Saturday, September 14, 2019

IAF to felicitate locals who helped in locating missing AN-32 in Arunachal on sept 17


ఎ.ఎన్-32 జాడ చెప్పిన వారిని సన్మానించనున్న ఐఏఎఫ్ 
కూలిన తమ విమానం జాడ కనుగొనేందుకు సహకరించిన వారిని భారత వాయుసేన (ఐఏఎఫ్) సన్మానించనుంది. ఈ నెల17న వెస్ట్ సియాంగ్ జిల్లాలోని అలోలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. సెర్చ్ ఆపరేషన్స్ లో పాల్గొన్న అధికారులు, పర్వాతారోహకులు, స్థానికులకు ఐఏఎఫ్ రూ.5లక్షల నగదు నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. విమాన జాడ కనుగొనేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన అందరికీ నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాల్ని అందించనుంది. ఈ మేరకు ఐఏఎఫ్ ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ ప్రధానకార్యదర్శి నరేశ్ కుమార్, సియాంగ్ డిప్యూటీ కమిషనర్ రాజీవ్ తకూక్ కు వేర్వేరుగా రాసిన లేఖల్లో తెలిపారు. 
ఈ ఏడాది జూన్3న అసోంలోని జోర్హాట్ లో వరద బాధితులకు సహాయ సామగ్రి అందించి అరుణాచల్ ప్రదేశ్ మెచుకా ఎయిర్ ఫీల్డ్ కు తిరుగు ప్రయాణంలో వాయుసేన విమానం ఎ.ఎన్-32 కూలిపోయింది. అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ విమానం అదృశ్యమయిందని తొలుత భావించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూం(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోవడంతో విమానం జాడ కోసం వాయుసేన వెతుకులాట ప్రారంభించింది. జోర్హాట్ నుంచి 13 మందితో మధ్యాహ్నం 12.25కు టేకాఫ్ అయిన ఎ.ఎన్-32కు అర్ధగంట తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. తర్వాత చేపట్టిన సెర్చ్ ఆపరేషన్స్ లో అరుణాచల్ ప్రదేశ్ అధికారులతో పాటు పర్వతారోహకులు, స్థానికులు పాల్గొన్నారు. జూన్ 19న అరుణాచల్ ప్రదేశ్ లోని లిపో ఉత్తర దిశలో విమాన శకలాలు గుర్తించారు. ఆ రోజు ఆరు మృతదేహాల్ని, మరుసటి రోజు జూన్ 20న మరో ఏడుగురి మృతదేహాల్ని వెలికితీశారు. విమానం బ్లాక్ బాక్స్, మృతులకు సంబంధించిన విలువైన వస్తువుల్ని ఐఏఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఈ విమానం జాడను ఐ.ఎ.ఎఫ్.కు తెలిపిన పాయూం గ్రామవాసి తదుత్ తాచుంగ్ కు రూ.1.5 లక్షలు, మొత్తం సహాయ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించిన పర్వతారోహకుడు తకాతాముత్ కు రూ.1లక్ష, కిషాన్ తెక్సెంగ్ కు రూ.20వేలు, తగుంగ్ తాముత్, తలిక్ దరుంగ్, ఒకెన్మా మిజేలకు రూ.15వేల చొప్పున, మిగిలిన వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాల్ని అందించనున్నారు.

Friday, September 13, 2019

Ganpati immersions: 18 dead across Maharashtra


మహారాష్ట్ర గణేశ్ నిమజ్జనాల్లో 18 మంది మృతి

మహారాష్ట్రలో గణేశ్ నిమజ్జనాల సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం అనంత చతుర్దశి ప్రారంభమైన తర్వాత గణేశ్ నిమజ్జనాలు మొదలయ్యాయి. గురు, శుక్రవారాల్లో పెద్ద ఎత్తున విగ్రహ నిమజ్జనాలకు ఆయా ప్రాంతాల్లో భక్తులు తరలివెళ్లారు. థానేలో గురువారం రాత్రి 7.30 సమయంలో కసారాకు చెందిన కల్పేశ్ జాదవ్ అనే 15 ఏళ్ల బాలుడు గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా మునిగిపోయినట్లు పోలీసులు తెలిపారు.  అమరావతిలోని పూర్ణా నదిలో విగ్రహాల నిమజ్జన సమయంలో వటోల్ శుక్లేశ్వర్ గ్రామానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. నాసిక్ లోని గోదావరి నది స్నాన ఘాట్ రామ్‌కుండ్ సమీపంలో మునిగిపోయిన ప్రశాంత్ పాటిల్(38), పహిన్ గ్రామంలోని చెరువులో మునిగిపోయిన యువరాజ్ రాథోడ్(28) మృతదేహాల్ని పోలీసులు వెలికితీశారు. సతారా జిల్లాలోని కరాడ్ వద్ద కోయనా నదిలో మల్కపూర్ నివాసి చైతన్య షిండే(20) కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. అకోలాలో నీటితో నిండిన క్వారీలో నిమజ్జనం చేస్తుండగా విక్కీ మోర్(27) అనే యువకుడు మునిగిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ ప్రాంతంలో కంచె ఏర్పాటు చేసినా భక్తులు విగ్రహాలతో అక్కడకు చేరుకుని నిమజ్జన కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది. నాసిక్‌లోని సోమేశ్వర్ జలపాతం సమీపంలో లైఫ్‌గార్డులు, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది ముగ్గుర్ని రక్షించారు. భండారా జిల్లాలోని డోల్సర్ గ్రామ చెరువులో సోమరా శివానకర్ అనే వ్యక్తి మునిగిపోయాడని పోలీసు అధికారి తెలిపారు. అమరావతి, నాసిక్, థానే, సింధుదుర్గ్, రత్నగిరి, ధూలే, భండారా, నాందేడ్, అహ్మద్ నగర్, అకోలా, సతారాతో సహా 11 జిల్లాల్లో జరిగిన నిమజ్జనాల్లో మొత్తం 18 మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అమరావతిలో నాలుగు; రత్నగిరిలో మూడు; నాసిక్, సింధుదుర్గ్, సతారాల్లో రెండేసి; థానే, ధూలే, బుల్ధనా, అకోలా, భండారాలో ఒక్కొక్కటి చొప్పున మరణాలు నమోదయినట్లు వివరాలు వెల్లడించారు.

