పశ్చిమబెంగాల్ పోలింగ్ లో
నాటు బాంబు పేలుళ్లు
పశ్చిమబెంగాల్ తుది దశ పోలింగ్ లో నాటు బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. గురువారం
ఉదయం సెంట్రల్ కోల్‌కతాలోని మహాజతి సదన్ ప్రాంతంలో ఆగంతకులు నాటుబాంబులు విసరడంతో
ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నగరం నడిబొడ్డున గల సెంట్రల్ అవెన్యూలో జరిగిన ఈ
ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆధారాలు సేకరించి దుండగుల కోసం గాలింపు
ప్రారంభించారు. జోరాసంకో నియోజకవర్గ
బీజేపీ అభ్యర్థి మీనా దేవి పురోహిత్ పోలింగ్ బూత్‌లలో పర్యటిస్తున్న సమయంలో గుర్తు
తెలియని వ్యక్తులు నాటుబాంబులు విసిరారు. తన వాహనానికి అత్యంత సమీపంలో బాంబు
పేలుళ్లు సంభవించినట్లు పురోహిత్ తెలిపారు. "నా కారుపై బాంబులు
విసిరినప్పటికీ నేను భయపడను. నేను ఖచ్చితంగా బూత్‌లను సందర్శిస్తాను" అని ఆమె
చెప్పారు. "వారు నన్ను చంపడానికి
ప్రయత్నించారు .. ఓటర్లను భయపెట్టడానికి ఇది ఒక కుట్ర" అని పురోహిత్
ఆరోపించారు. ఘటనా స్థలంలో భారీ పోలీసు బృందాన్ని మోహరించినట్లు కోల్‌కతా పోలీసు
ఉన్నతాధికారులు చెప్పారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశలో జోరసంకోతో
సహా కోల్‌కతాలోని ఏడు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన
పోలింగ్ సాయంత్రం 6.30 వరకు కొనసాగనుంది.
No comments:
Post a Comment