దేశ రాజధానిలో నేరగాళ్ల
స్వైర విహారం
పెరుగుతోన్న
నేరాలతో దేశ రాజధాని ఢిల్లీ వణుకుతోంది. పట్టపగలే బైక్ లపై స్వైరవిహారం చేస్తూ
నేరగాళ్లు హస్తినాపురవాసుల్ని భయపెడుతున్నారు. మహిళల మెడలో గొలుసులు, మొబైల్ ఫోన్లు,
బ్యాగుల చోరీలే లక్ష్యంగా బరి తెగిస్తున్నారు. తాజాగా ఓ మహిళా జర్నలిస్టు మొబైల్
దోపిడీకి పాల్పడ్డారు. గడిచిన ఆదివారం చిత్రంజన్ పార్క్ ప్రాంతంలో షాపింగ్ చేసి
ఆటోలో ఇంటికి తిరుగుప్రయాణమైన మహిళా జర్నలిస్ట్ జోయ్మాల బగాచిని బైక్ పై వచ్చిన
ఇద్దరు ఆగంతకులు అటకాయించారు. ఆమె మొబైల్ ను గుంజుకున్నారు. ఈ పెనుగులాటలో
కదులుతున్న ఆటో నుంచి ఆమె రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. సాయంత్రం 6
సమయంలో జరిగిన ఈ ఘటనలో బగాచి దవడ ఎముక విరిగిపోయింది. చబుకం భాగం చీలిపోవడంతో
కుట్లు పడ్డాయి. స్థానికులు స్పందించి రక్తమోడుతున్న ఆమెను ఆలిండియా ఇన్
స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. చికిత్స పొందుతున్న ఆ
మహిళా జర్నలిస్ట్ ను రాష్ట్ర మహిళా కమిషన్
చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఇంతవరకు నిందితుల్ని
పట్టుకోవడంలో విఫలమైన పోలీసులపై చైర్ పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చోరీ చేసిన
బైక్ లపై ప్రయాణిస్తున్న దుండగులు మహిళలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నారు.
నేరాల్లో మైనర్లే ఎక్కువ..
మెడలో
గొలుసులు తెంచుకోపోయే చోరుల్లో అధికశాతం మైనర్లే ఉంటున్నట్లు పోలీస్ రికార్డులను
బట్టి స్పష్టమౌతోంది. సులభంగా డబ్బు సంపాదించాలనుకొనే వాళ్లు, స్నేహితులతో
జల్సాలకు అలవాటు పడిన బాలురే ఎక్కువగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నట్లు
తెలుస్తోంది. వీరంతా ముఠాలుగా ఏర్పడుతుండడం పోలీసుల్ని సైతం కలవరానికి
గురిచేస్తోంది. ఈ ముఠాలు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాదారులుగాను
చలామణిలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికి 4000 గొలుసు చోరీ
కేసులు నమోదు కాగా సుమారు 3 వేల మంది చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్ట్
చేశారు. 2018లో 6,932 గొలుసు దొంగతనం
కేసులు నమోదు కాగా 5,571 మందిని పోలీసులు కటకటాల వెనక్కినెట్టారు. నేరాల తీవ్రత
అత్యంత ఆందోళనకరమైన స్థితికి చేరుకోవడంతో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక కార్యాచరణకు
ఉపక్రమించారు. క్రైం స్పెషల్ సెల్, యాంటీ టెర్రర్ వింగ్ విభాగాలు నేరాల అదుపుపై
దృష్టి సారించాయి. ఈ నేరగాళ్ల ఆటకట్టించేందుకు మహారాష్ట్ర వ్యవస్థాగత నేరనియంత్రణ
చట్టం (ఎం.సి.ఒ.సి.ఎ) తరహాలో ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
ప్రేమికుల జంటది అదే బాట..
ఆగస్ట్
20న ప్రేమికుల జంటను నగర పోలీసులు ఓ చోరీ కేసులో పట్టుకున్నారు. ఈ జోడీ కొట్టేసిన
వస్తువుల్ని విక్రయించి మత్తుపదార్థాలను కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు పోలీసు
విచారణలో వెల్లడయింది. ఈ చోరీ జంటలోని
యువతి పురుషుడి మాదిరిగా దుస్తులు ధరించి తనెవరయింది బయటపడకుండా నేరాలకు
పాల్పడినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్ డిస్ట్రిక్ట్) మోనికా భరద్వాజ్
తెలిపారు. పట్టుబడిన ఈ ప్రేమికుల జంటపై ఐపీసీ సెక్షన్ 411 కింద కేసు నమోదు చేశారు.
మెడలో గొలుసు తెంచుకుపోవడంతోనే ఈ నేరాలు పరిమితం కావడం లేదు. దోపిడీ, దౌర్జన్యం,
హత్యాయత్నం తదితర తీవ్ర హింసాత్మక నేరాలకు ఈ చోరులు పాల్పడుతున్నట్లు పోలీసులు
పేర్కొంటున్నారు. ఈ జులై 14న డిఫెన్స్ కాలనీలోని ఓ హోటల్ లో కుక్ గా పనిచేస్తున్న
22ఏళ్ల యువకుణ్ని బైక్ పై వచ్చిన దుండగులు హత్య చేశారు. తన వద్ద ఉన్న వస్తువును
లాక్కుపోవడానికి ప్రయత్నించగా అతను ప్రతిఘటించడంతో ఆగంతకులు ఈ దారుణానికి
ఒడిగట్టారు. దుండగుల్ని తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఒకడు మైనర్.