Thursday, September 12, 2019

It`s time to go to the people, says Sonia: Congress plans agitation in October on economic slowdown


`కాషాయి` పాలనను ఎండగట్టే సమయమొచ్చింది: సోనియా
కాషాయ దళపతి నరేంద్రమోదీ లోపభూయిష్ఠ పాలనపై దండెత్తాల్సిన సమయమొచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆమె భేటీ అయ్యారు. ముఖ్యంగా దేశంలో ఆర్థికవ్యవస్థ తిరోగమనం బాట పట్టడానికి ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సి ఉందని సోనియా పేర్కొన్నారు. ఎన్డీయే సర్కార్ వైఖరి వల్లే ఆర్థిక మాంద్యం నెలకొందనే అంశాన్ని ప్రజలకు తెలియచెబుతూ వచ్చే నెల అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన ఉద్యమాల్ని ప్రారంభించాలని సూచించారు. మోదీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని ఈ సందర్భంగా సోనియా ఘాటుగా విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల ఆమోదాన్ని మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. మోదీ కేబినెట్ 100 రోజుల పాలన శూన్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇదివరకే పెదవి విరిచారు. ఇంతకుముందు ప్రియాంక గాంధీ కూడా మోదీ అనుసరిస్తున్న ఆర్థికవిధానాలు దేశానికి చేటు తెస్తున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈరోజు కాంగ్రెస్ కీలక సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ప్రధానకార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు తదితరులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన `మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలు` ఏర్పాట్ల గురించి తాజా భేటీలో నాయకులు చర్చించారు.

Wednesday, September 11, 2019

BJP protest against Mamata govt over power tariff hike in Kolkata


పశ్చిమబెంగాల్ లో విద్యుత్ ఛార్జీల పెంపు సెగ

పశ్చిమబెంగాల్ లో విద్యుత్ ఛార్జీల పెంపుపై భగ్గుమన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగారు. వందల మంది బీజేపీ కార్యకర్తలు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ రోడ్డెక్కారు. రాజధాని కోల్ కతాలోని సెంట్రల్ అవెన్యూ, ఎస్పానాడే తదితర ప్రధాన కూడళ్లలో చొచ్చుకువస్తున్న బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు జల పిరంగులు (వాటర్ కెనాన్) వినియోగించాల్సి వచ్చింది. పోలీసుల వలయాన్ని తప్పించుకుని ముందుకు చొచ్చుకువచ్చే క్రమంలో అయిదుగురు కార్యకర్తలు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని కోలకతా మెడికల్ కాలేజీ, విషుదానంద ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాజు బెనర్జీ, సయాతన్ బసు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు దేబ్జిత్ సర్కార్ సహా వందమంది కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రానున్న ఏడాదిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్న తరుణంలో బీజేపీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమౌతోంది. ఈ విద్యుత్ ఛార్జీల పెంపుపై ఉద్యమాన్ని బీజేపీ ఓ అస్త్రంగా మలుచుకుని మమతా సర్కార్ పై ఎదురుదాడికి దిగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజలకు విద్యుత్  నిత్యావసర  సాధనం కావడంతో అదే ప్రధాన అజెండాగా వారితో మమేకం అయ్యేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో 18 ఎంపీ సీట్లను గెలుచుకుని ఊపుమీద కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ అసంబద్ధ విద్యుత్ విధానం అమలు చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటి రెగ్యులేటరీ కమిషన్ (సీఈఎస్సీ) యూనిట్ విద్యుత్ రూ.4.26కు కొనుగోలు చేసి వినియోగదారుల నుంచి రూ.7.33 (తొలి 100 యూనిట్లు) చొప్పున ఛార్జీలు వసూలు చేయడాన్ని బీజేపీ తప్పుబడుతోంది. గ్లోబల్ టెండర్ల ద్వారా విద్యుత్ కొనుగోలు ప్రక్రియ చేపట్టినట్లయితే వినియోగదారులు తమకు ఆమోదయోగ్యమైన ధరకు విద్యుత్ ను పొందగల్గుతారని ఆ పార్టీ మమతా సర్కార్ కు సూచిస్తోంది.