వినియోగదారుల హక్కుల రక్షణ బిల్లు-2019కు పార్లమెంట్ ఆమోదముద్ర
వినియోగదారుల
హక్కుల రక్షణకు సంబంధించిన బిల్లుకు భారత పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. ఎగువ సభ మంగళవారం వినియోగదారుల రక్షణ బిల్లు-2019ను
మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఇంతకుముందే లోక్ సభలో ఈ బిల్లు పాసయింది. ఈ బిల్లుకు సంబంధించి
పార్లమెంట్ స్థాయీ సంఘం పేర్కొన్న అయిదు సూచనల్ని చేరుస్తూ కేంద్ర ఆహార, వినియోగదారుల
వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 1986 మార్చి
15 నాటి వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం స్థానంలో ప్రస్తుత పార్లమెంట్ ఆమోదం పొందిన వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం-2019 అమలులోకి రానుంది. సీపీఐ సభ్యులు డెరెక్ ఒబెరాయ్,
కెకె రాగేష్ సూచనల ప్రకారం బిల్లులో సవరణలకు గాను పార్లమెంట్ స్థాయి సంఘానికి పంపామని
మంత్రి పాశ్వాన్ తెలిపారు. అత్యధిక సభ్యుల అభ్యంతరాల మేరకు ఆరోగ్య సంరక్షణాంశాల్ని
బిల్లు నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్లు చెప్పారు. అవివాదాస్పదంగా రూపుదిద్దుకున్న
తాజా వినియోగదారుల హక్కుల రక్షణ బిల్లు ప్రకారం వినియోగదారులు వస్తు నాణ్యత, సేవలకు
సంబంధించిన ఫిర్యాదుల్ని వినియోగదారుల వివాద పరిష్కారాల కమిషన్, ఫోరంల్లో ఫిర్యాదు
చేయొచ్చు. వినియోగదారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో కమిషన్, ఫోరంల్లో ఫిర్యాదు
చేసి న్యాయం పొందే అవకాశం లభిస్తుంది. వినియోగదారులకు లోపభూయిష్ఠ సేవలు, నాణ్యత లేని
వస్తువులు విక్రయించినట్లయితే కొత్త వస్తువులు లేదా సొమ్ము అందజేతకు సంబంధించి న్యాయం జరిగేలా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్
అథారిటీ (సీసీపీఏ) అవసరమైన పక్షంలో పర్యవేక్షణ చేస్తుంది.