్లోనే హేమంత్ శవంగా కనిపించాడు. సుపారీ తీసుకున్న దుండగుల చేతిలో అతను ప్రాణాలు కోల్పోయాడు. సంగారెడ్డిలో హేమంత్ ను దారుణంగా హత్య చేసి కొండాపూర్ మండలం కిష్టాయగూడెం శివారులోని చెట్ల పొదల్లో శవాన్ని పడేశారు. గచ్చిబౌలిలో ఈ జంటను కిడ్నాప్ చేసిన దుండగులు సంగారెడ్డిలో హేమంత్‌ను హత్య చేశారు. గురువారం అర్ధరాత్రి కిష్టాయగూడెం లో మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు ఘటన మరువకు ముందే మరో పరువుహత్యా ఘటన రాష్ట్రంలో వెలుగుచూసింది. కుమార్తె అమృత తనకు నచ్చని వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్నందుకే ఆమె తండ్రి సొంత అల్లుణ్ని చంపించిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment