Friday, May 3, 2019

churches in colombo cancel sunday mass due to threat


కొలంబో చర్చిల్లో ఈ ఆదివారమూ ప్రార్థనల రద్దు
అంతర్జాతీయ నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కొలంబో కేథలిక్ చర్చిల్లో వరుసగా రెండో ఆదివారం ప్రార్థనలు రద్దు చేశారు. ఈ మేరకు  శ్రీలంక ప్రభుత్వ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. కొలంబో ఆర్చిబిషప్ మాల్కం రంజిత్ విలేకర్లతో మాట్లాడుతూ కొలంబో సహా పరిసర ప్రాంతాల్లోని అన్ని కేథలిక్ విద్యాసంస్థల్ని ఇంకా తెరవలేదని తెలిపారు. ఏప్రిల్ 21 ఈస్టర్ సండే వరుస బాంబు దాడుల అనంతరం నెలకొన్న భయానక వాతావరణం దేశంలో ఇంకా కొనసాగుతోంది. మరోసారి ఇస్లామిక్ ఉగ్రవాదులు విరుచుకుపడే ప్రమాదముందని శ్రీలంక ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దేశంలో హై అలర్ట్ కొనసాగుతోంది. పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్ని సోమవారం తెరవనున్నారు. అయితే ప్రతి విద్యాసంస్థ వద్ద కనీసం ఒక సాయుధ పోలీసును కాపాలా ఉంచనున్నారు. ఈ మేరకు శ్రీలంక విద్యా మంత్రిత్వ శాఖ భద్రత బలగాలకు ఆదేశాలచ్చింది. దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో పూర్తి భద్రతా వాతావరణం ఏర్పడలేదని భావిస్తున్నారు. అయితే అధికారంగా దీనిపై వ్యాఖ్యానించడానికి నిఘా, భద్రత విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు నిరాకరించారు.


naidu calls for public transport centric approach to combat growing vehicular pollution


ప్రజా రవాణా వ్యవస్థ ఆదరణతోనే పర్యావరణ పరిరక్షణ: ఉపరాష్ట్రపతి
ప్రజలందరూ వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజారవాణా వ్యవస్థ పట్ల మొగ్గు కనబరిస్తేనే వాతావరణ కాలుష్యానికి అడ్డుకట్ట పడుతుందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఢిల్లీ మెట్రో రైలు(డీఎంఆర్సీ) 25వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మే3 శుక్రవారం ఆయన ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్యానికి చరమగీతం పాడాలన్న స్పృహ ప్రతి ఒక్కరిలో రావాలని అప్పుడే స్వచ్ఛమైన వాతావరణాన్ని పొందగలమన్నారు. అందుకు అందరూ ప్రజారవాణా వ్యవస్థను తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. వాయు కాలుష్యం అంతకంతకు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంలో వ్యక్తిగత వాహనాల సంఖ్య అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోవడమే కారణమని ఉపరాష్ట్రపతి చెప్పారు. ముఖ్యంగా నగరాల్లో కార్లు ద్విచక్ర వాహనాల సంఖ్య శరవేగంగా పెరుగుతూ పోతోందన్నారు. 1994 నాటికి మెట్రో నగరాల్లో ప్రతి 1000 మంది వ్యక్తులలో కార్లు, ద్విచక్ర వాహనాలు కల్గిన వారి నిష్పత్తి 14, 112 కాగా 2021 నాటికి ఆ సంఖ్య 48, 393కు పెరగనున్నట్లు చెబుతూ ఆయన ఇది వాతావరణ కాలుష్యం పెరగడానికి ప్రమాద సంకేతమని తెలిపారు. రాబోయే 15 ఏళ్లల్లో మెట్రో నగరాల్లో ద్విచక్ర వాహనాల సంఖ్య 5 కోట్ల 30 లక్షలు, కార్ల సంఖ్య 60 లక్షలకు చేరుకోనున్నట్లు చెప్పారు. ఈ పరిస్థితిని తప్పించేందుకు ప్రజారవాణా వ్యవస్థ ఒక్కటే మార్గమన్నారు. దేశంలో ప్రస్తుత మెట్రో రైలు రవాణా వ్యవస్థల అమలు తీరు పట్ల ఉపరాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డి.ఎస్.మిశ్రా (డీఎంఆర్సీ చైర్మన్, గృహ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి), డాక్టర్. మంగుసింగ్(ఎండీ, డీఎంఆర్సీ), కె.కె.సబర్వాల్ (డైరెక్టర్ ఫైనాన్స్), డీఎంఆర్సీ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

