Friday, September 27, 2019

BJP's Yuvraj Singh wins Hamirpur bypoll


యూపీ ఉప ఎన్నికలో బీజేపీ నాయకుడు యువరాజ్ సింగ్ గెలుపు
ఉత్తరప్రదేశ్(యూపీ) లోని హమిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక్కడ గతంలో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే అశోక్ కుమార్ సింగ్ చందల్ హత్య కేసులో నేరం రుజువుకావడంతో అతని శాసనసభ్యత్వం రద్దయింది. 22 ఏళ్ల నాటి హత్య కేసులో ఆయనకు శిక్ష పడింది. దాంతో సెప్టెంబర్ 23 (సోమవారం)  హమిర్పూర్ లో ఉప ఎన్నిక నిర్వహించారు. ఓట్ల లెక్కింపును శుక్రవారం చేపట్టగా తాజా బీజేపీ అభ్యర్థి యువరాజ్ సింగ్ 17,846 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 74,373 ఓట్లు పడగా సమీప ప్రత్యర్థి సమాజ్ వాది పార్టీ(ఎస్పీ) అభ్యర్థికి 56,528 ఓట్లు వచ్చాయి. మూడు నాలుగు స్థానాల్లో నౌషిద్ అలీ(బీఎస్పీ), హర్దీపక్ నిషద్ (కాంగ్రెస్) నిలిచారు. ఈ ఉపఎన్నికలో మొత్తం 9మంది అభ్యర్థులు పోటీపడగా 51 శాతం ఓటింగ్ నమోదయింది. హమిర్పూర్ లో పార్టీ సీటును నిలబెట్టుకోవడంలో కృషి చేసిన కార్యకర్తలు, ప్రజలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుభాభినందనలు తెలిపారు.

