ఎ.ఎన్-32 జాడ చెప్పిన వారిని
సన్మానించనున్న ఐఏఎఫ్
కూలిన తమ
విమానం జాడ కనుగొనేందుకు సహకరించిన వారిని భారత వాయుసేన (ఐఏఎఫ్) సన్మానించనుంది. ఈ
నెల17న వెస్ట్ సియాంగ్ జిల్లాలోని అలోలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. సెర్చ్
ఆపరేషన్స్ లో పాల్గొన్న అధికారులు, పర్వాతారోహకులు, స్థానికులకు ఐఏఎఫ్ రూ.5లక్షల నగదు
నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. విమాన జాడ కనుగొనేందుకు ప్రత్యక్షంగా,
పరోక్షంగా సహకరించిన అందరికీ నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాల్ని అందించనుంది. ఈ
మేరకు ఐఏఎఫ్ ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ ప్రధానకార్యదర్శి నరేశ్
కుమార్, సియాంగ్ డిప్యూటీ కమిషనర్ రాజీవ్ తకూక్ కు వేర్వేరుగా రాసిన లేఖల్లో
తెలిపారు.
ఈ
ఏడాది జూన్3న అసోంలోని జోర్హాట్ లో వరద బాధితులకు సహాయ సామగ్రి అందించి అరుణాచల్
ప్రదేశ్ మెచుకా ఎయిర్ ఫీల్డ్ కు తిరుగు ప్రయాణంలో వాయుసేన విమానం ఎ.ఎన్-32 కూలిపోయింది. అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ విమానం అదృశ్యమయిందని తొలుత భావించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూం(ఏటీసీ)తో సంబంధాలు
తెగిపోవడంతో విమానం జాడ కోసం వాయుసేన వెతుకులాట ప్రారంభించింది. జోర్హాట్ నుంచి 13
మందితో మధ్యాహ్నం 12.25కు టేకాఫ్ అయిన ఎ.ఎన్-32కు అర్ధగంట
తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. తర్వాత చేపట్టిన సెర్చ్ ఆపరేషన్స్ లో అరుణాచల్ ప్రదేశ్
అధికారులతో పాటు పర్వతారోహకులు, స్థానికులు పాల్గొన్నారు. జూన్ 19న అరుణాచల్ ప్రదేశ్ లోని లిపో
ఉత్తర దిశలో విమాన శకలాలు గుర్తించారు. ఆ రోజు ఆరు మృతదేహాల్ని, మరుసటి రోజు జూన్
20న మరో ఏడుగురి మృతదేహాల్ని వెలికితీశారు. విమానం బ్లాక్ బాక్స్, మృతులకు
సంబంధించిన విలువైన వస్తువుల్ని ఐఏఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఈ
విమానం జాడను ఐ.ఎ.ఎఫ్.కు తెలిపిన పాయూం గ్రామవాసి తదుత్ తాచుంగ్ కు రూ.1.5 లక్షలు,
మొత్తం సహాయ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించిన పర్వతారోహకుడు తకాతాముత్ కు
రూ.1లక్ష, కిషాన్ తెక్సెంగ్ కు రూ.20వేలు, తగుంగ్ తాముత్, తలిక్ దరుంగ్, ఒకెన్మా
మిజేలకు రూ.15వేల చొప్పున, మిగిలిన వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాల్ని అందించనున్నారు.
No comments:
Post a Comment