Sunday, May 2, 2021

Inter Exams postponed in AP

ఏపీలో ఇంటర్ పరీక్షల వాయిదా

కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో  ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం.. పరీక్షలు నిర్వహించి తీరుతామన్న రాష్ట్ర ప్రభుత్వం  హైకోర్టు సూచన ప్రకారం మెట్టుదిగివచ్చింది. కోవిడ్ తాజా కల్లోలం దరిమిలా పదో తరగతి, ఇంటర్ చదువుతున్న 30 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడాల్సి ఉందని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పరీక్షల్ని వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్లపై రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం విచారణ చేపట్టింది. తీర్పు సోమవారం (మే3)న వెలువడాల్సి ఉండగా ప్రభుత్వం ఒక్కరోజు ముందుగా ఆదివారమే ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ మేరకు ప్రకటన చేస్తూ పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తాజా షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. 

Thursday, April 29, 2021

West Bengal assembly election crude bombs-hurled in central Kolkata amid last phase of polls

పశ్చిమబెంగాల్ పోలింగ్ లో నాటు బాంబు పేలుళ్లు

పశ్చిమబెంగాల్ తుది దశ పోలింగ్ లో నాటు బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. గురువారం ఉదయం సెంట్రల్ కోల్‌కతాలోని మహాజతి సదన్ ప్రాంతంలో ఆగంతకులు నాటుబాంబులు విసరడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నగరం నడిబొడ్డున గల సెంట్రల్ అవెన్యూలో జరిగిన ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆధారాలు సేకరించి దుండగుల కోసం గాలింపు ప్రారంభించారు. జోరాసంకో  నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మీనా దేవి పురోహిత్ పోలింగ్ బూత్‌లలో పర్యటిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నాటుబాంబులు విసిరారు. తన వాహనానికి అత్యంత సమీపంలో బాంబు పేలుళ్లు సంభవించినట్లు పురోహిత్ తెలిపారు. "నా కారుపై బాంబులు విసిరినప్పటికీ నేను భయపడను. నేను ఖచ్చితంగా బూత్‌లను సందర్శిస్తాను" అని ఆమె చెప్పారు. "వారు నన్ను చంపడానికి ప్రయత్నించారు .. ఓటర్లను భయపెట్టడానికి ఇది ఒక కుట్ర" అని పురోహిత్ ఆరోపించారు. ఘటనా స్థలంలో భారీ పోలీసు బృందాన్ని మోహరించినట్లు కోల్‌కతా పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశలో జోరసంకోతో సహా కోల్‌కతాలోని ఏడు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్  సాయంత్రం 6.30 వరకు కొనసాగనుంది.

Wednesday, April 28, 2021

Cowin Aarogya Setu crash as citizens rush to register for Corona Vaccines

కోవిన్ పోర్టల్‌ క్రాష్! 

దేశంలోని యువతకు కోవిడ్ వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. 18 ఏళ్ల పైబడిన వారందరూ అర్హులే అని కేంద్రం ప్రకటించడంతో ఎక్కువ మంది ఒకేసారి రిజిస్ట్రేషన్‌కి ప్రయత్నించారు. దాంతో సర్వర్లు క్రాష్ అయ్యాయి. సెకండ్ వేవ్ సృష్టిస్తోన్న భయోత్పాతంతో ఒక్కసారిగా అందరిలోనూ వేక్సినేషన్ విషయమై చురుకు పుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి 60 కోట్ల  పైచిలుకు మందికి కరోనా వ్యాక్సినేషన్ జరగ్గా అందులో 25 శాతం సుమారు 15 కోట్ల మందికి  మనదేశంలో కరోనా టీకా వేశారు. భారత ప్రభుత్వం మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయించుకునే వెసులుబాటు కల్పించింది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఆన్‌లైన్ పోర్టల్‌ కోవిన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది. ఇప్పటి వరకూ కేవలం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకా వేస్తున్నారు. కేంద్రం తాజా నిర్ణయాలతో 18 ఏళ్ల పైబడిన యువత పెద్దఎత్తున వ్యాక్సినేషన్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు కోవిన్ పోర్టల్‌‌లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం పెద్దఎత్తుల లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించారు. దాంతో లోడ్ తట్టుకోలేక సర్వర్లు క్రాష్ అయినట్లు సమాచారం.

Friday, April 23, 2021

Hyderabad chicken and mutton shops will be closed on April 25th sunday due to Mahavir birth anniversary

ఈ సండే ముక్కా చుక్క బంద్

హైదరాబాద్ మహానగర వాసులు ఈ ఆదివారం ముక్క, చుక్కకు దూరం కానున్నారు. మహవీర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 25న  మాంసం, మందు దుకాణాలన్నీ బంద్ కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ ఎంసీ) పరిధిలోని కబేళాలు, మాంసం, బీఫ్ దుకాణాలన్నింటినీ ఈ ఆదివారం మూసేయాల్సిందిగా జీహెచ్ఎంసీ ప్రకటన జారీ చేసింది. ఈ నిబంధనలు పాటించేలా వెటర్నరీ విభాగం అధికారులు బాధ్యత తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సూచించారు. గత ఏడాది కరోనా టైమ్ లో చికెన్ పై దుష్ప్రచారం జరిగింది. మాంసాహారం వల్లే కరోనా వస్తుందంటూ వదంతులు వ్యాపించడంతో ఓ దశలో కిలో చికెన్ ధర రూ.50 కి పడిపోయింది. కోడి, గుడ్ల ధరలు దారుణంగా పతనమయ్యాయి. దాంతో నెలల పాటు ఫౌల్ట్రీ రంగం కుదేలయిపోయింది. రంగంలోకి దిగిన కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖలు చికెన్, గుడ్లు తినడం ద్వారానే పోషకాలు లభించి కరోనాను తేలిగ్గా జయించొచ్చని ప్రచారాన్ని చేపట్టాయి. మళ్లీ జనం కోడి, గుడ్లను తీసుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.280 వరకు చేరుకోగా, మాంసం కిలో రూ.500 పైచిలుకు పలుకుతోంది. మద్యం విషయానికి వస్తే ఏరోజుకారోజు పైపైకే అన్నచందంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి.