పశ్చిమబెంగాల్ లో విద్యుత్ ఛార్జీల పెంపు సెగ
పశ్చిమబెంగాల్ లో విద్యుత్
ఛార్జీల పెంపుపై భగ్గుమన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం తీవ్రస్థాయిలో
ఆందోళనకు దిగారు. వందల మంది బీజేపీ కార్యకర్తలు పెంచిన విద్యుత్ ఛార్జీలు
తగ్గించాలని కోరుతూ రోడ్డెక్కారు. రాజధాని కోల్ కతాలోని సెంట్రల్ అవెన్యూ, ఎస్పానాడే తదితర ప్రధాన కూడళ్లలో చొచ్చుకువస్తున్న బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి
పోలీసులు జల పిరంగులు (వాటర్ కెనాన్) వినియోగించాల్సి వచ్చింది. పోలీసుల వలయాన్ని
తప్పించుకుని ముందుకు చొచ్చుకువచ్చే క్రమంలో అయిదుగురు కార్యకర్తలు తీవ్ర గాయాలపాలయ్యారు.
వీరిని కోలకతా మెడికల్ కాలేజీ, విషుదానంద ఆసుపత్రులకు తరలించి చికిత్స
అందిస్తున్నారు. నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి
రాజు బెనర్జీ, సయాతన్ బసు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు దేబ్జిత్ సర్కార్ సహా
వందమంది కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రానున్న ఏడాదిలో రాష్ట్రంలో
అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్న తరుణంలో బీజేపీ తన ఆధిపత్యాన్ని
ప్రదర్శించేందుకు సిద్ధమౌతోంది. ఈ విద్యుత్ ఛార్జీల పెంపుపై ఉద్యమాన్ని బీజేపీ ఓ
అస్త్రంగా మలుచుకుని మమతా సర్కార్ పై ఎదురుదాడికి దిగుతున్నట్లు
కనిపిస్తోంది. ప్రజలకు విద్యుత్ నిత్యావసర సాధనం
కావడంతో అదే ప్రధాన అజెండాగా వారితో మమేకం అయ్యేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో 18 ఎంపీ సీట్లను గెలుచుకుని ఊపుమీద కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
పశ్చిమబెంగాల్ లో
తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ అసంబద్ధ విద్యుత్ విధానం అమలు చేస్తోందని బీజేపీ
ఆరోపిస్తోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటి రెగ్యులేటరీ కమిషన్ (సీఈఎస్సీ) యూనిట్ విద్యుత్
రూ.4.26కు కొనుగోలు చేసి వినియోగదారుల నుంచి రూ.7.33 (తొలి 100 యూనిట్లు) చొప్పున ఛార్జీలు వసూలు చేయడాన్ని బీజేపీ
తప్పుబడుతోంది. గ్లోబల్ టెండర్ల ద్వారా విద్యుత్ కొనుగోలు ప్రక్రియ
చేపట్టినట్లయితే వినియోగదారులు తమకు ఆమోదయోగ్యమైన ధరకు విద్యుత్ ను పొందగల్గుతారని
ఆ పార్టీ మమతా సర్కార్ కు సూచిస్తోంది.
No comments:
Post a Comment