Thursday, September 26, 2019

Chain snatching cases high in Delhi: Alarming situation in the national capital


దేశ రాజధానిలో నేరగాళ్ల స్వైర విహారం
పెరుగుతోన్న నేరాలతో దేశ రాజధాని ఢిల్లీ వణుకుతోంది. పట్టపగలే బైక్ లపై స్వైరవిహారం చేస్తూ నేరగాళ్లు హస్తినాపురవాసుల్ని భయపెడుతున్నారు. మహిళల మెడలో గొలుసులు, మొబైల్ ఫోన్లు, బ్యాగుల చోరీలే లక్ష్యంగా బరి తెగిస్తున్నారు. తాజాగా ఓ మహిళా జర్నలిస్టు మొబైల్ దోపిడీకి పాల్పడ్డారు. గడిచిన ఆదివారం చిత్రంజన్ పార్క్ ప్రాంతంలో షాపింగ్ చేసి ఆటోలో ఇంటికి తిరుగుప్రయాణమైన మహిళా జర్నలిస్ట్ జోయ్మాల బగాచిని బైక్ పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు అటకాయించారు. ఆమె మొబైల్ ను గుంజుకున్నారు. ఈ పెనుగులాటలో కదులుతున్న ఆటో నుంచి ఆమె రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. సాయంత్రం 6 సమయంలో జరిగిన ఈ ఘటనలో బగాచి దవడ ఎముక విరిగిపోయింది. చబుకం భాగం చీలిపోవడంతో కుట్లు పడ్డాయి. స్థానికులు స్పందించి రక్తమోడుతున్న ఆమెను ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. చికిత్స పొందుతున్న ఆ మహిళా జర్నలిస్ట్ ను  రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఇంతవరకు నిందితుల్ని పట్టుకోవడంలో విఫలమైన పోలీసులపై చైర్ పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చోరీ చేసిన బైక్ లపై ప్రయాణిస్తున్న దుండగులు మహిళలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నారు.
నేరాల్లో మైనర్లే ఎక్కువ..
మెడలో గొలుసులు తెంచుకోపోయే చోరుల్లో అధికశాతం మైనర్లే ఉంటున్నట్లు పోలీస్ రికార్డులను బట్టి స్పష్టమౌతోంది. సులభంగా డబ్బు సంపాదించాలనుకొనే వాళ్లు, స్నేహితులతో జల్సాలకు అలవాటు పడిన బాలురే ఎక్కువగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వీరంతా ముఠాలుగా ఏర్పడుతుండడం పోలీసుల్ని సైతం కలవరానికి గురిచేస్తోంది. ఈ ముఠాలు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాదారులుగాను చలామణిలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికి 4000 గొలుసు చోరీ కేసులు నమోదు కాగా సుమారు 3 వేల మంది చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.  2018లో 6,932 గొలుసు దొంగతనం కేసులు నమోదు కాగా 5,571 మందిని పోలీసులు కటకటాల వెనక్కినెట్టారు. నేరాల తీవ్రత అత్యంత ఆందోళనకరమైన స్థితికి చేరుకోవడంతో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమించారు. క్రైం స్పెషల్ సెల్, యాంటీ టెర్రర్ వింగ్ విభాగాలు నేరాల అదుపుపై దృష్టి సారించాయి. ఈ నేరగాళ్ల ఆటకట్టించేందుకు మహారాష్ట్ర వ్యవస్థాగత నేరనియంత్రణ చట్టం (ఎం.సి.ఒ.సి.ఎ) తరహాలో ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
ప్రేమికుల జంటది అదే బాట..
ఆగస్ట్ 20న ప్రేమికుల జంటను నగర పోలీసులు ఓ చోరీ కేసులో పట్టుకున్నారు. ఈ జోడీ కొట్టేసిన వస్తువుల్ని విక్రయించి మత్తుపదార్థాలను కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు పోలీసు విచారణలో వెల్లడయింది.  ఈ చోరీ జంటలోని యువతి పురుషుడి మాదిరిగా దుస్తులు ధరించి తనెవరయింది బయటపడకుండా నేరాలకు పాల్పడినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్ డిస్ట్రిక్ట్) మోనికా భరద్వాజ్ తెలిపారు. పట్టుబడిన ఈ ప్రేమికుల జంటపై ఐపీసీ సెక్షన్ 411 కింద కేసు నమోదు చేశారు. మెడలో గొలుసు తెంచుకుపోవడంతోనే ఈ నేరాలు పరిమితం కావడం లేదు. దోపిడీ, దౌర్జన్యం, హత్యాయత్నం తదితర తీవ్ర హింసాత్మక నేరాలకు ఈ చోరులు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ జులై 14న డిఫెన్స్ కాలనీలోని ఓ హోటల్ లో కుక్ గా పనిచేస్తున్న 22ఏళ్ల యువకుణ్ని బైక్ పై వచ్చిన దుండగులు హత్య చేశారు. తన వద్ద ఉన్న వస్తువును లాక్కుపోవడానికి ప్రయత్నించగా అతను ప్రతిఘటించడంతో ఆగంతకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. దుండగుల్ని తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఒకడు మైనర్. జులై2న స్థానిక లక్ష్మీ నగర్ లో ఓ ప్రభుత్వోద్యోగి చేతిలో నుంచి బ్యాగ్ ను బైకర్ చోరులు ఎత్తుకుపోయారు. ఆ క్రమంలో వాళ్లు బలంగా నెట్టేయడంతో ఆ ఉద్యోగి రోడ్డుపై పడిపోయి గాయాలపాలయ్యారు. బైకర్ చోరుల ఆగడాలు అక్కడితోనే ఆగడం లేదని చట్టవిరుద్ధంగా ఆయుధాల రవాణాను కూడా చేస్తున్నట్లు పోలీసుల పరిశోధనలో వెల్లడయింది.
క్రీడాకారుడూ చోరుడే..
ఆగస్ట్ 23న 26 ఏళ్ల తైక్వాండో జాతీయ స్వర్ణ పతక విజేతను స్నాచింగ్, రొబరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఓ పిస్టల్, చోరీ చేసిన 2 ఖరీదైన మొబైల్ ఫోన్లు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్ట్ 5న అతను వికాస్ పురిలోని ఓ మహిళ చేతిలోని మొబైల్ ఫోన్ ను కొట్టేసి పారిపోయాడు. అనంతరం పోలీసులకు పట్టుబడ్డా ప్రస్తుతం తీహార్ జైలు నుంచి బెయిల్ పై మళ్లీ బయటకు వచ్చాడు. ఇటువంటి నేరాలకు పాల్పడిన వారిపై ఐపీసీ సెక్షన్ 356 (చోరీ, దోపీడీ) కేసు మాత్రమే నమోదు చేయడం వల్ల ప్రయోజనం ఉండడం లేదని ఢిల్లీ పోలీసు మాజీ అధికారి నౌపుర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఈ నేరానికి పాల్పడ్డ వారికి బెయిల్ లభిస్తోంది, నేరం రుజువయ్యాక కేవలం రెండేళ్ల జైలు పడుతోంది. కచ్చితంగా ఇటువంటి నేరాల అదుపునకు కఠినమైన కేసుల నమోదు తప్పనిసరి అని ఆమె అన్నారు. ఇటీవల హర్యానాలో స్నాచింగ్ కేసును ఉదహరిస్తూ అందులో నిందితుడిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారన్నారు. నేరం రుజువయ్యాక నిందితుడికి 10 సంవత్సరాలు కారాగారవాసం పడిందని చెప్పారు.
మాన్యులకూ తప్పని స్నాచింగ్..
రాజధాని ఢిల్లీలో సామాన్యులకే కాక పెద్ద పదవుల్లో ఉన్న కుటుంబాల వారికి చైన్ స్నాచింగ్ ల బెడద తప్పడం లేదు. భారత సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా భార్య అపర్ణా మెహతా మొబైల్ ఫోన్ ను బైకర్ చోరులు అత్యంత లాఘవంగా లాక్కుపోయారు. ఆగస్ట్ 18న సాయంత్రం ఆమె సెంట్రల్ ఢిల్లీ సమీపంలోని ఎఫ్.ఐ.సి.సి.ఐ ఆడిటోరియం నుంచి వస్తుండగా బైక్ పై వచ్చిన దుండగులు ఆమె మొబైల్ ఫోన్ ను గుంజుకున్నాక మెడలో చైన్ ను తెంచడానికి యత్నించారు. అయితే అపర్ణా ప్రతిఘటించడంతో మొబైల్ ఫోన్ ను మాత్రం ఎత్తుకుని పరారయ్యారు.
నేరాల అదుపునకు 190 పోలీసు టీంలు..
ఢిల్లీలో చైన్ స్నాచింగ్ తదితర నేరాల అదుపునకు 190 ప్రత్యేక పోలీస్ జట్లను రంగంలోకి దించినట్లు నగర పోలీస్ కమిషనర్ అముల్యా పట్నాయక్ ఇటీవల సీనియర్ అధికారులతో సమావేశం సందర్భంగా తెలిపారు. కరుడుగట్టిన నేరగాళ్లు అజయ్(35), మోను(40)లను ఎం.సి.ఒ.సి.ఎ. చట్టం కింద అరెస్ట్ చేసి జైలుకు తరలించామన్నారు. అయితే వాళ్లిద్దరూ ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చారని వారిపైన నిఘా ఉంచినట్లు తెలిపారు.
నివేదిక కోరిన ఢిల్లీ హైకోర్టు..
ఢిల్లీలో నేరాలకు సంబంధించి ఆప్ సర్కార్, లెప్టినెంట్ గవర్నర్ లు సవివర నివేదికల్ని అందజేయాలని హైకోర్టు ఇటీవల ఆదేశాలచ్చింది. కార్యాచరణ ప్రణాళికను అంశాల వారీగా పేర్కొనాలని సూచించింది. నగరంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల వివరాలు, గస్తీ, నేరాలు, నేరస్తుల పోకడలు, పోలీసులు ఛేదించిన కేసుల ప్రగతి తెలపాలని ఆదేశించింది.


