ప్రజా రవాణా వ్యవస్థ ఆదరణతోనే
పర్యావరణ పరిరక్షణ: ఉపరాష్ట్రపతి
ప్రజలందరూ
వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజారవాణా వ్యవస్థ పట్ల మొగ్గు
కనబరిస్తేనే వాతావరణ కాలుష్యానికి అడ్డుకట్ట పడుతుందని భారత ఉపరాష్ట్రపతి
వెంకయ్యనాయుడు అన్నారు. ఢిల్లీ మెట్రో రైలు(డీఎంఆర్సీ) 25వ వ్యవస్థాపక
దినోత్సవాన్ని పురస్కరించుకుని మే3 శుక్రవారం ఆయన ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. పర్యావరణ
పరిరక్షణ, వాయు కాలుష్యానికి చరమగీతం పాడాలన్న స్పృహ ప్రతి ఒక్కరిలో రావాలని
అప్పుడే స్వచ్ఛమైన వాతావరణాన్ని పొందగలమన్నారు. అందుకు అందరూ ప్రజారవాణా వ్యవస్థను
తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. వాయు కాలుష్యం అంతకంతకు ప్రమాదకర స్థాయికి
చేరుకోవడంలో వ్యక్తిగత వాహనాల సంఖ్య అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోవడమే కారణమని
ఉపరాష్ట్రపతి చెప్పారు. ముఖ్యంగా నగరాల్లో కార్లు ద్విచక్ర వాహనాల సంఖ్య శరవేగంగా
పెరుగుతూ పోతోందన్నారు. 1994 నాటికి మెట్రో నగరాల్లో ప్రతి 1000 మంది వ్యక్తులలో కార్లు,
ద్విచక్ర వాహనాలు కల్గిన వారి నిష్పత్తి 14, 112 కాగా 2021 నాటికి ఆ సంఖ్య 48,
393కు పెరగనున్నట్లు చెబుతూ ఆయన ఇది వాతావరణ కాలుష్యం పెరగడానికి ప్రమాద సంకేతమని
తెలిపారు. రాబోయే 15 ఏళ్లల్లో మెట్రో నగరాల్లో ద్విచక్ర వాహనాల సంఖ్య 5 కోట్ల 30
లక్షలు, కార్ల సంఖ్య 60 లక్షలకు చేరుకోనున్నట్లు చెప్పారు. ఈ పరిస్థితిని
తప్పించేందుకు ప్రజారవాణా వ్యవస్థ ఒక్కటే మార్గమన్నారు. దేశంలో ప్రస్తుత మెట్రో
రైలు రవాణా వ్యవస్థల అమలు తీరు పట్ల ఉపరాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో డి.ఎస్.మిశ్రా (డీఎంఆర్సీ చైర్మన్, గృహ, పట్టణాభివృద్ధి శాఖ
కార్యదర్శి), డాక్టర్. మంగుసింగ్(ఎండీ, డీఎంఆర్సీ), కె.కె.సబర్వాల్ (డైరెక్టర్
ఫైనాన్స్), డీఎంఆర్సీ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment