`కాషాయి` పాలనను ఎండగట్టే సమయమొచ్చింది: సోనియా
కాషాయ దళపతి నరేంద్రమోదీ లోపభూయిష్ఠ పాలనపై
దండెత్తాల్సిన సమయమొచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ శ్రేణులకు
పిలుపునిచ్చారు. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ
నాయకులతో ఆమె భేటీ అయ్యారు. ముఖ్యంగా దేశంలో ఆర్థికవ్యవస్థ తిరోగమనం బాట పట్టడానికి
ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సి ఉందని
సోనియా పేర్కొన్నారు. ఎన్డీయే సర్కార్ వైఖరి వల్లే ఆర్థిక మాంద్యం నెలకొందనే
అంశాన్ని ప్రజలకు తెలియచెబుతూ వచ్చే నెల అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన ఉద్యమాల్ని ప్రారంభించాలని సూచించారు. మోదీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని ఈ సందర్భంగా సోనియా ఘాటుగా
విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల ఆమోదాన్ని మోదీ ప్రభుత్వం దుర్వినియోగం
చేస్తోందని ఆరోపించారు. మోదీ కేబినెట్ 100 రోజుల పాలన శూన్యమని కాంగ్రెస్ అగ్రనేత
రాహుల్ ఇదివరకే పెదవి విరిచారు. ఇంతకుముందు ప్రియాంక గాంధీ కూడా మోదీ
అనుసరిస్తున్న ఆర్థికవిధానాలు దేశానికి చేటు తెస్తున్నాయని పేర్కొన్న సంగతి
తెలిసిందే. ఈరోజు కాంగ్రెస్ కీలక సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ
ప్రధానకార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, సీఎల్పీ
నాయకులు తదితరులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన `మహాత్మాగాంధీ
150వ జయంత్యుత్సవాలు` ఏర్పాట్ల గురించి తాజా భేటీలో నాయకులు చర్చించారు.
No comments:
Post a Comment