Wednesday, September 25, 2019

PM Modi gets 'Global Goal keeper' award for Swachh Bharat Abhiyan


ప్రధాని మోదీకి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు ప్రదానం
భారత ప్రధాని నరేంద్ర మోదీ కి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డును బిల్ అండ్ మెలిండ గేట్స్ ఫౌండేషన్ ప్రదానం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ న్యూయార్క్ లో బుధవారం (భారత కాలమానం ప్రకారం) జరిగిన కార్యక్రమంలో ఈ అత్యుత్తమ అవార్డును బిల్ గేట్స్ చేతుల మీదుగా అందుకున్నారు. దేశంలో `స్వచ్ఛ భారత్ అభియాన్` కార్యక్రమాన్ని 2014లో మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2న కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. బాపూజీ 150వ జయంత్యుత్సవాలు జరుగుతున్న సంవత్సరంలో ఈ అవార్డు లభించడం తనకు వ్యక్తిగతంగా ఎంతో విలువయిందంటూ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 130 కోట్ల మంది భారతీయులు స్వచ్ఛభారత్ లో పాల్గొంటూ ఎటువంటి అవరోధాన్నైనా ఎదుర్కోడానికి సిద్ధమని ప్రతిజ్ఞ  చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. గడిచిన అయిదేళ్లలో 11 కోట్ల మరుగుదొడ్లను గ్రామగ్రామాన నిర్మించినట్లు తెలిపారు. ప్రజాఉద్యమంగా కొనసాగుతున్న శుభ్రత కార్యక్రమాల వల్ల సుమారు 3 లక్షల మంది ప్రాణాల్ని రక్షించుకోగలిగామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు.హెచ్.ఒ) ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు చెప్పారు. బిల్ అండ్ మెలిండ గేట్స్ ఫౌండేషన్ కూడా భారత్ లో గ్రామీణ పారిశుద్ధ్యం ఎంతో మెరుగుపడినట్లు పేర్కొందన్నారు. గాంధీజీ కలలు గన్న పరిశుభ్రత సాకరమయినందుకు ఆనందంగా ఉందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం కేవలం భారతీయుల జీవన ప్రమాణాల్ని మాత్రమే కాక ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన యావత్ మానవాళి జీవనప్రమాణాల పెంపునకు దోహదం చేసేదన్నారు. వసుదైక కుటుంబ (The whole world is one single family) తత్వం విశ్వవ్యాప్తం కావాలనే ఆకాంక్షను ఈ సందర్భంగా మోదీ పునరుద్ఘాటించారు.

