గ్యాస్ లీకేజీతో ఉప్పూడిలో జనం గడగడ
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి
జిల్లాలోని ఉప్పూడి గ్రామం గ్యాస్ లీకేజీ కారణంగా వణికిపోతోంది. కాట్రేనికోన మండలం
లో గల ఈ గ్రామంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఒ.ఎన్.జి.సి. గ్యాస్ పైప్ లైన్ కు
మరమ్మతులు నిర్వహిస్తుండగా లీకేజీ సంభవించింది. 10 ఏళ్ల క్రితం ఒ.ఎన్.జి.సి. సంస్థ
ఇక్కడ రిగ్ తవ్వింది. అయితే గ్యాస్ నిల్వలు తగ్గిపోవడంతో 2016లో దీన్ని
మూసివేశారు. సంస్థ ఇలా ఈ ప్రాంతంలో మూసివేసిన పలు రిగ్గుల నిర్వహణ బాధ్యతల్ని పి.ఎఫ్.హెచ్
అనే ప్రయివేటు సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ ఉప్పూడి రిగ్ వద్ద నిపుణులు లేకుండా నిర్వహణ పనులు చేపట్టడంతో అకస్మాతుగా
గ్యాస్ ఎగజిమ్ముతోంది. భారీ శబ్దాలతో గ్యాస్ వెలువడుతుండడంతో ఘటనా స్థలంలో
ముగ్గురు గాయాలపాలయ్యారు. వీరికి సమీప ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత కాకినాడ
ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మిగిలిన సిబ్బంది గ్రామస్థుల్ని
హెచ్చరించడంతో వారంతా అక్కడ నుంచి తరలిపోయారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతం మొత్తం
విద్యుత్ సరఫరా తో పాటు సెల్ టవర్ సిగ్నల్స్ నిలిపివేశారు. గ్యాస్ లీకేజీని
అదుపు చేసేందుకు నరసాపురం, రాజమండ్రి, తాటిపాక, విశాఖపట్నం నుంచి ప్రత్యేక నిపుణుల బృందాలను అధికారులు రప్పిస్తున్నారు. లీకేజీ
కారణంగా ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు, రెవెన్యూ సిబ్బందితోపాటు ఒ.ఎన్.జి.సి. అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఉప్పూడితోపాటు పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు. అగ్నిమాపక శకటాల్ని రప్పించి
తీవ్ర ఒత్తిడితో లీక్ అవుతున్న గ్యాస్‌ను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. గత
నాలుగు రోజులుగా ఈ బావి వద్ద మరమ్మత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చమురు, సహజ వాయువుల వెలికితీతలో చోటు చేసుకుంటున్న గ్యాస్ లీకేజీలు, విస్ఫోటనాలు కోనసీమ వాసుల్లో దడ పుట్టిస్తున్నాయి. ఏ క్షణానికి ఎలాంటి ఉపద్రవం
ముంచుకొస్తుందోనని భయంతో వణికిపోతున్నారు. గ్యాస్ లీకయిన ప్రాంతాన్ని మంత్రులు విశ్వరూప్, పిల్లి సుభాష్ చంద్రబోస్ సోమవారం పరిశీలించారు. విశ్వరూప్ మీడియాతో మాట్లాడుతూ నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోకపోవడం
వల్లే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. ఒ.ఎన్.జి.సి. అధికారులు ప్రమాద నివారణకు తీవ్రంగా
శ్రమిస్తున్నారని తెలిపారు. లీకవుతున్న ఈ గ్యాస్ ఫైర్ అయ్యే అవకాశం లేదని జనం
భయపడొద్దని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్
చంద్రబోస్ ధైర్యం చెప్పారు.
No comments:
Post a Comment