పాదయాత్రలో విన్నా.. సీఎంగా తీరుస్తున్నా:జగన్
`సుదీర్ఘ పాదయాత్రలో జనం గోడు విన్నాను.. వాటన్నింటిని సీఎం అయ్యాక ఒక్కొక్కటిగా తీరుస్తున్నా`.. అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని గేట్ వే హోటల్లో బుధవారం ఏర్పాటైన
‘ది హిందూ ఎక్సలెన్స్ ఇన్
ఎడ్యుకేషన్’ కార్యక్రమంలో ఆయన
ప్రసంగించారు. అన్ని సమస్యలకు విద్యతో చెక్ పెట్టొచ్చన్నారు. భవిష్యత్ లో అన్ని వర్గాల వారితో సమానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద విద్యార్థులు
కూడా నిలవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే
పోటీ పరీక్షల్లో వారూ నెగ్గి ఉపాధి పొందాలన్నదే తన ఆశయమని సీఎం చెప్పారు. అందుకే ప్రభుత్వ
పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేశామన్నారు. దేశంలో ఇంగ్లిష్ మీడియం
తప్పనిసరి చేసిన మొదటి రాష్ట్రం ఏపీయేనని తెలిపారు. ఈ సందర్భంగా `ది హిందూ` గ్రూప్
చైర్మన్ ఎన్ రామ్ అడిగిన ప్రశ్నలకు వేదికపై నుంచే జగన్ సమాధానాలిచ్చారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి తొలివిడతలో ఇంకా రూ.1 లక్షా 9వేల కోట్లు అవసరం.. ఆ
సొమ్ము ఎక్కడ నుంచి వస్తుంది.. వాస్తవాల్ని పరిగణనలోకి తీసుకుని.. పరిపాలనా రాజధాని
విశాఖపట్నంలో పెట్టాలని నిర్ణయించామన్నారు. అమరావతి నిర్మాణానికి పెట్టే వ్యయంలో
కేవలం 10 శాతంతో అద్భుత రాజధాని నగరంగా వైజాగ్ ను తీర్చిదిద్దవచ్చన్నారు.
రాబోయే 10ఏళ్లలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలను తలదన్నెలా విశాఖ
రూపుదిద్దుకోగలదని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే విశాఖ.. హైదరాబాద్ కు
సరితూగే సిటీగా అభివర్ణించారు. స్వతహాగా ఎదుగుతున్న వైజాగ్ కు కాస్త ఊతమందిస్తే
విశ్వనగరంగా ప్రగతి సాధిస్తుందని జగన్ వివరించారు. ఈ సందర్భంగా విద్య విషయంలో
ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాల్ని రామ్ అభినందించారు. ఆంగ్ల మాధ్యమంతోపాటు నాణ్యమైన
విద్యను అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచాలని సీఎంకు సూచించారు.
No comments:
Post a Comment