Thursday, February 6, 2020

Singer KJ Yesudas' brother Justin found mysterious dead in Kochi

గాయకుడు జేసుదాస్ సోదరుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ప్రముఖ గాయకుడు, సంగీతకారుడు జేసుదాస్ తమ్ముడు 62 ఏళ్ల కేజే జస్టిన్ కేరళలోని కొచ్చిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జస్టిన్ మృతదేహాన్ని వల్లర్పాదంలోని డీపీ వరల్డ్స్ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ వద్ద కనుగొన్నారు. మంగళవారం రాత్రి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. జస్టిన్ తన కుటుంబంతో కలిసి కక్కనాడ్ లోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆయన అదృశ్యమయినట్లు బంధువు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం వల్లర్పాదం నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ముల్వుకాడ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. అయితే పోలీసులు అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు. జస్టిన్ మృతదేహాన్ని బంధువులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నారు. మూడేళ్ల క్రితం తన పెద్ద కొడుకు మరణించినప్పటి నుంచి ఆయన తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. గత కొంతకాలంగా మానసిక సమస్యలతోనూ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. జస్టిన్ మరణానికి గల కారణాలను పరిశోధిస్తున్నారు.

Wednesday, February 5, 2020

I heard in my Padha Yathra..now Iam doing my best to BPL people:YS Jagan

పాదయాత్రలో విన్నా.. సీఎంగా తీరుస్తున్నా:జగన్
`సుదీర్ఘ పాదయాత్రలో జనం గోడు విన్నాను.. వాటన్నింటిని సీఎం అయ్యాక ఒక్కొక్కటిగా తీరుస్తున్నా`.. అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని గేట్‌ వే హోటల్లో బుధవారం ఏర్పాటైన ది హిందూ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అన్ని సమస్యలకు విద్యతో చెక్ పెట్టొచ్చన్నారు. భవిష్యత్ లో అన్ని వర్గాల వారితో సమానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద విద్యార్థులు కూడా నిలవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే పోటీ పరీక్షల్లో వారూ నెగ్గి ఉపాధి పొందాలన్నదే తన ఆశయమని సీఎం చెప్పారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేశామన్నారు. దేశంలో ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేసిన మొదటి రాష్ట్రం ఏపీయేనని తెలిపారు. ఈ సందర్భంగా `ది హిందూ` గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ రామ్‌ అడిగిన ప్రశ్నలకు వేదికపై నుంచే జగన్ సమాధానాలిచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణానికి తొలివిడతలో ఇంకా రూ.1 లక్షా 9వేల కోట్లు అవసరం.. ఆ సొమ్ము ఎక్కడ నుంచి వస్తుంది.. వాస్తవాల్ని పరిగణనలోకి తీసుకుని.. పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో పెట్టాలని నిర్ణయించామన్నారు. అమరావతి నిర్మాణానికి పెట్టే వ్యయంలో కేవలం 10 శాతంతో అద్భుత రాజధాని నగరంగా వైజాగ్ ను తీర్చిదిద్దవచ్చన్నారు. రాబోయే 10ఏళ్లలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలను తలదన్నెలా విశాఖ రూపుదిద్దుకోగలదని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే విశాఖ.. హైదరాబాద్ కు సరితూగే సిటీగా అభివర్ణించారు. స్వతహాగా ఎదుగుతున్న వైజాగ్ కు కాస్త ఊతమందిస్తే విశ్వనగరంగా ప్రగతి సాధిస్తుందని జగన్ వివరించారు. ఈ సందర్భంగా విద్య విషయంలో ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాల్ని రామ్ అభినందించారు. ఆంగ్ల మాధ్యమంతోపాటు నాణ్యమైన విద్యను అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచాలని సీఎంకు సూచించారు.