it was bear nepal army rejects indian mountaineering team`s yethi claim


యతి పాద ముద్రలు కావు.. అవి మంచు ఎలుగుబంటివన్న నేపాల్

హిమాలయాల్లో ఇటీవల కనిపించినవి యతి పాదముద్రలు కావని అవి మంచు ఎలుగుబంటివని నేపాల్ సైన్యం పేర్కొంది. మకాలు బేస్ క్యాంప్ ప్రాంతంలో కొందరు సాహసికుల బృందం తొలుత ఈ భారీ సైజులోని పాద ముద్రల్ని కనుగొంది. పురాణ కాలం నుంచి యతి మంచుమనిషి ఉనికిపై కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా  యతి పాద ముద్రలు కనిపించాయంటూ హల్ చల్ చేస్తున్న వీడియో క్లిపింగ్ లపై నేపాల్ సైన్యం స్పందించింది. భారత సైన్యం కూడా ఈ పాదముద్రల నిగ్గు తేల్చేందుకు నిపుణుల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో నేపాల్ సైన్యం అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ బిగ్యాన్ దేవ్ పాండే వివరాలు వెల్లడించారు. సాహసికుల బృందం యతి పాదముద్రలు చూశామని చెబుతున్న ప్రాంతానికి వెళ్లి తమ సైనికబృందం పరిశీలన జరిపిందన్నారు. పురాణాల ప్రకారమైతే 32X15 అంగుళాల సైజులో పాద ముద్రలుండాలి కదా ఇవి అంత పెద్దగా లేవు. కచ్చితంగా మంచు ఎలుగుబంటివేనని దేవ్ పాండే తెలిపారు.

 


fani cyclone heading towards west bengal, rain lashes city.. 3 died in odisha

పశ్చిమబెంగాల్ కు మళ్లుతోన్న ఫొని తుపాను..ఒడిశాలో ముగ్గురి మృతి


కోస్తా రాష్ట్రాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఫొని తుపాను ఒడిశా తీరం మీదుగా పశ్చిమబెంగాల్ కు మళ్లుతోంది. మే3 శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉత్తర, ఈశాన్య దిశలో గంటకు 24 కిలోమీటర్ల వేగంతో కదిలిన పెను తుపాన్ ఫొని తీవ్రతను తగ్గించుకుని ఒడిశా తీరం నుంచి కదులుతోంది. ఉదయం 11 గంటలకు భువనేశ్వర్ కు 10 కిలోమీటర్లు, కటక్ కు 30 కిలోమీటర్ల వద్ద ఉన్న తుపాన్ క్రమేపి పశ్చిమబెంగాల్ వైపు కదులుతోంది. మే4న మరింత తీవ్రతను తగ్గించుకుని ఫొని తుపాన్ బంగ్లాదేశ్ ను తాకుతుందని వాతావరణ శాఖ (ఐఎండి) వర్గాలు తెలిపాయి. ఉదయం పూరి, సమీప ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. ఒడిశాలో తుపాన్ ధాటికి ముగ్గురు మృత్యుపాలైనట్లు సమాచారం. ముందస్తు తుపాన్ చర్యలు చేపట్టడంతో ప్రాణ నష్టం పెద్ద సంఖ్యలో సంభవించలేదు. ఈదురు గాలుల తీవ్రతకు మహా వృక్షాలు సైతం కూకటి వేళ్లతో నేలకూలాయి. తుపాన్ సహాయక సిబ్బంది వీటిని తొలగించే పనులు చేపట్టారు. రాగల 24 గంటల్లో పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ఐఎండి వర్గాలు హెచ్చరించాయి. ఇదిలా ఉండగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల కార్యక్రమాలన్నింటిని వాయిదా వేసుకున్నారు. రాష్ట్రంలో రెడ్ అలర్డ్ ప్రకటించి ప్రజల్ని అప్రమత్తం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు సహాయక బృందాలను(ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దించారు. రెండు రోజులుగా కోలకతా, భువనేశ్వర్ ల్లో విమానాశ్రయాలు మూసివేసిన సంగతి తెలిసిందే. హౌరా, హుగ్లీ, ఝార్గాం, కోల్ కతా, సుందర్ బన్ ప్రాంతాల్లో ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.