Tuesday, September 24, 2019

Gandhians, social activists to take out year-long march from Delhi to Geneva


అక్టోబర్ 2న న్యూఢిల్లీ-జెనీవా `జై జగత్` యాత్ర
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీ-జెనీవా `జై జగత్` యాత్ర (victory of the world) ప్రారంభం కానుంది. అహింస, శాంతి సందేశాలపై విశ్వవ్యాప్త ప్రచారం సాగించడంలో భాగంగా 15000 కి.మీ. మేర ఈ యాత్ర కొనసాగనుంది. సుమారు 200 మంది గిరిజన, దళిత ఉద్యమకర్తలు, రచయితలు, ప్రఖ్యాత గాంధేయ సిద్ధాంతకర్తలు, అభిమానులు న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ నుంచి ప్రారంభమయ్యే ఈ సుదీర్ఘ మార్చ్ లో పాల్గొంటున్నారు.  ఈ యాత్ర 10 దేశాల గుండా సాగనుంది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, సెనెగల్, స్వీడెన్, బెల్జియం తదితర దేశాల నుంచి తరలిన జైజగత్ యాత్రికులందర్నీ కలుపుకుంటూ 2020 సెప్టెంబర్ 26 నాటికి జెనీవా చేరనున్నట్లు ఏక్తా పరిషద్ జాతీయ సంయోజకుడు అనీశ్ థిలెన్కెరి తెలిపారు. గతంలో అనుకున్న ప్రణాళిక ప్రకారం జైజగత్ యాత్ర న్యూఢిల్లీ నుంచి అట్టరి-వాఘా సరిహద్దుల మీదుగా సాగాల్సి ఉంది. పాక్ లో రెణ్నెల్లు యాత్ర కొనసాగించాలనుకున్నారు. అనంతరం లాహోర్ మీదుగా ఇరాన్ చేరాల్సి ఉంది. అయితే ప్రస్తుతం భారత్- పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించుకున్నారు. తాజా యాత్రను రాజ్ ఘాట్ (ఢిల్లీ) నుంచి ప్రారంభించి మహారాష్ట్రలో గాంధీజీ నెలకొల్పిన సేవాగ్రామ్ కు చేరుకుంటారు. ఆ తర్వాత నాగ్ పూర్ నుంచి యాత్ర ఇరాన్ తరలుతుంది. అక్కడ నుంచి అర్మేనియా తదితర దేశాల గుండా ముందుకు సాగుతుందని అనీశ్ వివరించారు. గాంధీజీ ప్రవచించి, ఆచరించిన అహింసా సిద్ధాంతం పట్ల ఆకర్షితుడైన నికోల్ పష్నియాన్ (ప్రస్తుత ఆర్మేనియా ప్రధానమంత్రి) తమతో పాటు అహింసా సిద్ధాంత శిక్షణ, ప్రచార కార్యక్రమాల్లో కొన్నేళ్లుగా పాలుపంచుకుంటున్నారన్నారు. ఏడాది పాటు వివిధ దేశాల గుండా సాగే జైజగత్ యాత్రికులు ఆయా ప్రాంతాల్లో స్థానిక నిర్వాహకులు సహకారంతో అహింసా ఉద్యమ ప్రచారం, శాంతి స్థాపనలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారని అనీశ్ తెలిపారు. సంఘసేవకులు పి.వి.రాజగోపాల్, గాంధేయ సిద్ధాంతవేత్త, కెనడా నాయకులు జిల్ కార్ హారిస్, దళిత, గిరిజన హక్కుల ఉద్యమకారుడు రమేశ్ శర్మ జైజగత్ యాత్రకు నేతృత్వం వహించనున్నారన్నారు. జెనీవా చేరిన అనంతరం వారం రోజుల పాటు ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థలు, ఇతర సంస్థలతో కలిసి పేదరికం, పర్యావరణ సమస్యలు, అహింసావాదం, సాంఘిక బహిష్కరణ తదితర అంశాలపై జాగృతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.