Monday, February 3, 2020

Konaseema Villagers in grip of fear as gas leakage from Rig at Uppudi

గ్యాస్ లీకేజీతో ఉప్పూడిలో జనం గడగడ
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పూడి గ్రామం గ్యాస్ లీకేజీ కారణంగా వణికిపోతోంది. కాట్రేనికోన మండలం లో గల ఈ గ్రామంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఒ.ఎన్.జి.సి. గ్యాస్ పైప్ లైన్ కు మరమ్మతులు నిర్వహిస్తుండగా లీకేజీ సంభవించింది. 10 ఏళ్ల క్రితం ఒ.ఎన్.జి.సి. సంస్థ ఇక్కడ రిగ్ తవ్వింది. అయితే గ్యాస్ నిల్వలు తగ్గిపోవడంతో 2016లో దీన్ని మూసివేశారు. సంస్థ ఇలా ఈ ప్రాంతంలో మూసివేసిన పలు రిగ్గుల నిర్వహణ బాధ్యతల్ని పి.ఎఫ్.హెచ్ అనే ప్రయివేటు సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ ఉప్పూడి రిగ్ వద్ద నిపుణులు లేకుండా నిర్వహణ పనులు చేపట్టడంతో అకస్మాతుగా గ్యాస్ ఎగజిమ్ముతోంది. భారీ శబ్దాలతో గ్యాస్ వెలువడుతుండడంతో ఘటనా స్థలంలో ముగ్గురు గాయాలపాలయ్యారు. వీరికి సమీప ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మిగిలిన సిబ్బంది గ్రామస్థుల్ని హెచ్చరించడంతో వారంతా అక్కడ నుంచి తరలిపోయారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతం మొత్తం విద్యుత్‌ సరఫరా తో పాటు సెల్ టవర్ సిగ్నల్స్ నిలిపివేశారు. గ్యాస్‌ లీకేజీని అదుపు చేసేందుకు నరసాపురం, రాజమండ్రి, తాటిపాక, విశాఖపట్నం నుంచి ప్రత్యేక నిపుణుల బృందాలను అధికారులు రప్పిస్తున్నారు. లీకేజీ కారణంగా ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు, రెవెన్యూ సిబ్బందితోపాటు ఒ.ఎన్.జి.సి. అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఉప్పూడితోపాటు పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు. అగ్నిమాపక శకటాల్ని రప్పించి తీవ్ర ఒత్తిడితో లీక్‌ అవుతున్న గ్యాస్‌ను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఈ బావి వద్ద మరమ్మత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చమురు, సహజ వాయువుల వెలికితీతలో చోటు చేసుకుంటున్న గ్యాస్‌ లీకేజీలు, విస్ఫోటనాలు కోనసీమ వాసుల్లో దడ పుట్టిస్తున్నాయి. ఏ క్షణానికి ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయంతో వణికిపోతున్నారు. గ్యాస్ లీకయిన ప్రాంతాన్ని మంత్రులు విశ్వరూప్, పిల్లి సుభాష్ చంద్రబోస్ సోమవారం పరిశీలించారు. విశ్వరూప్ మీడియాతో మాట్లాడుతూ నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. ఒ.ఎన్.జి.సి. అధికారులు ప్రమాద నివారణకు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. లీకవుతున్న ఈ గ్యాస్‌ ఫైర్‌ అయ్యే అవకాశం లేదని జనం భయపడొద్దని  ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ధైర్యం చెప్పారు.

Saturday, February 1, 2020

Nirmala Sitaraman follows the same sentiment in 2020 Budget

సెంటిమెంటును కొనసాగించిన ఆర్థికమంత్రి సీతారామన్
బడ్జెట్-2020 ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతేడాది సెంటిమెంట్ ను కొనసాగించారు. 2020-21 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి శనివారం ఆమె పార్లమెంట్ కు చేరుకునే ముందు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. అనంతరం సీతారామన్ లోక్ సభ కు విచ్చేశారు. క్రితంసారి మాదిరిగానే ఆమె ఎర్రటి వస్త్రాల్లో చుట్టిన బడ్జెట్ ప్రతుల్ని తీసుకుని వచ్చారు. గతేడాది ఆమె ఎర్ర చీరను ధరించగా ఈసారి పసుపు రంగు చీరలో దర్శనమిచ్చారు. బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆమె కశ్మీరీ కవి దీనానాథ్ కౌల్ రాసిన కవితను చదవి వినిపించారు. నా దేశం దాల్ సరస్సులో విరబూసిన కమలం లాంటిది. నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం.. మానవత్వం.. దయతో కూడిన సమాజం అవసరం. నా దేశం వికసిస్తున్న షాలిమార్ తోటలాంటిదిఅంటూ ఆ కవితకు అర్థాన్ని ఆర్థికమంత్రి వివరించారు. తమ బడ్జెట్ దేశ ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరమని చెప్పడానికే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది బడ్జెట్ సందర్భంగా ఆమె తమిళంలో చెప్పిన కథ ను మరోసారి గుర్తు చేశారు. ఈరోజు కేంద్ర బడ్జెట్ కు సంబంధించిన ప్రతుల బండిళ్లను ప్రత్యేక వాహనంలో పార్లమెంట్ కు తరలించారు. పార్లమెంట్ ఆవరణలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్ఎస్‌జీ టీం బడ్జెట్ ప్రతుల భద్రతను పర్యవేక్షించారు.