జులై2న స్థానిక లక్ష్మీ నగర్ లో ఓ ప్రభుత్వోద్యోగి చేతిలో నుంచి బ్యాగ్ ను బైకర్
చోరులు ఎత్తుకుపోయారు. ఆ క్రమంలో వాళ్లు బలంగా నెట్టేయడంతో ఆ ఉద్యోగి రోడ్డుపై
పడిపోయి గాయాలపాలయ్యారు. బైకర్ చోరుల ఆగడాలు అక్కడితోనే ఆగడం లేదని చట్టవిరుద్ధంగా
ఆయుధాల రవాణాను కూడా చేస్తున్నట్లు పోలీసుల పరిశోధనలో వెల్లడయింది.
క్రీడాకారుడూ చోరుడే..
ఆగస్ట్
23న 26 ఏళ్ల తైక్వాండో జాతీయ స్వర్ణ పతక విజేతను స్నాచింగ్, రొబరీ కేసులో పోలీసులు
అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఓ పిస్టల్, చోరీ చేసిన 2 ఖరీదైన మొబైల్ ఫోన్లు,
బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్ట్ 5న అతను వికాస్ పురిలోని ఓ మహిళ చేతిలోని మొబైల్
ఫోన్ ను కొట్టేసి పారిపోయాడు. అనంతరం పోలీసులకు పట్టుబడ్డా ప్రస్తుతం తీహార్ జైలు
నుంచి బెయిల్ పై మళ్లీ బయటకు వచ్చాడు. ఇటువంటి నేరాలకు పాల్పడిన వారిపై ఐపీసీ
సెక్షన్ 356 (చోరీ, దోపీడీ) కేసు మాత్రమే నమోదు చేయడం వల్ల ప్రయోజనం ఉండడం లేదని
ఢిల్లీ పోలీసు మాజీ అధికారి నౌపుర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఈ నేరానికి పాల్పడ్డ
వారికి బెయిల్ లభిస్తోంది, నేరం రుజువయ్యాక కేవలం రెండేళ్ల జైలు పడుతోంది.
కచ్చితంగా ఇటువంటి నేరాల అదుపునకు కఠినమైన కేసుల నమోదు తప్పనిసరి అని ఆమె అన్నారు.
ఇటీవల హర్యానాలో స్నాచింగ్ కేసును ఉదహరిస్తూ అందులో నిందితుడిపై నాన్ బెయిలబుల్
కేసు నమోదు చేశారన్నారు. నేరం రుజువయ్యాక నిందితుడికి 10 సంవత్సరాలు కారాగారవాసం
పడిందని చెప్పారు.
మాన్యులకూ తప్పని స్నాచింగ్..
రాజధాని
ఢిల్లీలో సామాన్యులకే కాక పెద్ద పదవుల్లో ఉన్న కుటుంబాల వారికి చైన్ స్నాచింగ్ ల
బెడద తప్పడం లేదు. భారత సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా భార్య అపర్ణా మెహతా మొబైల్
ఫోన్ ను బైకర్ చోరులు అత్యంత లాఘవంగా లాక్కుపోయారు. ఆగస్ట్ 18న సాయంత్రం ఆమె
సెంట్రల్ ఢిల్లీ సమీపంలోని ఎఫ్.ఐ.సి.సి.ఐ ఆడిటోరియం నుంచి వస్తుండగా బైక్ పై
వచ్చిన దుండగులు ఆమె మొబైల్ ఫోన్ ను గుంజుకున్నాక మెడలో చైన్ ను తెంచడానికి
యత్నించారు. అయితే అపర్ణా ప్రతిఘటించడంతో మొబైల్ ఫోన్ ను మాత్రం ఎత్తుకుని
పరారయ్యారు.
నేరాల అదుపునకు 190 పోలీసు టీంలు..
ఢిల్లీలో
చైన్ స్నాచింగ్ తదితర నేరాల అదుపునకు 190 ప్రత్యేక పోలీస్ జట్లను రంగంలోకి
దించినట్లు నగర పోలీస్ కమిషనర్ అముల్యా పట్నాయక్ ఇటీవల సీనియర్ అధికారులతో సమావేశం
సందర్భంగా తెలిపారు. కరుడుగట్టిన నేరగాళ్లు అజయ్(35), మోను(40)లను ఎం.సి.ఒ.సి.ఎ.
చట్టం కింద అరెస్ట్ చేసి జైలుకు తరలించామన్నారు. అయితే వాళ్లిద్దరూ ప్రస్తుతం
బెయిల్ పై బయటకు వచ్చారని వారిపైన నిఘా ఉంచినట్లు తెలిపారు.
నివేదిక కోరిన ఢిల్లీ హైకోర్టు..
ఢిల్లీలో
నేరాలకు సంబంధించి ఆప్ సర్కార్, లెప్టినెంట్ గవర్నర్ లు సవివర నివేదికల్ని
అందజేయాలని హైకోర్టు ఇటీవల ఆదేశాలచ్చింది. కార్యాచరణ ప్రణాళికను అంశాల వారీగా
పేర్కొనాలని సూచించింది. నగరంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల వివరాలు, గస్తీ,
నేరాలు, నేరస్తుల పోకడలు, పోలీసులు ఛేదించిన కేసుల ప్రగతి తెలపాలని ఆదేశించింది.
No comments:
Post a Comment