ఈ సండే ముక్కా చుక్క బంద్
హైదరాబాద్ మహానగర వాసులు ఈ ఆదివారం ముక్క, చుక్కకు దూరం కానున్నారు. మహవీర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 25న మాంసం, మందు దుకాణాలన్నీ బంద్ కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ ఎంసీ) పరిధిలోని కబేళాలు, మాంసం, బీఫ్ దుకాణాలన్నింటినీ ఈ ఆదివారం మూసేయాల్సిందిగా జీహెచ్ఎంసీ ప్రకటన జారీ చేసింది. ఈ నిబంధనలు పాటించేలా వెటర్నరీ విభాగం అధికారులు బాధ్యత తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సూచించారు. గత ఏడాది కరోనా టైమ్ లో చికెన్ పై దుష్ప్రచారం జరిగింది. మాంసాహారం వల్లే కరోనా వస్తుందంటూ వదంతులు వ్యాపించడంతో ఓ దశలో కిలో చికెన్ ధర రూ.50 కి పడిపోయింది. కోడి, గుడ్ల ధరలు దారుణంగా పతనమయ్యాయి. దాంతో నెలల పాటు ఫౌల్ట్రీ రంగం కుదేలయిపోయింది. రంగంలోకి దిగిన కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖలు చికెన్, గుడ్లు తినడం ద్వారానే పోషకాలు లభించి కరోనాను తేలిగ్గా జయించొచ్చని ప్రచారాన్ని చేపట్టాయి. మళ్లీ జనం కోడి, గుడ్లను తీసుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.280 వరకు చేరుకోగా, మాంసం కిలో రూ.500 పైచిలుకు పలుకుతోంది. మద్యం విషయానికి వస్తే ఏరోజుకారోజు పైపైకే అన్నచందంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
No comments:
Post a Comment