అక్టోబర్ 2న న్యూఢిల్లీ-జెనీవా `జై జగత్` యాత్ర
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని
పురస్కరించుకుని న్యూఢిల్లీ-జెనీవా `జై జగత్` యాత్ర (victory of the world) ప్రారంభం కానుంది. అహింస, శాంతి సందేశాలపై విశ్వవ్యాప్త ప్రచారం సాగించడంలో
భాగంగా 15000 కి.మీ. మేర ఈ యాత్ర కొనసాగనుంది. సుమారు 200 మంది గిరిజన, దళిత
ఉద్యమకర్తలు, రచయితలు, ప్రఖ్యాత గాంధేయ సిద్ధాంతకర్తలు, అభిమానులు న్యూఢిల్లీలోని
రాజ్ ఘాట్ నుంచి ప్రారంభమయ్యే ఈ సుదీర్ఘ మార్చ్ లో పాల్గొంటున్నారు. ఈ యాత్ర 10 దేశాల గుండా సాగనుంది. యూకే,
ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, సెనెగల్, స్వీడెన్, బెల్జియం తదితర దేశాల నుంచి తరలిన జైజగత్
యాత్రికులందర్నీ కలుపుకుంటూ 2020 సెప్టెంబర్ 26 నాటికి జెనీవా చేరనున్నట్లు ఏక్తా
పరిషద్ జాతీయ సంయోజకుడు అనీశ్ థిలెన్కెరి తెలిపారు. గతంలో అనుకున్న ప్రణాళిక
ప్రకారం జైజగత్ యాత్ర న్యూఢిల్లీ నుంచి అట్టరి-వాఘా సరిహద్దుల మీదుగా
సాగాల్సి ఉంది. పాక్ లో రెణ్నెల్లు యాత్ర కొనసాగించాలనుకున్నారు. అనంతరం లాహోర్
మీదుగా ఇరాన్ చేరాల్సి ఉంది. అయితే ప్రస్తుతం భారత్- పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న
ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించుకున్నారు. తాజా యాత్రను రాజ్
ఘాట్ (ఢిల్లీ) నుంచి ప్రారంభించి మహారాష్ట్రలో గాంధీజీ నెలకొల్పిన సేవాగ్రామ్ కు చేరుకుంటారు.
ఆ తర్వాత నాగ్ పూర్ నుంచి యాత్ర ఇరాన్ తరలుతుంది. అక్కడ నుంచి అర్మేనియా తదితర
దేశాల గుండా ముందుకు సాగుతుందని అనీశ్ వివరించారు. గాంధీజీ ప్రవచించి, ఆచరించిన అహింసా
సిద్ధాంతం పట్ల ఆకర్షితుడైన నికోల్ పష్నియాన్ (ప్రస్తుత ఆర్మేనియా ప్రధానమంత్రి)
తమతో పాటు అహింసా సిద్ధాంత శిక్షణ, ప్రచార కార్యక్రమాల్లో కొన్నేళ్లుగా పాలుపంచుకుంటున్నారన్నారు.
ఏడాది పాటు వివిధ దేశాల గుండా సాగే జైజగత్ యాత్రికులు ఆయా ప్రాంతాల్లో స్థానిక
నిర్వాహకులు సహకారంతో అహింసా ఉద్యమ ప్రచారం, శాంతి స్థాపనలకు సంబంధించిన
కార్యక్రమాల్లో పాల్గొంటారని అనీశ్ తెలిపారు. సంఘసేవకులు పి.వి.రాజగోపాల్, గాంధేయ
సిద్ధాంతవేత్త, కెనడా నాయకులు జిల్ కార్ హారిస్, దళిత, గిరిజన హక్కుల ఉద్యమకారుడు
రమేశ్ శర్మ జైజగత్ యాత్రకు నేతృత్వం వహించనున్నారన్నారు. జెనీవా చేరిన అనంతరం వారం
రోజుల పాటు ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థలు, ఇతర సంస్థలతో కలిసి పేదరికం, పర్యావరణ సమస్యలు,
అహింసావాదం, సాంఘిక బహిష్కరణ తదితర అంశాలపై జాగృతి కార్యక్రమాలు
నిర్వహించనున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment